ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు--: సి.హెచ్.ప్రతాప్;-సెల్ : 95508 51075
 నారాయణపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. తనకు వున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ , వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో సంతృప్తిగా జీవిస్తుండేవాడు. అతని భార్య లక్ష్మి అనుకూలవతి. వారికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వాడికి కృష్ణయ్య అనే పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. కృష్ణయ్యకు ఆరేళ్ళ వయస్సు వచ్చేసరికి  లక్ష్మికి భయంకరమైన జబ్బు చేసింది. గ్రామ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె జబ్బు నయం కాలేదు. రోజు రోజుకూ కృంగి కృశించిపోయి చివరకు ఒకరోజున కన్నుమూసింది.
భార్య మరణాన్ని రామయ్య తట్టుకోలేకపోయాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో   ఎప్పుడు ఒంటరిగా వుంటూ ఒకవైపు వ్యవసాయాన్ని, మరొకవైపు కృష్ణయ్య ఆలనా పాలనా  నిర్లక్ష్యం చేయసాగాడు. అతని బాధ చూసి దగ్గర బంధువులు పక్క ఊరిలో వున్న ఒక లక్షణమైన అమ్మాయిని చూసి రెండో పెళ్లి చేసారు.
రెండో పెళ్ళితో రామయ్య జీవితం గాడిలో పడింది. వారికి ఒక కొడుకు పుట్టాడు. అప్పటి నుండి రామయ్య జీవితంలో ఇంకొక సమస్య ప్రారంభమయ్యింది. కొడుకు పుట్టడంతో సవతి తల్లి కృష్ణయ్యను నానా బాధలు పెట్టసాగింది. బడి మాన్పించి ఇంటి పనులు, పొలం పనులు చేయించసాగింది. వెళకు తిండి కూడా పెట్టేది కాదు, మరొక పక్క ప్రతి చిన్న తప్పును వెదికి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టేది. కొడుకును భార్య పెట్టే ఆరళ్లను చూసినా భార్య పట్ల ప్రేమ వలన తనను రామయ్య ఏమీ అనలేకపోయేవాడు.  
తల్లి పెట్టే బాధలు పడలేక ఒకరోజు కృష్ణయ్యకు జీవితంపై విరక్తి పుట్టి ఒకనాటి రాత్రి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. ఒక లక్ష్యం లేకుండా తన మనసుకు ఏటు తొస్తే అటు నడవదం మొదలుపెట్టాడు. కొంతకాలానికి  ఒక అడవిలో ప్రవేశించాడు.  
బాగా అలసట గా ఉండడంతో ఒక చెట్టు కింద నిద్రపోయాడు.
ఆ అడవిలో ఒక మాంత్రికుడు తన శిష్యులతో వున్నాడు. గొప్ప శక్తులు పొందడానికి క్షుద్ర దేవతా ఉపాసన చేస్తున్నాడు.పదిహేనేళ్ళలోపు  కుర్రవాడిని వచ్చే అమావాస్య అర్ధరాత్రి బలి ఇస్తే అష్ట సిద్ధులు వశం అవుతాయన్న తన గురువు సూచన మేరకు ఉపాసన తీవ్రతరం చేస్తూ ఎవరైనా కుర్రవాడిని బలివ్వడానికి వెదికి తీసుకురమ్మని తన శిష్యులను పంపాడు. అలా అడవిలో నుంచి వెళ్తున్న శిష్యులకు చెట్టు కింద నిద్రపోతున్న కృష్ణయ్య కనిపించాడు. వెంటనే వాడి కాళ్ళు చేతులు కట్టేసి మాంత్రికుడి దగ్గరకు తీసుకుపోయారు.  
మాంత్రికుడు వాడిని సంతృప్తిగా చూసి అమావాస్య నాడు బలికి సిద్ధం చేయమని చెప్పాడు.  
ఆ మాటలకు కృష్ణయ్య భీతిల్లిపోయాడు. తనను రక్షించమని తన ఇష్టదైవం కనకదుర్గను ప్రార్ధించ సాగాడు. అమ్మా, ఇప్పుడు నాకెవరూ లేరు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. అమ్మగా నన్ను రక్షించు తల్లీ అంటూ దీనంగా ప్రార్ధించడం మొదలెట్తాడు.
అమావాస్య అర్ధరాత్రి కృష్ణయ్యకు శుభ్రంగా స్నానం చేయించారు. ఒళ్ళంతా పసుపు కుంకుమలు పూసారు. పూలమాలలు వేసి బలిపశువులా అలంకరించారు.డప్పుల వాద్యంతో హోరెత్తిస్తూ ఊరేగింపుగా క్షుద్ర దేవత విగ్రహం ముందు పడేసారు.
ఏవేవో మంత్రాలు చదువుతూ కృష్ణయ్యను బలి ఇవ్వడానికి మాంత్రికుడు కత్తి ఎత్తాడు. ఇంతలో విగ్రహం నుండి ఒక గొప్ప వెలుగు వచ్చింది. రౌద్ర రూపంలో కనకదుర్గమ్మ ప్రత్యక్షమై మాంత్రికుడుతో పాటు అక్కడ వున్న వారందరినీ క్షణకాలంలో  నరికి పారేసింది. భయంతో ముడుచుకుపోయి వున్న కృష్ణయ్యను ప్రేమగా దగ్గరకు తీసుకొని నీకు సకల శుభాలు కలుగుతాయని దీవించింది.
అదే రోజు రాత్రి రామయ్య భార్య కలలో కనిపించి కృష్ణయ్యను అశ్రద్ధ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కనక దుర్గమ్మ హెచ్చరించింది.
ఆ విధంగా తనను నమ్ముకున్న కృష్ణయ్యను మాంత్రికుడి బారి నుండి రక్షించడమే కాకుండా సవతి తల్లి ప్రవర్తనను చక్కదిద్ది తనను నమ్ముకున్న భక్తులను సర్వదా రక్షిస్తానని కనక దుర్గ తల్లి మరోసారి నిరూపణ చేసింది.

సి హెచ్ ప్రతాప్ కామెంట్‌లు