బాలిక నీ ఏలిక -డా.అడిగొప్పుల సదయ్య
అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలతో...
==================================
నీయింట మాలక్ష్మి నిండైన తనముతో
జనియించ నణువంత సంతోషపడవేమి?

నీయింట నాలక్ష్మి నిలిచి నడయాడంగ
నవరత్నములు కురియ నందమది సుంతేది?

నీయింట శ్రీ వాణి నెలవుగొని చదువుకొని
నిన్ను రాజును చేయ నీకేమి యిక దిగులు?

నీయింట శైలజయె నిప్పుకణికై పెరిగి
దుష్టులను దునుమాడ తోషలేశములేదె?

బాలికంటే నీకు బరువు బాధ్యత కాదు
చిరునగవులొలకించు సిరిసంపదల మూట

బాలికంటే నీకు భయభ్రాంతులెందుకు?
మెట్టినింటను నీదు మేళ్ళనే కోరేది

బాలికంటే గుండె బండ యనుకొంటివా?
గుండె మంటలనార్చి కుదుటపరచెడు మందు

బాలికంటే శక్తి బాలికంటే యుక్తి
బాలికుంటే భుక్తి బాలికుంటే ముక్తి

మొగ్గలోనే తుంచి మోసగించకు సృష్ఠి
పుట్టనియ్ బతకనియ్ పుడమి పులకించనియ్

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125

కామెంట్‌లు
Unknown చెప్పారు…
బాలికల ఇష్టపది బరువు కాదెవరికీ
ఆడపిల్లల యిల్లు ఆనంద మందరికి