బతుకమ్మ తల్లికి దండాలు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అదుగో! 
రంగురంగుల సింగిడీ 
కదలివస్తున్నది
ప్రతి ఇల్లూ,వీధీ,ఊరూ 
పూలవనాలై పులకిస్తున్నవి
సర్వజనుల ప్రతీకలుగా
పూలన్నీ ఒక్కటిగా ఒద్దికగా
సకలజనుల జాగృతిగా
ఎన్నోపరిమళాలు ఒక్కటిగా
సకలజనులను ఏకంచేసే సూత్రాలుగా
ప్రపంచంలో ఎక్కడా లేనిది
పూలను పూలతో అర్చించే పండుగ
చిట్టి బతుకమ్మను 
సుతారంగా పట్టుకున్న బొడ్డెమ్మ
రంగురంగుల పూలగంటను 
నెత్తిన ఎత్తుకుని ఆనందంగా ఓ గౌరమ్మ
తమ బతుకులు కూడా 
రంగుల కలబోతగా ఉండాలని
ఆనందాలు ఉత్సాహాలూ వెల్లివిరియాలని
ఆ బతుకమ్మ తల్లికి వేల చప్పట్లతో 
వేల దండాలుపెట్టి
తెలంగాణ జీవన సంస్కృతిని సంప్రదాయాన్ని
వేల సంవత్సరాలుగా కాపాడే
తెలంగాణ మహిళకు దండాలు!
బతుకమ్మ తల్లికి దండాలు!!

కామెంట్‌లు