అమరారామం క్షేత్ర మహత్యం; -- సి.హెచ్.ప్రతాప్ ;-సెల్ ; : 95508 51075
 ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.
పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
గుంటూరు జిల్లాలో నగరానికి 35 కి.మీ.ల దూరంలో కృష్ణానదీ తీరమున వెలసిన అమరావతిలో ఈ క్షేత్రం ఉంది. పంచరామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో గల స్వామిని ‘అమరేశ్వరుడు’ అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి వారి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ విగ్రహాన్ని తారకాసురుడిని వధించిన తర్వాత తన కంఠంలోని శివలింగం చెల్లాచెదురు అవ్వగా.. అందులోని ఒక భాగాన్ని తీసుకొని ఇంద్రుడు ప్రతిష్టించాడని భక్తుల విశ్వాసం.
ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండుటవల్ల అర్చకులు ఒక పీఠమీద ఎక్కి, ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంది. ఆ మరకే రక్తపు మరక.శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తలమీద కొట్టడం జరిగింది. శివలింగంపై భాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికీ ఆ రక్తపు మరక ఉంది.దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్టించాడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి
పావన కృష్ణా నదీ తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వ కాలమునుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచి యున్నది. ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్థూపములు, శిల్పములు లెక్కకు మిక్కుటంగా వుండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్ప కళా విశేషములను ప్రస్ఫుటిస్తుంది. ఇది శాతవాహనుల కాలం నాటి వరకూ ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి.

సి హెచ్ ప్రతాప్ 


కామెంట్‌లు