మంచురాణి(హిమాచల్ ప్రదేశ్ జానపద కథ ఆధారంగా)అచ్యుతుని రాజ్యశ్రీ

 రవి రాణి అన్న చెల్లెళ్ళు. అనాధలైన ఆపిల్లలని ఊరివారంతా ప్రేమగా చూసుకునేవారు.ఆఊరి గుడి తోట లో ఇద్దరు పనిచేస్తూ పూలతోటని పెంచుతున్నారు. చిట్టిఉడతల్లాగా పూజారితాతకి చేదోడువాదోడుగా ఉండేవారు. తాత హిమాలయాల దగ్గర ఉన్న మంచురాణీకథలు రోజూ చెప్పేవాడు.ఓరోజు  హఠాత్తుగా గాలివీచింది.రవి కంట్లో ఏదో నలకలాగా పడింది. "అయ్యో అన్నా!నీకన్ను ఎర్రగా చింతనిప్పులా ఐంది " అని రాణి విలవలలాడింది."కన్ను నలపకు."అని అతని కన్ను రెప్పలు గట్టిగా పట్టి తెరచి  కంట్లో ఊదసాగింది.అంతే రవి పెద్దగా రంకెలేయసాగాడు"నీవు భయంకరంగా పిశాచిలా కన్పడుతున్నావు" అని వికటంగా నవ్వుతూ చెట్లకిఉన్న  పూలు  మొగ్గలు  అన్నీ తెంపి నలపసాగాడు."అన్నా!మనం కష్టపడి పెంచుతున్నాం. ఇలా నాశనం చేస్తావేంటి?ఆపూలు గుడితాతకి కోసి ఇవ్వాలి కదా?" అని ఏడుస్తున్న చెల్లిని"పోవే చుంచుమొహమా?"అని ఆమెజడపట్టి గుంజి పారిపోయాడు.వాడికంటికి ప్రతిదీ కురూపిగా కన్పిస్తోంది. దానికో కారణం ఉంది. ఆపల్లెలో ఒకప్పుడు ఓదుష్ట మాంత్రికుడు ఉండేవాడు.వాడిదగ్గర ఓఅద్దం ఉంది. దానివల్ల  వాడిని ఎవరూ అదుపులోపెట్టలేరు. తమని ముప్పు తిప్పలు పెడుతున్న ఆదుష్టుడి పీడ విరగడ కై అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. వాడు  బైట కి వెళ్ళినపుడు ఊరివారంతా  ఆఅద్దాన్ని  భళ్ళున బద్దలుగొట్టారు. ఆపగిలిన అద్దం ముక్కల్లో తొంగి చూస్తే  అంతాభీకరంగా విచిత్రంగా  అసహ్యంగా కనపడ్తారు. ఆఅద్దపు రేణువు గాలికి ఎగిరి రవి కంట్లో పడటంతో వాడు అలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు.దాని ప్రభావంతో తుంటరిగా మారినరవి ఓగుర్రం కనపడితే  దానిపై ఛంగున ఎక్కి మంచుకొండల వైపు వెళ్లాడు.ఓతెల్ల జీబురు గడ్డంవాడు గుర్రాన్ని ఆపి" అరె కుర్రాడా!నిన్ను మంచురాణీ దగ్గరకు తీసుకుని వెళ్తా"అని  వాడిని లాక్కెళ్ళాడు.మంచు రాణి వాడిని  ఇలా పట్టుకోగానే రవి మంచు బొమ్మలా మారిపోయాడు.అన్నను వెతుకుతూ రాణి బైలుదేరింది.ఓనది ఒడ్డున పడవ కనపడితే అందులో ఎక్కి కూచుంది.ఆపడవ తనంతట తనే రయ్ న  పయనించి ఓ గట్టు దగ్గర ఆగింది.
 అక్కడ ఓగుడిసెముందు రెండు కొయ్యబొమ్మలు మనిషి ఆకారంలో  కాపలాఉన్నాయి.రాణి దాని ముందు నించుని "అన్నా!" అని పెద్ద గా ఏడ్వసాగింది.లోపలున్న అవ్వ బైటకొచ్చి రాణీని బుజ్జగిస్తూ "మాఅన్న కనపడిన పిల్లలని మంచురాణీ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆమె వారి ని మంచు బొమ్మలా మారుస్తుంది. నేను మీఅన్న దగ్గరకు తీసుకుని వెళ్తాను"అంటూ తన చేతికర్రను గిరగిరా మూడు సార్లు తిప్పింది. అంతే! మంచురాణీ గుహలో ఉన్నారు. "చూడుతల్లీ!నీవు నాఅక్క కూతురివి! ఈపసిదాని మొహం చూసి  ఆమె అన్న రవి ని విడిచి పెట్టు"అంది అవ్వ. "అయ్యో పిన్నీ!నీవంతగా చెప్పాలా? అల్లరి ఆకతాయి పిల్లలకు బుద్ధి రావాలి అని వారి ని మంచుబొమ్మలుగా మారుస్తాను"అంటూ మంచురాణి ఒక వెలుగు తున్న ప్రమిదను ఓమంచుబొమ్మపై ఉంచింది. అంతేఆబొమ్మ క్రమంగా కరిగి రవిగా మారింది. వాడి కంట్లోంచి నీరు కారటంతో 
గాజుముక్క నలుసు కూడా బైట కి వచ్చింది. "చెల్లీ!ఇక్కడికి ఎలా వచ్చావు?" "అన్నా!" అని ఆపిల్లలిద్దరూ  ఏడుస్తూ ఉంటే మంచురాణీ  వారిని  దీవించి వారి పల్లె కి చేర్చింది 🌹
కామెంట్‌లు