సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సంవత్సర కాలం నుండి 365 రోజులుగా "సునంద భాషితాలను" ఆదరిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
-------------------------------------------


కాఠిన్యం..కార్పణ్యాలు
   *****
మనలో ఉండకూడని గుణం కాఠిన్యం., ఉండాల్సిన లక్షణం కార్పణ్యం.
కాఠిన్యం అనేది శాడిస్టిక్ మనస్తత్వానికి చిహ్నం. క్రూరత్వాన్ని,దయా హీనత్వానికి సూచిక.
అలాంటి లక్షణం ఇతరులను మాటలతో చేతలతో బాధిస్తూ,వారి వేదనను చూచి వికృతానందం పొందుతుంది.
అలాంటి లక్షణం ఉన్న వారి వల్ల సున్నితమైన మనసున్న వారు మానసికంగా కృంగి పోయే పరిస్థితి వస్తుంది.
కాబట్టి కాఠిన్యం ఎప్పుడూ కూడదు.
కార్పణ్యం అనగానే మనకు కక్షలు కార్పణ్యాలు అనే జంట పదాలు గుర్తుకు వస్తాయి.
కానీ అసలు అర్థంలో కార్పణ్యం అంటే ఓ సాత్వికమైన భావన.
 సాటి వ్యక్తులు బాధలు, దుఃఖం లో ఉన్నప్పుడు చూపించే జాలి దయ కరుణ ఆదరణ లాంటి హృదయ సంస్కారం.
సాటి మనుషుల,మనసుల స్థానంలో మనల్ని నిలుపుకుంటే కాఠిన్యం ఎంత బాధిస్తుందో, క్షోభకు గురి చేస్తుందో, వేధిస్తుందో అర్థం అవుతుంది.
కార్పణ్యం ఇతరులలో ఎంత మానసిక ఒత్తిడిని దూరం చేసి  ఎంతటి కష్టమైనా భరించేలా చేస్తుందో మన ఆచరణ ద్వారా తెలుసుకోవచ్చు.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు