మాటే కదాని ఇచ్చేయకూడదు..!;-- యామిజాల జగదీశ్
 ఈ మాట సామాన్యం కాదు.
ప్రయత్నమనేదే చేయని వాడు ఎంతటి తెలివితేటలున్నవాడైనా ఏం లాభం?
దారీ తెన్నూ తెలీక ప్రయాణం చేసే వాడు రెక్కలు లేని పక్షిలాంటివాడు.
చదువుసంధ్యలు ఉన్నా సత్ప్రవర్తన లేని వ్యక్తి పండ్లివ్వని చెట్టులాంటివాడు.
దేన్నయినా ఆడుతూ పాడుతూ చేయని వ్యక్తి కిటికీలు లేని ఇంటితో సమానం. 
ఇలా చెప్పుకుంటూపోతే బోలెడన్ని ఉంటాయి. ఇందులో మనమేంటో చూసుకోవాలి.
అనగనగా ఒక మేక తన పిల్లలను ఒక గదిలో ఉంచి ఆహారం కోసం బయలుదేరింది.
బయలుదేరేముందు అది పిల్లలతో "పిల్లల్లారా! నేను వెళ్ళి తిరిగొచ్చేవరకూ లోపలికి ఎవరినీ రానీయకండి. నేనొచ్చి పిలిచాక నా గొంతు గుర్తించిన తర్వాతే మీరు తలుపు తెరవాలి. సరేనా" అని హెచ్చరించింది తల్లిమేక.
ఈ మాటలను ఓ చాటు నుంచి విన్న ఓ తోడేలు తల్లిమేక వెళ్ళిన తర్వాత తోడేలు నెమ్మదిగా వచ్చి తలుపు దగ్గర నిల్చుంది. తన గొంతుని మేకలా మార్చి "పిల్లల్లారా! మీ అమ్మను వచ్చాను. తలుపు తీయండి" అంది తోడేలు.
మేకపిల్లలు తలుపుకున్న రంధ్రంలోంచి చూసాయి. 
"నీ గొంతు మా అమ్మ గొంతులా ఉంది. కానీ నీ కాళ్ళు తోడేలు కాళ్ళలా ఉన్నాయి.కనుక తలుపు తెరవబోం" అన్నాయి మేకపిల్లలు ముక్తకంఠంతో. 
తల్లి మాట మీరనందువల్ల ఆ పిల్లమేకలు ఆపద నుంచి తప్పించుకున్నాయి.
కానీ ఈరోజుల్లో చాలా మంది పిల్లలు దారి తప్పడానికి కారణం చెప్పిన మాట వినకపోవడమే. 
సంతోషంగా ఉన్నప్పుడు మాటివ్వడం, కోపంగా ఉన్నప్పుడు మాట మీరడం, శోకంతో ఉన్నప్పుడు మాట తప్పడం వల్ల మన మీద నమ్మకం కోల్పోతాం. కనుక మాట ఇచ్చేముందు ఆలోచించాలి.
మాటివ్వడంలో జాగర్తగా ఉండాలి. 
మాట ఇచ్చాక వీలైనంత వరకూ దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. 
అలా చేయని పక్షంలో ఆ తర్వాత మీరు ఎవరి మీద సత్యప్రమాణం చేసి మాట ఇచ్చినా దానికి విలువుండదు.
లుక్మాన్ హకీం దగ్గరకు ఒకడొచ్చి అడిగాడు "మీరు ఎవర్ని చూసినా మర్యాద ఇస్తారు. ఈ విధానాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నారని".
"ఎవరిని చూసినా మర్యాద చూపని మూర్ఖుడి నుంచి నేర్చుకున్నా" అన్నారు లుక్మాన్.
"అదెలాగు?" అని అతను అయోమయంగా చూశాడు.
"ఆ మూర్ఖులు చేసే అమర్యాదలను తెలుసుకుని వాటన్నింటినీ వదిలేశాను" అన్నాడు లుక్మాన్.
లుక్మాన్ సంస్కారవంతులైన ఓ మేధావి. ఆయనకు ఖురాన్‌లోని 31వ అధ్యాయంలోని సూరా లుక్మాన్ పేరు పెట్టబడింది. ఈయనను ఈజిప్టుకి చెందిన మనీషి అని కొందరి అభిప్రాయం. ఈయన గురించి పర్షియన్, అరబిక్, టర్కిష్ సాహిత్యంలో చాలా కథలు ఉన్నాయి. కొందరు ఆయనను ప్రవక్తగా విశ్వసిస్తారు.
"మర్యాదంటూ తెలిసిన వారికి మనమేదైనా మంచి మాట చెప్తే స్వీకరిస్తాడు. మూర్ఖులకు, మర్యాదంటే ఏమిటో తెలియని వారికి ఎంత చెప్పినా ఏం చెప్పినా వినడు" అన్నారు తత్వవేత్త సా ఆది.
ఓ దంపతులు దుకాణానికి బయలుదేరారు. అప్పుడు తను కూడా వస్తానని మొండికేశాడు పిల్లాడు.
"వద్దు. నువ్వు ఇంటి దగ్గరే బుద్ధిమంతుడిలా ఉండు. బొమ్మలతో ఆడుకో. నేను తిరిగిరావడంతోనే నీకిష్టమైన కూర చేసిపెడతాను" ఆంది తల్లి.
పిల్లాడు శాంతించాడు. 
బజారుకెళ్ళిన కుర్రాడి తల్లిదండ్రులు తిరిగొచ్చారు. 
"పిల్లాడికి ఇష్టమని ఆలుగడ్డలు కొన్నాంగా...కూర చెయ్యి" అన్నాడు భర్త.
 
"మీకేమైనా పిచ్చా" అంది భార్య.
భర్త "నువ్వు బజారుకి వెళ్ళే ముందర వాడికి ఇష్టమైన కూర చేస్తానని మాటిచ్చావు కదా" అని గుర్తు చేశాడు.
"అదా...వాడు ఇంటి పట్టున ఉండటం కోసం అలా చెప్పానంతే" అంది భార్య.
 
"పిల్లాడిని ఇలా నిరాశపరచడం తగదే. ఆలోచించు" అన్నాడు భర్త.
"ఇకముందెప్పుడూ ఇలా మాటవరసకైనా చెప్పకు. ఇటువంటి మాటలు వాడిలో లేని పోని ఆశలు పెంచి నిరాశపరుస్తుంది. అది మంచిది కాదే. నీమాటతీరువల్ల వాడూ నేర్చుకుంటాడు అబద్ధాలం" అన్నాడు భర్త.
మనబ్బాయే కదాని అబద్ధపు హామీ ఇవ్వడం, దానిని ఉల్లంఘించడం వారికీ వాటిని అలవాటు చేసినట్లవుతుంది.
 
పిల్లలకు సంబంధించినంతవరకూ వారికి ఆదర్శం వారి తల్లిదండ్రులే. ఇది దృష్టిలో ఉంచుకుని పెద్దవాళ్ళు పిల్లలతో ప్రవర్తించాలి. అది మంచిదికూడా. మంచి మంచి పద్ధలతో పిల్లలను పెంచితే వారి భవిష్యత్తు సంతోషంగా ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
"దిగులుపడకు అనేది గొప్ప ఓదార్పే. కానీ అంతకన్నా గొప్ప ఓదార్పు "ఏదైనా ఏమైనా  నీకు నేనున్నాను" అనే మాట....
“కన్నీరున్న చోట ఎవరు నవ్వుని తెప్పిస్తారో వారు దేవుడులాంటి వారు"అన్నారొకరు.

కామెంట్‌లు