శ్రీమతి వనజా అవధాని పరిచయ వాక్యము

 వల్లంభట్ల అనే అగ్రహారం నుంచి బ్రాహ్మణ కుటుంబమొకటి లింగన్నపేట సంస్థానానికి దాదాపు 300 సంవత్సరాల క్రితం తరలివచ్చింది.రాజపురోహితులు గా,సలహాదారులు గా సంస్థానంలో పనిచేస్తూ నిజామాబాదు జిల్లా సదాశివనగర్ మండలం లోని రథాల 
రామారెడ్డి గ్రామంలో నివసించారు. 
రెవెన్యూ రికార్డులలో లభించిన ఆధారంగా శాండిల్య గోత్రానికి చెందిన బెల్లక్క అనే పురుష నామంతో వారి వంశక్రమం విస్తరించినదని బ్రహ్మశ్రీ శివరామ శర్మ అంటే 
శ్రీమతి వనజ గారి తండ్రి నాతో చెప్పారు.శివరామ శర్మకు 5 తరాల పూర్వీకులే 
శ్రీశేషాచల సూరి.ఆయన శ్రీ వాసరా సరస్వతీ క్షేత్ర మాహాత్మ్యము అనే స్థల పురాణాన్ని 
సంస్కృతంలో వ్రాశారు.
ఇది నా సంపాదకత్వంలో ప్రభుత్వం వారు 2008 లో అచ్చువేశారు.
శివరామ శర్మ మొదట బడిపంతులు గా పనిచేశారు.స్వచ్ఛంద పదవీ విరమణ గావించి
ఒక పక్క సామాజిక సేవ చేస్తూ అంటే పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఉపనయన 
సంస్కారాలను చేస్తూ,నిజామాబాదు సాయిబాబ గుడిలోను,కందకుర్తి సమీపంలోని 
నవదుర్గ ఆలయం లోను అర్చకునిగా శేష జీవితాన్ని కొనసాగిస్తూ 2016 నాటి 
మహా శివరాత్రి పర్వదినమందు శివైక్యం చెందారు.
ఇక శ్రీ శేషాచల సూరి 6వ తరంగా చి.గణేశ శర్మ, ప్రసాద శర్మ అనే అన్నదమ్ముల నడుమ ప్రస్తుత మహిళావధాని అయిన శ్రీమతి వనజా దేవి గారు ఆవిర్భవించారు.
ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బోధ్  లో తెలుగు ఉపన్యాసకురాలు గా 
పనిచేస్తున్నారు.పిన్న నాడే జీవితం లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటు 
సారస్వత అవధాన సాగరం లోకి ప్రవేశించారు.
లోగడ తండ్రి వద్దను,తాత వద్దను  నేర్చుకున్న తెలుగు సులక్షణ సారము,
నానార్థ నిఘంటువు,అమరకోశ పఠనం వంటి పరిజ్ఞానం ఆమె జిహ్వకు తోడై 
అలరారు గాక!
ఇటీవల విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల వారిచే ఆవిష్కరించ బడిన శ్రీవాణీ శతకము 
మహిళా లోకం లోనే ఆమెను లబ్ధ ప్రతిష్ఠురాల్ని చేసింది.
ఇట్లు సరస్వతి వారసత్వం గా వారి పుట్టింటి దేవత అయిన శ్రీ వాసర సరస్వతి 
మెట్టినింటి లోను చొరబడి శ్రీమతి వనజా (సంతోష్) దేవిని అవధాన విద్యలో 
రాణింప జేయుటకు అనుగ్రహించాలని,సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేస్తూ 
ఆశీర్వదిస్తున్నాను.
భవిష్యత్తులో యీ విద్వన్మణి అనేకానేక అష్టావధానాలు చేస్తూ కీర్తి ప్రతిష్ఠలను 
విరివిగా పొందాలని ఆశిస్తున్నాను.తథాస్తు.
డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్ 
దేవీ నవరాత్రులు, మూల నక్షత్రం. 02.10.2022
దేవీ ప్రసాదాత్ సకలం లభంతే 
*********
కామెంట్‌లు