కంపారిషన్స్ అవసరం లేదు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6392811961.
 నిజంగానే చెప్తున్నాను... తల్లిదండ్రులు పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. అందుకే వారి పిల్లలు అన్నిట్లో ముందుండాలని కలలు కంటారు. అడుగడుగునా వారికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ 
వాళ్ళకు మార్గాన్ని వీరే చూపుతూ వారి ప్రయాణాన్ని సుఖమయంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. అంతా బాగానే ఉంది పిల్లలపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మంచిదే కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ తో వారి మనసులను నొప్పించడం మాత్రం మంచిది కాదు. నేనేమీ ఊహించి ఈ మాటలను చెప్పడం లేదు నిజ జీవితంలో సహజంగా జరుగుతున్న విషయాలను అందరికీ అర్థం అయ్యే కోణంలో పరిచయం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను. 
ఎదురింటి పిల్లాడిని సెంట్రల్ సిలబస్ స్కూల్లో వేశారట, మనం కూడా మన వాళ్ళని అక్కడే వేద్దాం అనుకుని వాళ్ల  పిల్లవాణ్ణి ఆ స్కూల్లో చేర్పిస్తారు. పిల్లలలో రాగద్వేషాలకు చోటు వుండదు అందుకే ఎలాంటి కొత్త వాతావరణంలో వారిని ఉంచినా స్నేహితులతో స్నేహంగా ఇమిడిపోయి అక్కడి పరిస్థితులతో త్వరగానే అలవాటు పడతారు. అంతా బాగానే ఉంది ఈ మార్కులు ఉన్నాయి చూడండి అక్కడే వచ్చేది అసలు తలనొప్పి. 
ప్రోగ్రెస్ కార్డు చేతికి రాగానే
పిల్లల ప్రోగ్రెస్ చూసి ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించి క్రితం కన్నా మెరుగుపడిన వారి సామర్థ్యాన్ని గమనిస్తూ సంతోషపడే తల్లిదండ్రులు చాలా తక్కువమంది. ప్రోగ్రెస్ కార్డు వచ్చిందా అయితే నీతో కలిసి ఉంటాడు కదా వాడికి ఎంత వచ్చింది, వీడికి ఎంత వచ్చింది అని ఆరాలు తీసే వాళ్ళే ఎక్కువ. తోటి పిల్లల కన్నా ఎక్కువ వస్తే పర్వాలేదు అదే తక్కువ వస్తే వామ్మో ఇంకేముంది ఇంట్లో కురుక్షేత్రం మొదలైనట్టే. వాడు చూడు ఎలా చదువుతున్నాడు, వీడిని చూడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అంటూ పక్కవారితో కంపేర్ చేస్తూ
వారి పిల్లలను తక్కువ చేసే, ప్రయత్నం చేస్తారు. అది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. పిల్లల్ని ఇలా కంప్యార్ చేయడం వల్ల, వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం వల్ల, వారిలో తెలియకుండానే కాన్ఫిడెన్స్ తగ్గడం మొదలవుతుంది. దాంతో వాళ్లను వాళ్ళు తక్కువ చేసుకుంటూ జీవిస్తారు. ఇలాంటి దుస్థితి (ఆత్మ నియోనతా భావం) మీ
పిల్లలకి అవసరమా చెప్పండి.
అందుకే వారిలో వున్న లోటు పాట్లను సవరించే ప్రయత్నం చేయాలి తప్ప వారిలోని లోపాలను ఎత్తిచూపకూడదు.
ఈ విషయంలో పిల్లల తప్పు ఏమీ లేదు ఆలోచించాల్సిందంతా పెద్దలే.... ఆలోచిస్తారు కదూ....


కామెంట్‌లు