సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 మేద్యము... మేధ్యము
    *******
 సకల జీవులలో మాటలు నేర్చిన, హావ భావాలను వ్యక్తీకరించ గలిగిన  మానవ జీవితం ఎంతో  ప్రత్యేకమైనది.
ఆదిమత్వం నుండి ఆధునికత వైపు ప్రయాణించి ఎంతో విజ్ఞాన వంతమైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నదీ మానవుడే.
మేధస్సుతో ఎంతో పరిణితి పొందిన తన పుట్టుక ఎంతో మేద్యమైనదని గ్రహించాలి.
మేద్యము అంటే  పవిత్రము, పావనము పూతము,పోతనము లాంటి అర్థాలు ఉన్నాయి.
పవిత్రమైన ఈ మనశ్శరీరాలతో పావనకరమైన పనులు చేయాలి. మంచితనం మానవతా విలువలు కలిగి ఈ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.
సాటి వారికి,సమాజానికి మన వల్ల మంచి జరుగుతుందన్నప్పుడు సైనికుడిలా ఈ ప్రాణాన్ని మేధ్యముగా భావించాలి.
మేధ్యము అంటే తృణము,దర్భ,కుశ,కసవు, కుథము లాంటి అర్థాలు ఉన్నాయి.
భరతమాత దాస్య విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను మేధ్యంగా  భావించి వీరోచితంగా పోరాడారు. అసువులను కోల్పోయారు. వారి త్యాగాల ఫలితమే ఈనాడు స్వేచ్ఛా, స్వాతంత్ర్య ఫలాలను  అనుభవించ గలుగుతున్నాం.
 కాబట్టి మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన పదాలివే.
ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవితాన్ని మేద్యము చేసుకోవాలి.
సమాజ శ్రేయస్సుకు, న్యాయం, ధర్మం కోసం చేసే పోరాటంలో జీవితాన్ని మేధ్యముగా అర్పించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు