నల్లకుక్క (జానపద నీతి కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒకామె వుండేది. ఆమెకు లేకలేక ఒక కొడుకు పుట్టినాడు. వానికి పదేండ్ల వయసొచ్చినా ఆమెకు ఇంకెవరూ పుట్టలేదు. ఒక్కడుంటే ఏం బాగుంటుంది. ఆడుకోవడానికి, పాడుకోవడానికి వానికి ఇంకొకడన్నా తోడు వుండాల గదా. అందుకని ఆమె గుడికి పోయి సుంకులమ్మకు మొక్కుకోని "అమా... అమా... వుండేది ఒక్కడే కొడుకు. వానికేమన్నా అయితే నా వంశమెట్లా... ఇంకొకన్నివ్వమ్మా" అని కండ్లనీళ్ళు పెట్టుకోనింది.
అప్పుడు సుంకులమ్మ ప్రత్యక్షమై "సరే ఇస్తా... కానీ కొడుకు పుడతానే నువ్ చచ్చిపోతావ్... సరేనా...” అనింది. ఆమె సరేననింది. దేవత చెప్పినట్టుగానే కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్నాడు. పురిట్లోనే ఆమె చచ్చిపోయింది.
పిల్లలిద్దర్నీ ఆమె మొగుడే పెంచసాగినాడు. అట్లా ఆ పిల్లోనికి ఐదేండ్ల వయసొచ్చేసరికి వాళ్ళ నాయన గూడా జబ్బుపడి చచ్చిపోతా... చచ్చిపోతా... పెద్దకొడుకుని పిలిచి “రేయ్... చిన్నోన్ని జాగ్రత్తగా... బాగా చూసుకో. నువ్వే వానికి దిక్కు" అని చెప్పి చచ్చిపోయినాడు.
పెద్దోడు నాయన చచ్చిపోయినాక ఇంట్లో దీపం పెట్టేటోళ్ళు ఎవ్వరూ లేక పెండ్లి చేసుకున్నాడు. 
కొంతకాలానికి వాళ్ళకిద్దరు పిల్లలు పుట్టినా పెద్దోడి పెండ్లాం తన పిల్లలతోబాటు మరిదిని కూడా కన్నకొడుకులా బాగా చూసుకునేది. ఏదీ తక్కువ చేసేది కాదు.
వాళ్ళ పక్కింట్లో ఒక ముసల్ది వుండేది. ఆమె బుద్ది మంచిది గాదు. ఎవరైనా పచ్చగా కనబడితే సాలు అక్కడ తన మాటలతో అగ్గి రాజేసేది. ఆమె రోజూ ఎవరూ లేనప్పుడు వాళ్ళింటికొచ్చి “సూడు... నువ్విట్లాగే ఆ చిన్నోన్ని గారాబంగా నెత్తిన పెట్టుకోని చూసుకుంటుంటే రేప్పొద్దున కష్టం. వాడు పెరిగి పెద్దగయినాక ఆస్తిలో వాటా అడుగుతాడు. నీకు నీ పిల్లలకు చిప్ప తప్ప ఏమీ మిగలదు. జాగ్రత్త" అంటూ బాగా ఎక్కియ్యసాగింది.
ఎంత మంచోళ్ళైనా సరే పదేపదే చెప్పుడు మాటలు వింటే వాళ్ళకు నెమ్మదిగా అవి తలకెక్కుతాయి గదా. అట్లాగే ఆమెకూ ఆ మాటలు కొంచం కొంచెంగా ఎక్కేసినాయి. 
దాంతో ఒకరోజు ముసల్దానితో “మరెట్లా చిన్నోని పీడ తొలగిచ్చుకోవడం" అనడిగింది. 
దానికా ముసల్ది “నాకు తెలిసిన ఒక మంత్రగాడున్నాడు. వానికి మాయలూ, మంత్రాలు బాగా వచ్చు. వాన్నడిగొస్తా" అని మంత్రగాని దగ్గరికి పోయి వానికి అన్నీ వివరంగా చెప్పింది. 
ఆ మంత్రగాడిచ్చిన ఓ సీల తెచ్చి ఆమెకిచ్చి “ఇది వాని నెత్తిన కొట్టు.తరువాత ఏమి జరుగుతుందో నువ్వే చూడు" అని చెప్పింది.
ఆమె సరేనని తరువాత రోజు చిన్నోని తల దువ్వుతున్నట్టే దువ్వుతా ఠక్కున సీల వాని నెత్తిన గుచ్చేసింది. అంతే.. పాపం చిన్నోడు అక్కడికక్కడే నల్లకుక్కగా మారిపోయినాడు.
కుక్కైపోయినాక మాట్లాడ లేడు గదా... దాంతో చిన్నోడు ఇంటి చుట్టూ భౌభౌమని తిరుగసాగినాడు. కాసేపటికి అన్న ఇంటికి వచ్చినాడు. అన్నను చూస్తానే చిన్నోడు తోకూపుకుంటా భౌభౌమని
మొరుగుతా మీదపడి నాకసాగింది. వానికి అది తన తమ్ముడని తెలీదు గదా... దాంతో “ఛీ... ఛీ... వెధవ కుక్క ఊరికే మీద పడి సతాయిస్తోంది" అనుకుంటా కట్టె తీస్కోనొచ్చి దానిని బాగా తన్ని తరిమేసినాడు.
పాపమా నల్లకుక్క ఏడుస్తా... ఏడుస్తా... పక్కూరికి వెళ్ళిపోయింది. అక్కడొక పొలం దగ్గర రైతులు పెద్దచెట్టు కింద చద్దన్నం మూటలు పెట్టుకోని పొలం దున్నుకోసాగినారు. ఇది ఆ అన్నం మూటల పక్కనే కూచోనింది. ఎంత ఆకలైనా వాటిని ముట్టుకోలేదు వాసన చూడలేదు. 
వాళ్ళు మధ్యాహ్నం వచ్చి చూసి "పాడుకుక్క అన్నం తినిందో ఏమో" అనుకోని ఉరుక్కుంటా వచ్చి చూస్తే ఇంకేముంది ఎట్లావున్న సద్దన్నం మూటలు అట్లానే వున్నాయి. 
"అరే పాపం ఇది చెడ్డకుక్క అనుకున్నాం. కానీ చానా మంచికుక్కనే" అనుకోని దానికి తలా ఒక ముద్ద అన్నం పెట్టినారు. 
అప్పటి నుండీ అది రోజూ వాళ్ళెంబడే పొలానికి పోయి అన్నం మూటలకు కాపలా కూచునేది. వాళ్ళు ఏమన్నా పెడితే తినేది. లేదంటే గమ్మునుండేది.
వాళ్ళొక రోజు ఆ ఊరి రాజు దగ్గరికి పోతా పోతా వెంబడి నల్లకుక్కను గూడా తీస్కోని పోయి “రాజా... రాజా... ఇది చానా మంచిది. ఇట్లాంటి కుక్కను మేం ఇంతవరకూ ఎప్పుడూ ఎక్కడా చూల్లేదు. దీన్ని నీ దగ్గరుంచుకోండి" అని ఇచ్చేసినారు. అప్పట్నించి అది రాజభవనంలోనే వుండేది.
ఆ రాజుకు ఒక కూతురు వుంది. ఆమెది సూడసక్కని అందం. రాజు ఆమెకు పెండ్లి చేయాలనుకున్నాడు. ఎవరినిచ్చి చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే రాత్రి వాళ్ళ ఇంటి దేవత సుంకులమ్మ కలలో కనిపించి “మీ ఇంట్లో ఒక నల్లకుక్కుంది గదా... దాన్నిచ్చి పెళ్లి చేయ్. నేను చెప్పినట్లు చేయకపోతే నువ్వూ ఉండవు. నీ రాజ్యమూ ఉండదు. జాగ్రత్త" అని చెప్పి మాయమైంది. 
దేవత చెప్పినట్టు చేయకపోతే ఆమెకు కోపమొస్తాది గదా... అందుకని రాజు తన కూతురిని నల్లకుక్కకిచ్చి ఘనంగా పెండ్లి చేసినాడు.
నల్లకుక్క ఆరోజు నుండీ యువరాణితో పాటే అంతఃపురంలో  వుండేది. ఆమె యాడికి పోతే ఆడికి పోయేది. ఏమి తింటే అది తినేది. 
ఒకరోజు యువరాణి ఈ నల్లకుక్కకు స్నానం చేపియ్యక ఎన్ని రోజులైందో ఏమో అనుకోని వేడినీళ్ళు పెట్టి , సబ్బేసి బాగా తలస్నానం చేపిచ్చింది. తల రుద్దుతా వుంటే చేతికి గరుకుగా అనిపిచ్చింది. ఏందబ్బా అట్లా చేతికి తగులుతా వుంది" అని వెంట్రుకలు జరిపి బాగా చూస్తే... ఇంకేముంది నడినెత్తిన సీల కనపడింది.
అయ్యో పాపమని ఆమె నెమ్మదిగా సీల పట్టుకుని పీకింది. అంతే నల్లకుక్క కాస్తా అక్కడికక్కడే పదహారేండ్ల పడుచు పిల్లోనిగా మారిపోయింది. అది చూసి ఆమె... “అబ్బ! నా మొగుడు ఎంత చక్కగున్నాడు. అచ్చం అప్పుడే కాసిన బంగినపల్లి మామిడిపండు లెక్క" అని సంబరపడిపోయింది. యువరాణి మొగున్తో బైటకొచ్చేసరికి చూసినోళ్ళందరూ "ఇదేందబ్బా కుక్కనిచ్చి పెండ్లి చేస్తే ఎవరో దక్కని సందమామను వెంటేసుకొని తిరుగుతా వుంది. నల్లకుక్క ఏమైందో ఏమో" అనుకోని వురుక్కుంటా పోయి రాజుకు చెప్పినారు. 
రాజు వురుకులు పరుగుల మీద అక్కడికొచ్చి కూతురితో “ఎవరే... ఈ పిల్లోడు. నల్లకుక్క యాడుంది. దానికి ఏమైంది" అనడిగినాడు. 
అప్పుడామె అందరి ముందూ మొగుని నెత్తి మీద సీల గుచ్చింది. అంతే వాడు అక్కడికక్కడే టకీమని నల్లకుక్కగా మారిపోయినాడు. తీస్తేనే మళ్ళా మామూలు మనిషై పోయినాడు. 
అప్పుడా యువకుడు అందరికీ జరిగిందంతా చెప్పినాడు. 
అది విన్న రాజు "ఏది ఏమైతేనేం... నా కూతురికి సుంకులమ్మ దయవల్ల చందమామలాంటి అందగాడు మొగుడైనాడు కదాని" సంబర పడినాడు.
వాళ్ళిద్దరూ ఒకరోజు మిద్దెపైన కూచోని ముచ్చట్లాడుకుంటా వుంటే దూరంగా వీధి ముందు అన్నావదిన, పిల్లలు కనబన్నారు. వాళ్ళ బట్టలన్నీ చినిగి, దుమ్ముపట్టి వున్నాయి. నెత్తిన కట్టెల మోపు పెట్టుకోని వీధిలో అమ్ముకుంటా వున్నారు. వాడు వెంటనే భటులను పంపించి వాళ్ళను పిలిపిచ్చినాడు.
వాళ్ళు రాజ భవనంలోకి రాగానే దాసీలొచ్చి వేడివేడి నీళ్ళతో వాళ్ళకు తలస్నానం చేపిచ్చి, కట్టుకోవడానికి కొత్త పట్టుబట్టలు ఇచ్చినారు. బంగారు తూగుటుయ్యాల మీద కూచోబెట్టి వూపుతా... కడుపు నిండా కమ్మని భోజనం పెట్టినారు. 
వాళ్ళు వూగుతా... వూగుతా... "ఎవరబ్బా.. ఈ రాజు చానా మంచోని లెక్కున్నాడే" అనుకుంటా వుంటే చిన్నోడు లోపలికొచ్చినాడు.
అన్నావదినలకెళ్లి చూస్తా "వదినా... నన్ను గుర్తుపట్టినావా” అనడిగినాడు. ఆమె మరిదిని గుర్తుపట్టి "నన్ను మన్నించు నాయనా... ఆ ముసల్దాని మాటలు విని నిన్ను బాధ పెట్టినా. అందుకే దేవుడు మాకు తగిన శాస్తి చేసినాడు. ఆస్తంతా పోయి వీధిన పడినాం" అంటూ కండ్లనీళ్ళు పెట్టుకోనింది.
అప్పుడు మరిది "అయిపోయిందేదో అయిపోయిందిలే వదినా. ఇప్పన్నించీ మనమంతా కలిసే వుందాం. మీరు కూడా ఈన్నే వుండండి" అంటూ వాళ్ళను గూడా తనతోబాటే రాజభవనంలో వుంచుకున్నాడు.
**********
కామెంట్‌లు