విలువ;--సి. హెచ్ . ప్రతాప్;- సెల్ ; 95508 51075
 ఒక అడవిలో   అన్ని జంతువులు సమావేశమయ్యాయి. ఏనుగులు, పులులు,లేళ్ళు, జింకలు, కుందేళ్ళు వంటి అనేక జంతువులు పాల్గొన్న ఆ సమావేశానికి సింహం అధ్యక్షత వహించింది.ఒక్కొక్క జంతువు తమకు ఎదురవుతున్న కష్టాలు, వాటికి ఏం చేయాలన్న విషయలను గురించి చర్చించాయి.
 
ఆ సమావేశంలో పందులు పాల్గొనకపోవడం గురించి  సింహం అడిగింది."రాజా, మేము కావాలనే పందిని పిలవలేదు. అవి చూడడానికి చాలా అసహ్యంగా వుంటాయి. వాటి నుండి వచ్చే దుర్వాసనను భరించడం చాలా కష్టం.పైపెచ్చు ఎప్పుడూ బురదలో పొర్లాడడం, కల్మషాన్ని ఇష్టంగా తింటూ మన జంతువుల జాతికి చెడ్డ పేరు తెస్తోంది. అందుకే దానిని మన జాతి నుండి, సంఘం నుండి వెలివేసాము" అంటూ గొప్పగా చెప్పింది నక్క.
 
ఆ మాటలు సింహానికి రుచించలేదు.అయితే అన్ని జంతువులు భళా భళా అంటూ చప్పట్లు కొట్టడం వలన సంఖ్యా బలానికి తల ఒగ్గి మరి మాట్లాడకుండా ఊరుకుంది.
 
సమావేశం, తనను వెలివేసిన సంగతి తెలుసుకున్న పంది ఎంతో బాధపడింది. తన ఆకారం అలా వుండడం తన తప్పు కాదుగా ! దానిని మార్చడం కష్టం. అయితే కల్మషం తినడం మానేస్తే తన పట్ల అసహ్యం తగ్గవచ్చునని ఆలోచించి ఆ రోజు నుండి ఆ అడవిలో కల్మషం తినడం మానేసింది పంది.
 
కొంతకాలానికి ఆ అడవిలో కల్మషం గుట్టలు గుట్టలుగా పేరుకు పోసాగింది. అందువలన దుర్ఘంధం ఎక్కువై అక్కడ వుండడమే కష్టమైపోయింది.  అనేక వ్యాధులు కూడా   ప్రబల సాగాయి.
 
జంతువులన్నీ తిరిగి గుహకు వెళ్ళి సింహానికి తమ బాధలు చెప్పుకున్నాయి.
 
" చూసారా, పంది కూడా మనలాగే ఈ భూమిపై పుట్టింది. తన స్వభావానికి అనుగుణంగా కల్మషం తింటొంది. అందువలన మనకు ఎంతో అరోగ్యకర వాతావరణం ఏర్పడింది. అంతే ప్రకృతి లో చెడు పదార్ధాల మూలంగా వ్యాపించే కాలుష్యాన్ని పంది తాను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తుంది. కాని మన అసహ్య భావన వలన ఆ అమేధ్యం తినడం మానేసాక కాలుష్యం పెరిగి మన పరిసరాలు, మన ఆరోగ్యానికి ఎంతో ముప్పు ఏర్పడింది.  అంటే దాని వలన మనకు , పర్యావరణానికి ఎంతో కొంత మేలే జరిగింది కదా.  ప్రతీ వారు తమ పుట్టుకతో వచ్చిన స్వభావాల బట్టి వారి ప్రవర్తన, జీవన విధానం వుంటుంది. ఈ ప్రపంచంలో ప్రతీ ప్రాణి విలువైనదే.హెచ్చుతగ్గులు మనం కల్పించుకున్నవే. వాటికి విలువ ఇవ్వాలి కాని అసహ్యించుకోకుడదు" అని సింహం వివరించింది.
 
ఆ మాటల్లోని నిజాన్ని గ్రహించిన ఇతర జంతువులు సిగ్గు పడ్డాయి. తిరిగి పంది తో తమ స్నేహం కొనసాగించాయి.  .

సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు