హిందీ సాహితీవేత్తలు!అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆచార్య రామచంద్ర శుక్లా చాలా తక్కువ మాట్లాడే మితభాషి! దానిపై ఇద్దరు శిష్యులు వాదించుకున్నారు.అందులో ఒకడు ఇలా అన్నాడు "ఆచార్య ని కనీసం  ఐదుమాటలు మాట్లాడేలా చేస్తాను. "వెంటనే ఆయన దగ్గర కు వెళ్లి "సర్!మీచేత 5మాటలు మాట్లాడిస్తానని నాదోస్త్ తో పందెం కాశాను.నన్ను గెలిపించరూ?" దీనంగా వినయంగా అడిగాడు. "తుమ్ హార్ గయా !"అని నవ్వారు ఆయన. హిందీ లో ప్రధమ చరిత్రకారుడైన ఆయన బెనారస్ లో ఉండేవారు. నాగరీ ప్రచారిణీ సభలో హిందీ విశ్వకోశపని చూసేవారు.నెలకి25రూపాయల జీతం!ఆయన స్నేహితుడికి అల్వర్ మహారాజా తో మంచి స్నేహం!అందుకే  నెలకి1400జీతం పై శుక్లాని రాజుదగ్గరకు పంపాడు. ఆరోజు ల్లో అల్వర్ వెళ్లేందుకు  మూడు రోజులు పట్టేది. మంచి భవనం గుర్రపు బగ్గీ ఏర్పాటు ఐంది శుక్లాజీకోసం!కానీ రాజుకి  జీహుజూర్ అనటం కాకాబాకా పట్టడం నచ్చక శుక్లాజీ మూడోరోజే ఎవరికీ చెప్పాపెట్టకుండా తిన్నగా బెనారస్ వెళ్లి తన 25రూపాయల జాబ్ లో చేరి "గుడ్ బై కొట్టి వచ్చానోయ్!" అని మిత్రునికి లేఖ రాశారు.పాపం!ఆమిత్రుని మొహం ఎలా రంగులు మారిందో మనం ఊహించుకోవాల్సిందే!
మహావీర్ ప్రసాద్ ద్వివేదిభార్య పల్లె లో ఉండేది ఎక్కువగా!ఆమె దౌలత్పూర్ అనే పల్లె లో తమవంశంవారు ప్రతిష్ఠించిన  హనుమాన్ విగ్రహం దగ్గర ఓమండపం కట్టించింది.భర్త రాగానే  ఆవిషయం చెప్పింది. "నీకు  గుడి కట్టిస్తాలే!"అని సరదాగా  హాస్యానికి అన్నారు ద్వివేది.1912లో గంగానది లో కాలుజారి మునిగి చనిపోయిన ఆమె స్మృతిచిహ్నంగా తన ఇంటి ప్రాంగణంలో లక్ష్మి సరస్వతి విగ్రహాలతోపాటు తన భార్య చలువరాతి విగ్రహాన్ని ఆయన నెలకొల్పారు.ఆఊరిజనమంతా విరుచుకు పడి గగ్గోలు పెట్టారు " ఓసామాన్య స్త్రీ విగ్రహాన్ని గుడిలో పెడ్తావా?కలికాలం!పిదపబుద్ధులు!"అని హేళన చేశారు. ఆయన జవాబు ఇది"యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా:" ఇప్పటికీ ఆయన కట్టించిన స్మృతి మందిరం ఉంది. 
మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ రచయిత ఖాండేకర్ కొడుకు చిన్నారి అవినాష్ త్వరగా బడినుంచి వచ్చి "నాన్నా!విశ్వకవి టాగూర్ పోయారని సెలవు ఇచ్చారు. మరి నీవు చనిపోతే కూడా సెలవు ఇస్తారా?" ఆపసివాడితో ఆయన నవ్వుతూ ఇలా అన్నారు" మిగతా బడుల సంగతి ఏమోకానీ  ఆరోజు నీవు నీ బడికి వెళ్లనవసరం లేదు." పాపం  ఆచిన్నారి"అవునా!నాఒక్కడికే సెలవ ఇస్తారా?" అన్నాడు. ఆరోజుల్లో  పిల్లలు ఎంత అమాయకులో!!?
సచ్చిదానంద హీరానందవాత్సాయన్ ప్రసిద్ధ రచయిత. అజ్ఞేయ ఆయన కలంపేరు. దాని వెనక ఓకథ ఉంది. స్వాతంత్ర్య పోరాటం రోజుల్లో జైల్లో కథలు రాస్తూ రెండు మూడు కాపీలను నకలుచేసి వేర్వేరు ప్రాంతాలకు పంపేవారు.కొన్ని కథల్ని జైనేంద్రకి రెండు కథల్ని ప్రేంచంద్ పరిశీలనకోసం పంపారు ఆయన!ప్రేంచంద్ కి ఓకథ బాగా నచ్చింది. జైనేంద్రకి లేఖరాశాడు "ఆకథని నేను పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. మూలరచయిత ఎవరు?"జైల్లో వారు  కథలు రాసి దొంగతనం గా బైటికి పంపడం నేరం!రచయిత పేరు పైకి పొక్కరాదు.అందుకే తెలివిగా జైనేంద్ర"ఆరచయిత పేరు నేను బైట పెట్టలేను.అతను  అజ్ఞేయుడు.అజ్ఞాతంలో ఉన్నాడు "అని తిరుగు జవాబు రాశాడు. "ఐతే అజ్ఞేయ అనే పేరు తో ప్రచురిస్తా"అని ప్రేంచంద్  అనడం ఆకథ పబ్లిష్ కావడం  అదే కలంపేరు తో వాత్సాయన్ ప్రసిద్ధి కెక్కటం జరిగింది. 
కవులు రచయితలకు పరస్పర అవగాహన  ఇతరులని ప్రోత్సహించే సహృదయత ఉంటుంది. ఓ అధ్యాపకుడే రచయిత ఐతే ఇతరులు కూడా తనతో సమంగా ఎదగాలి అనే చూస్తాడు.ఆపై పత్రికల ప్రోద్బలంతో మంచి రచనలు వెలుగులోకి వస్తాయి🌷

కామెంట్‌లు