పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట (జానపద సరదా నీతి కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒకడుండేటోడు. వాడు చానా మంచోడు. కానీ చానా పేదోడు. రోజూ కూలిపనికి పోతే తప్ప ఇండ్లు గడవదు. ఒక రోజు వాని పెండ్లాం “ఇట్లా ఎంత కాలమని కష్టపడతాం. ఒక్కరోజు కూలీకి పోకపోయినా కడుపుకింత అన్నంలేక కష్టమయిపోతా వుంది. నా దగ్గర నాలుగు వరహాలున్నాయి. వాటిని తీసుకోని నగరానికి పోయి ఏదైనా వ్యాపారం చెయ్. అదృష్టం బాగుంటే బాగా సంపాదించుకోవచ్చు" అని చెప్పి వాని చేతిలో నాలుగు వరహాలు పెట్టింది.
వాడు పొద్దున్నే ఇంకా తెలవారక ముందే లేచి, తలస్నానం చేసి, దేమునికి మొక్కుకోని, పెండ్లాం కట్టిచ్చిన సద్దిమూట సంకన బెట్టుకోని నగరానికి బైలుదేరినాడు. మధ్యలో ఒక అడవి దాటాలి. ఆ అడవిలో నడిచీ నడిచీ కాళ్ళు పీకసాగినాయి. 
అంతలో దూరంగా ఒక ముసిలోడు పోతా కనబన్నాడు. మాట్లాడతా పోతే కష్టం కనబడదు గదా అందుకని వాడు "ఓ తాతా... ఓ తాతా..." అని గట్టిగా పిల్చినాడు. కానీ ఆ ముసిలోడు ఆ అరుపు వినబన్నా వినబడనట్టే తన మానాన తాను అట్లాగే పోసాగినాడు. ఇనబల్లేదేమో అని వీడు మరొక్కసారి గట్టిగా కేకేసినాడు. వూహూ! ఆ ముసిలోడు కొంచం గూడా తల తిప్పి చూడలేదు.
దాంతో వాడు వురుక్కుంటా ఆ ముసిలోని దగ్గరికి పోయి “ఏం తాతా! పిలిస్తే కూడా పలకకుండా పోతా వున్నావ్" అన్నాడు. 
దానికా ముసిలోడు "చూడు నాయనా! నేనందరి మాదిరి పనీపాటా లేకుండా వూరికే మాట్లాడే రకం కాదు. నా మాట బంగారు మూట. ఒక్కో వరహాకి ఒక్కో మంచి మాట మాట్లాడతా. నీకిష్టమైతే మాట్లాడు. లేదంటే లేదు" అన్నాడు.
'పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట' అన్నారు గదా... అందుకని వాడు సరేనని ఒక వరహా ఇచ్చినాడు. అప్పుడా ముసిలోడు "ఆపదల్లో వున్నవారిని ఆదుకోవడం మరవొద్దు" అన్నాడు. 
సరేనని వాడు ఇంకో వరహా ఇచ్చినాడు. "కొత్త స్థలానికి పోతే ఏమరుపాటుగా వుండొద్దు" అన్నాడు. 
"సరే ఇంగో మాట చెప్పు" అని వాడు మూడో వరహా కూడా ఇచ్చినాడు. అప్పుడా ముసిలోడు దాన్ని తీసుకోని “ఎంత ఎదిగినా మొదట చేసిన పని మరవొద్దు" అన్నాడు. 
ఇంగ వాని దగ్గర ఒకే ఒక వరహా మిగిలింది. ఏమైతే అదే కానియ్యని ఆఖరికి దాన్ని గూడా ఇచ్చినాడు. అప్పుడా ముసిలోడు “తొలి కోపం మంచిది గాదు. దాన్ని విడిచి పెట్టాల" అని చెప్పినాడు. 
అట్లా నాలుగు వరహాలు తీసుకోని నాలుగు మంచి మాటలు చెప్పి ఆ ముసిలోడు వెల్లిపోయినాడు.
వాడు అట్లా పోతా పోతా చీకటి పడే సమయానికి ఒక రాజ్యానికి చేరుకున్నాడు. నడిచీ నడిచీ పొద్దున తిన్నదంతా అరిగిపోవడంతో ఒక ఇంటి ముందు కూచోని పెండ్లాం కట్టిచ్చిన సద్దిమూట ఇప్పుకోని తినడం మొదలు పెట్టినాడు. అట్లా తింటా తింటా వుంటే ఆ ఇంట్లో నుండి ఘొల్లుమని ఏడుపు వినబడింది. 
"ఏందబ్బా అందరూ అట్లా ఏడుస్తా వున్నారు" అనుకోని లోపలికి పోయి “ఎందుకమ్మా అట్లా ఏడుస్తా వున్నారు? ఏంది మీ బాధ” అనడిగినాడు.  
దానికా యింట్లో వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తా “ఏం చేయమంటావు నాయనా! ఈ ఊరి రాజుకొక కూతురుంది. ఆమె పక్కన ఎవరు పడుకున్నా పొద్దునకల్లా నురగలు కక్కుకోని చస్తా వున్నారు. ఎవరైతే అట్లా సావకుండా బతుకుతారో వానికి ఆమెనిచ్చి పెండ్లి చేయడమే గాక, ఈ రాజ్యానికి రాజుని కూడా చేస్తారంట. మొదట్లో కొంతమంది పోయినారుగానీ... పోయిన ప్రతొక్కరూ చస్తావుంటే ఇప్పుడు ఎవరూ పోవడం లేదు. దాంతో మారాజు రోజుకొక ఇంటి నుంచి ఒకడు పోవాలి. పోకపోతే ఆ ఇంట్లో అందరినీ చంపేస్తానని ఆజ్ఞాపించినాడు. ఈరోజు మా వంతు వచ్చింది. నాకున్నది వీడొక్కడే కొడుకు. అదీ నా బాధ” అని చెప్పింది.
అప్పుడు వానికి “ఆపదల్లో వున్నవారిని ఆదుకోవడం మరవొద్దు" అని ముసిలోడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. 
వెంటనే "అమ్మా! నువ్వేం బాధ పడొద్దు. నీ కొడుకు బదులు నేను పోతా. నాకెవరూ లేరు" అని చెప్పి వాళ్ళు వద్దు వద్దన్నా వినకుండా పోయినాడు. భటులు వాన్ని తీస్కోనిపోయి యువరాణి గదిలో వదిలినారు.
వాడు యువరాణి పెట్టినేటివన్నీ బాగా తిన్నాడు. నెమ్మదిగా నిద్ర ముంచుకోని రాసాగింది. మంచమ్మీద పండుకున్నాడు. కండ్లు మూసుకుపోతున్నంతలో "కొత్త స్థలానికి పోతే ఏమరుపాటుగా వుండొద్దు" అని ముసిలోడు చెప్పిన మాట గుర్తుకొచ్చి టక్కున లేసి కూచున్నాడు.
నిద్రపోగూడదని కత్తి తీసుకోని వేలు కోసుకోని నిమ్మకాయ పెట్టుకున్నాడు. ఆ మంటకు ఇంక నిద్రేమి వస్తాది. దాంతో వాడు నిద్ర రాకపోయినా కదలకుండా మెదలకుండా మట్టసంగా మంచమ్మీద పండుకోని నిద్రపోతున్నట్టు నటించసాగినాడు.
అర్ధరాత్రి దాటగానే వానికి బుస్సుమని చప్పుడు వినబడింది. అదిరిపడి లేసి చూస్తే వాడు పండుకున్న మంచం కోళ్ళలోంచి రెండు పాములు సర్రున బైటకొస్తా కనబడినాయి. "ఓహో... ఇదా సంగతి" అనుకోని చటుక్కున కత్తి తీసి దాండ్లను కసుక్కున నరికి పారేసినాడు. అవి గిలగిలగిల కొట్టుకుంటా చచ్చిపోయినాయి.
పొద్దున్నే భటులు తలుపు తెరచి చూస్తే ఇంకేముంది మంచమ్మీద కూచోని చిరునవ్వులు నవ్వుతా కనబన్నాడు. వాళ్ళు అచ్చర్యపోయి వురుక్కుంటా పోయి రాజుకు చెప్పినారు. రాజు వెంటనే వాని దగ్గరకొచ్చి విషయమంతా కనుక్కోని సంబరపడి చెప్పిన మాట ప్రకారమే కూతురిని వానికి ఇచ్చి పెండ్లి చేసి రాజ్యానికి రాజును చేసినాడు.
"ఎంత ఎదిగినా మొదట చేసిన పని మరువగూడదు" అని ముసిలోడు చెప్పినాడు గదా. అందుకని వాడు రాజయినా సరే రోజూ కొంత సేపు పలుగూ పారా పట్టుకోని, పాత పంచ కట్టుకోని పొలానికి పోయి కష్టపడి పని చేసేటోడు. జనాలందరినీ ప్రేమగా పలకరించేటోడు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా కన్నబిడ్డల్లా ఆదుకునేటోడు. ఇది చూసి ఆ ఊరి జనాలు “అబ్బ మా రాజు ఎంత మంచోడు. ఇట్లాంటి రాజు ప్రపంచంలో యాడా వుండడు" అని చెప్పుకోని మురిసిపోయేటోళ్ళు. 
ఆ రాజ్యానికి ఒక సేనాధిపతి వున్నాడు. వాడు చానా దుర్మార్గుడు. ఎట్లాగైనా సరే రాజు కావాలని వాని కోరిక. అందుకని వాడు కొంతమంది సైనికులకు బాగా డబ్బులిచ్చి లొంగదీసుకోని ఒకరోజు రాత్రి రాజునూ, రాణినీ బంధించి చెరసాలలో వేసి తానే ఇప్పటి నుంచీ ఈ రాజ్యానికి రాజునని ప్రకటించేసుకున్నాడు. 
కానీ ఆ ఊరి జనాలు “అంత మంచి రాజును అన్యాయంగా బంధిస్తావా, మాకు ఆ రాజే కావాలి. నువ్వొద్దు" అంటా కనబడిన కత్తులు, కటార్లు తీసుకోని తిరగబడి దొరికినోన్ని దొరికినట్టు చంపడం మొదలు పెట్టినారు. ఆ దెబ్బకు భయపడి సేనాధిపతి రాజ్యాన్ని వదిలి పారిపోయినాడు. దాంతో వాడు తిరిగి రాజయినాడు.
పెండ్లయి ఎన్ని సమ్మచ్చరాలు దాటినా వానికి పిల్లలు పుట్టలేదు. అంతలో వానికి మొదటి పెండ్లాం గుర్తుకొచ్చింది. దాంతో ఒకరోజు చిన్న పెండ్లానికి జరిగినేదంతా చెప్పి మొదటి పెండ్లాన్ని పిల్చుకోనొస్తానని పోయినాడు. పోతే ఇంటి ముందు ఎవరో చిన్నపిల్లోడు “అమ్మా! అమ్మా!" అంటా తన పెండ్లాం చుట్టే తిరుగుతా కనబన్నాడు. అది చూసి వానికి విపరీతమైన కోపమొచ్చింది. 'నేను లేనప్పుడు ఇది ఎవరినో పెండ్లి చేసుకోని పిల్లోన్ని కూడా కన్నట్లుంది' అనుకోని వురుక్కుంటా పోయి ఇద్దరినీ పట్టుకోని చంపడానికి కత్తి లేపినాడు.
అంతలో “తొలి కోపం మంచిది కాదు. విడిచి పెట్టాలి" అని ముసిలోడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. దాంతో కోపాన్ని తగ్గిచ్చుకోని "ఎవడే వీడు, నిజం చెప్పు" అన్నాడు పెళ్ళాంతో...
అప్పుడామె “వీడెవడో కాదు. మన కొడుకే. నీవు పోయిన ఆరు నెల్లకు పుట్టినాడు. నీవు నన్ను విడిచిపోయేటప్పటికే నాకు నెల తప్పింది. కావాలంటే చుట్టుపక్కలోల్లని అడుగు" అనింది. 
చుట్టుపక్కల జనాలు గూడా "ఆమె చెప్పింది నిజమే. ఆరోజు నుండీ రాత్రింబగలూ నీ కోసమే ఎదురుచూస్తా వుంది" అని చెప్పినారు.
దాంతో వాడు “తొందరపడి అన్యాయంగా నా పెండ్లాంబిడ్డలను చంపుకొంటా వుంటినే" అని బాధపడి, వాళ్ళకు జరిగిన విషయమంతా చెప్పి తనతోబాటు రాజ్యానికి తీసుకోనిపోయినాడు. అక్కడ అందరూ కలసిమెలసి హాయిగా బతికినారు.
**********
కామెంట్‌లు