సుప్రభాత కవిత ; -బృంద
నిద్దుర వీడి కనులు
రెప్పలు తెరిచే వేళ

నిశీధిలో కలిగిన
భయాలు తొలగిపోయేవేళ

ప్రాగ్దిశ  ప్రసవ వేదనలో
ఎర్రబారిన గగనాల  మోముపై

రంగుల దరహాస చంద్రికలు
వెల్లి విరియ.....

వెలుగుల నవ్వులు
చిందిస్తూ....ఉదయించే
బాల భానుని.....

చూడగానే పరవశించె
ప్రకృతి సమస్తము...

అవనిపై  అరుణవర్ణపు
పుష్పాలు  రాల్చి
తరువులన్నీ ....

ఆనందమయ ఆహ్వానానికి
ఎర్రటి తివాచీ పరచి
స్వాగతించె!

కేలు మోడ్చి మునులవోలె
మంత్ర పఠనము చేయుచూ
మిత్రుని రాకను
పవిత్రముగ కొనియాడుతున్న
వృక్ష  శ్రేణులు..

కిరణములు తాకి
అవని అణువణువూ
నవవధువు వోలె  
సిగ్గుల మొగ్గలా మారె..

నిఖిల జగముల
నీరసముల పోద్రోలు
ఆకాశదీపమై 
మింట బయలుదేరె
రథాన ఊరేగుతూ
రక్షకుడు తానే...

అందలేని దూరాన ఉన్నా
ఆదరించి కాపాడే  దినరాజు
రాకతో ....
అందమైన గమ్యాలు దగ్గరయే
అపురూప ఉదయానికి

ఆనందరాగాల భావగీతాలాపనతో
మైమరచి మదిపలికె

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు