దర్శనం;---ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం, 9492811322
 ఆస్తికులందరికీ ఆస్తికత్వం గురించి తెలుసునని  నాస్తికులు అందరూ  ఆ విషయంలో నిష్ణాతులు అని  భావించలేం. అసలు నాస్తి, ఆస్తి పదాలకి అర్థం తెలిసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ల గురించి మాట్లాడితే  వినడానికి  మనసు రాదు. భగవంతుడు ఉన్నాడు  అతనిని పూజించాలి  అనుకున్న  ఆస్తికులు  పూలు, పళ్ళు, నీరు అక్కడ పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఎడారిలో ఉన్న వారికి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? వారికి భక్తి లేదా? నీలాంటి ఒకడే కదా అతను కూడా భక్తుడే గా అని వేదాంతులు ఏం చెప్పారంటే పుష్పము అంటే హృదయ కమలం, ధ్యానం అంటే ఆర్తితో ఇచ్చే కన్నీరు అని ఒక వర్గం చెపితే ఎనిమిది రకాలుగా ఏ పద్ధతిలో అయినా తలచిన,  స్పర్శించిన, కీర్తించిన భక్తి కిందకే వస్తుంది పూజ చేసినట్లే లెక్క అని మరొక రకంగా వ్యాఖ్యానిస్తారు. శ్రీమన్నారాయణుని నారద మహర్షి  మీరు ఎక్కడ ఉంటారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా  నేను వైకుంఠం లో నివసించడం లేదు యోగుల హృదయాలలో అంతగా ఉండను. నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ ఉంటాను అని పలికాడు. కనుక భగవంతుడు  భక్త సులభుడు. భక్తితో, ఆర్తితో పిలిచిన మరు క్షణంలో ఆయన మన ముందు ప్రత్యక్షమౌతాడు. వేదాంతులు అక్షరాల ఆచరించి చూపినది  ఇదే కానీ నిజమైన  పూజ గురించి చెప్పుకోవలసి వస్తే  మొదటి పుష్పం ఇతరులకు ఏ రకమైన కష్టనష్టాలు కల్పించకుండా వారి మనసును  నొప్పించకుండా ఉండే  అహింస అనబడే పుష్పం,  రెండవది ఇంద్రియ నిగ్రహం  మనసును జయించలేని నీకు  ఏదీ సాధ్యం కాదు కనుక మనసు నీ చేతిలో పెట్టుకొని దానితో పూజించు అని వేదపండితులు చెబుతూ ఉంటారు. ఇక మూడో పుష్పం  నీ తోటి వారిని సాటివారిని ప్రేమతో చూడు  భూతదయ లేకపోతే  మనస్సు లేనట్లే లెక్క  పొరపాటుగా ఇతరులు ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటిని క్షమించడం ఐదవది.   ఏకాగ్రతతో  ఏ దేవుని పూజించాలి అనుకుంటున్నావో  ఆయనను మనసులో నిలుపుకోవడం  తరువాత తపస్సు. తపస్సు అంటే తపించడం తనను తాను కాల్చుకోవడం  అంటే అరిషడ్వర్గాలను తన స్థానంలో నుంచి వేరు చేయడం, ఏడోవది శాంతి  నీవు ఎలా శాంతియుత జీవితాన్ని గడపాలని కొంటున్నావు  ఎదుటి వారికి కూడా అలాంటి పరిస్థితులను కల్పించు అన్నిటికన్నా ముఖ్యమైనది సత్య భాషణ ఈనాడు అబద్ధాలు చెప్పకుండ నిజాలు మాత్రమే  చెప్పడం అలవాటు చేసుకుంటే  భగవంతుని దర్శించినట్లు అనే భౌతిక స్థితికి సంబంధించిన వ్యాఖ్యానం  భౌతికం లేకుండా ఆది భౌతిక  ఉండదని పెద్దల వాక్యం.


కామెంట్‌లు