అచ్చులో నా పేరు;-- యామిజాల జగదీశ్
 నా పేరుతో ఇటీవలి కాలంలో అచ్చయినవి అనేకమున్నప్పటికీ మొట్టమొదటి సారి నాపేరు అచ్చులో చూసుకోవడానికి ఓ పని చేసాను. అందుకలా చేయకతప్పలేదు. మా నాన్నగారి రచనలు పత్రికలలో వస్తున్నవి చూసినప్పుడు నా పేరూ అలా అచ్చులో చూస్తే కోవాలనుకునే ఆశ కలిగింది. ఇంట్లో వాళ్ళకి తెలీకుండా ఓ అయిదారు పంపాను ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలకు. కానీ అవి అచ్చుకాలేదు. దాంతో తీవ్ర నిరాశ చెందాను. ఆలోచించాను ఏం చేయాలాని? 
ఓ మెరుపులాంటి ఐడియా తట్టింది. 
మా నాన్నగారు (యామిజాల పద్మనాభ స్వామిగారు) ఓ డైరీలో అవీ ఇవీ రాసుకుంటూ పత్రికలలో అచ్చయిన కవితలు, పద్యాలను రాసి ఉంచుకోవడం ఎరుగుదును. అవి చూసినప్పుడు నా చూపులు ఓ కవితమీద ఆగాయి. అది చందమామపై ఓ నాన్నగారు రాసి అచ్చయిన కవిత. అది అచ్చయి కొన్నేళ్ళయ్యింది. అదైతే ఎవరికీ తెలియకపోవచ్చని ఆ కవితను అందంగా ఓ తెల్లకాగితంమీద రాసి అది నా సొంతమని హామీపత్రంతో ఆంధ్రపత్రికకు పంపిన కొద్దిరోజులకే నా పేరుతో అచ్చయింది. అచ్చులో నా పేరు చూసుకోవడం అదే మొట్టమొదటిసారి. అయితే ఆ కవిత అచ్చయిన పేజీలోనే మా నాన్నగారు వాల్మీకి రామాయణ శ్లోకాలకు రాస్తున్న తాత్పర్యం వస్తుండేది. ఆ పేజీ చూసిన మా నాన్నగారి కంట నా పేరుతో అచ్చయిన ఆయన కవిత చందమామను చూసారు. నన్ను పిలిచి ఓ క్లాస్ తీసుకున్నారు. నేనెప్పుడో రాసి అచ్చయిన కవితనెందుకలా వాడుకున్నావు? అది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. 
అచ్చులో నా పేరు చూసుకోవాలన్న తహతహతో అలా చేసానని చెప్పాను మెల్లగా. 
ఓ చిన్ననవ్వారు. ఆ నవ్వు అర్థం నాకు తెలీలేదు. కానీ ఇంకెప్పుడూ అలా చేయకని హెచ్చరించడం ఇప్పటికే కొత్త గుర్తే. 

కామెంట్‌లు