చిత్ర కథ; -నిర్వహణ: నండూరి సుందరి నాగమణి ; - సుమ కైకాల
 
నీ దారిలోనే!
"తాతయ్యా! నేను వచ్చేసాను, నీకు సాయం చేయనా?" ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో స్కూల్ బ్యాగ్ పట్టుకొని మోకాలి లోతు నీళ్ళల్లో ఈదుతున్నట్లు నడుస్తూ అడిగాడు బబ్లూ.
"నువ్వేంటి నాన్నా? ఇంత వానలో వచ్చావేంటి?" నిర్ఘాంతపోయాడు రాజారావు.
"రెండు రోజుల నుండి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి, మనం పాత ఇంట్లో ఉండి ఉంటే పైకప్పు నుండి కారే వర్షపు నీరు ఎన్ని గంగాళాలు, బక్కెట్లు, గిన్నెలు నింపాల్సి వచ్చేదో? ఇప్పుడు ఎంచక్కా ప్రశాంతంగా ఉంటున్నాము అని డాడీ తో అంది తాతయ్యా! " అన్నాడు బబ్లూ.
"నువ్వు ఇక్కడకు రావడానికి, మీ అమ్మ అనడానికి సంబంధం ఏంట్రా?" పై నుండి కారుతున్న నీరు కిందకు గిన్నె జరుపుతూ అన్నాడు రాజారావు.
"అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చావు తాతయ్యా! ఇదివరకు మేము ఉన్నప్పుడు డాడీ, అమ్మ, నేను, నువ్వు అందరం కలిసి నీటి కింద గిన్నెలు పెట్టి పారబోసేవాళ్ళం... ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉంటావు కదా, నీకు సాయం చేయాలి అనిపించింది. అమ్మని అడిగితే ఒప్పుకోదు, డాడీ అమ్మ చెప్పినట్లు విను అంటారు. అందుకే అడగకుండానే స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఆటో అంకుల్ ని ఇక్కడ ఆపమని అడిగాను, ఇక్కడ దిగిపొయాను" అన్నాడు బబ్లూ.
"అలా ఎలా ఆపాడు? పెద్దవాళ్ల పర్మిషన్ లేకుండా నిన్ను అలా దింపకూడదు నాన్నా! మీ అమ్మానాన్నలకు తెలియకుండా నువ్వు నా దగ్గరకు కూడా రాకూడదు, అది తప్పు" అన్నాడు రాజారావు.
"నిన్ను ఇలా వాన నీటిలో వదిలేయడం వాళ్ల తప్పు కాదా? నువ్వు నాతో మన ఇంటికి వచ్చెయ్యి తాతయ్యా! నువ్వు రాకపోతే వాన తగ్గేదాకా నేను నీతోనే ఉంటాను, వెళ్ళను" మొండిగా అన్నాడు బబ్లూ.
మనవడి మాటలకు తాతయ్య కళ్ళల్లో నుండి కారే నీరు వర్షపు ధారలో కలిసిపోయాయి.
***
రాజారావుకి ఇద్దరమ్మాయిల తరువాత పుట్టాడు శంకర్, శంకర్ పుట్టిన కొంత కాలానికే భార్య పోయింది. పిల్లలకు తల్లి,తండ్రి తానే అయి పిల్లలను పెంచాడు. వారసుడు అని శంకర్ ని భుజాల మీద ఎక్కించుకొని మరీ పెంచాడు. ఉన్నంతలో ఆడపిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసాడు, తరువాత శంకర్ కి కూడా పెళ్లి చేసాడు.
కోడలు స్వప్న రూపంలో సౌందర్య, గుణంలో శూర్పణఖ! ఎప్పుడూ ఏదో ఒక వంకతో మామ గారిని వదిలించుకోవడానికి శంకర్ తో గొడవలు పడుతుంటుంది. శంకర్ పూర్తిగా భార్యా విధేయుడు. తండ్రి చిన్ననాటి నుండి తన పట్ల చూపించిన ప్రేమ గుర్తున్నా భార్యకు ఎదురు చెప్పలేక మౌనం వహిస్తాడు. 
కానీ బబ్లూకి చిన్నప్పటి నుండి తాతయ్య అంటే ప్రాణం! తాతయ్య చెప్పే కథలంటే చాలా ఇష్టం, తల్లి తాతయ్యని తిడితే ఊరుకునేవాడు కాదు.
"ఎందుకు మమ్మీ, తాతయ్యని ఎప్పుడూ ఏదో ఒకటి అంటావు? డాడీ, మీరు మమ్మీని కోప్పడరేంటి?" అని అంటుంటాడు బబ్లూ.
"మీ నాన్న పసిపిల్లవాడిని రెచ్చగొడుతున్నాడు, చూస్తున్నారా?" అని శంకర్ తో పోట్లాడేది స్వప్న.
రోజూ ఈ గొడవ పడలేక ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని వేరింటి కాపురం పెట్టాడు శంకర్. రాజారావు స్వయంగా వంట చేసుకుని ఒక్కడే పాత ఇంట్లో ఉంటున్నాడు. కుంభవృష్టిగా వానలు కురుస్తుoడడం వల్ల పైకప్పు నుండి ధారలుగా నీరు కారి ఇల్లంతా మోకాలి లోతు నీరు నిలబడిపోయింది. 
పాపం! ...ఒక్కడే నిస్సహాయoగా నిలబడి ఉండగా బబ్లూ వచ్చాడక్కడకి.
***
"బబ్లూ! నువ్వు ఆటో అంకుల్ వద్దు అన్నా వినకుండా తాతయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళమని గొడవచేసావట, అంకుల్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అమ్మకు తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది" అని అరుస్తూ శంకర్ ఇంట్లోకి వచ్చాడు.
"అయ్యో! ఇల్లంతా చెఱువులా ఉంది, నాన్నా! మీరేంటి ఇలా..." నీళ్లు నమిలాడు శంకర్.
"గొడుగు పెట్టుకో తాతయ్యా తడిసిపోతున్నావు! " అంటూ గొడుగు తాతయ్యకి ఇస్తున్నాడు బబ్లూ తండ్రి మాటలు వినకుండా.
"బబ్లూ!... మీ డాడీతో వెళ్ళిపో నాన్నా! నీకు జలుబు చేస్తుంది" అన్నాడు రాజారావు.
"నాన్నా! ఎలాగయినా వచ్చే ఏడాది ఇల్లు బాగు చేయిస్తాను, ఈసారికి సర్డుకోoడి" అన్నాడు శంకర్ సిగ్గు పడుతూ.
"వద్దు డాడీ! ఇలాగే ఉంచండి, నేను పెద్దయ్యాక మీరు, అమ్మ ఇక్కడే ఉండాలి కదా!" అన్నాడు బబ్లూ.
బబ్లూ మాటలకు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
"బబ్లూ! అలా మాట్లాడకూడదు నాన్నా!" వారించాడు రాజారావు.
శంకర్ ముఖంలో నెత్తురు చుక్క లేదు, అలా నిలబడిపోయాడు.
"మా టీచర్ పెద్దవాళ్లను గౌరవించమని చెప్పారు, పెద్దవాళ్లు అంటే ఎవరు తాతయ్యా?" అని అడిగాడు బబ్లూ.
"మీ అమ్మ,నాన్న"...అన్నాడు రాజారావు.
"మా డాడీకి పెద్దవాళ్ళు మీరే కదా తాతయ్యా? మా డాడీ మిమ్మల్ని గౌరవిస్తే నేను డాడీని గౌరవిస్తాను, మీరు నాతో కొత్త ఇంటికి వస్తేనే నేను వెళ్తాను... లేకపోతే నీతో ఇక్కడే ఉంటాను" అన్నాడు బబ్లూ.
ఆ మాటలకు రాజారావు కొడుకు వైపుకి చూసాడు.
శంకర్ కి కర్తవ్యo బోధపడింది...
"నాన్నా! వీడికి ఉన్నపాటి ధైర్యం నాకు లేకపోయింది. ఇక నుండి అందరం కలిసి ఉందాము. నిన్ను స్వప్న ఒక్క మాట అననివ్వకుండా చూసుకునే బాధ్యత నాది, పదండి వెళ్దాం" అని ఒక చేత్తో తండ్రిని, మరో చేత్తో కొడుకుని పట్టుకొని ప్రశాంతంగా నీళ్ళల్లో అడుగులు వేస్తున్నాడు రాజారావు.
***

కామెంట్‌లు