*అమర వీరులకు..జోహార్లు*;---ది పెన్--విజయవాడ.
 నిర్భీతికి ప్రతిరూపాలు వారు. నిస్వార్థమైన నిరుపమాన త్యాగానికి ప్రతీకలు వారు. రేయింబవళ్లూ..కష్టాలకు వెరవక..సమస్యలకు బెదరక..సవాళ్లకు వెనుదీయక..చివరికి మృత్యువుకూ వెరపక..తుపాకీ గుండుకు గుండెను ఎదురొడ్డే ధీరులు..శూరులు ఖాకీ ధరించిన మన పోలీసులు.
ప్రజా క్షేమమే ధ్యేయంగా, కఠోర పరిస్థితులనూ తట్టుకుని శాంతి భద్రతలను కాపాడే సమాజ రక్షకులు వారే. దేశ అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించి, ప్రజా శ్రేయస్సుకు పాటు పడే ప్రజాహితులు వారే. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేయడానికి విరామ మెరుగక పరిశ్రమిస్తూ..నేరస్తులకు దీటైన సమాధానం ఇవ్వడమే కాదు..వేదనతో ఉద్రిక్తమయ్యే ప్రజలను సంయమనంతో శాంతిపజేసే‌ గురుతర బాధ్యత వారిదే..సాయుధ శక్తులతో సమరం సాగించాల్సిన తరుణంలో మరో ఆలోచన లేక ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేయడానికి సంసిద్ధులు కావాల్సిందీ కనిపించని ఈ నాలుగో సింహాలే..
మహత్తర బాధ్యతలో ప్రాణాలు త్యజిస్తూ..వారి కుటుంబానికి కన్నీరు మిగులుస్తున్నా..విద్యుక్త విధి నిర్వహణలో అమరులై సమాజానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. సహచరులకు స్ఫూర్తిదాయకంగా మెరుస్తున్నారు. అలా ఆత్మబలిదానం చేసిన చరితార్థులకు నేడు యావద్దేశం సలాం చేస్తోంది. విధి నిర్వహణలో  వెన్ను చూపక ప్రాణాలిచ్చిన త్యాగ ధనులను స్మరిస్తూ పౌర సమాజం శిరస్సును అవనతం చేస్తోంది. నిరుపమాన సౌర్యప్రతాపాలతో రుధిర తర్పణం చేసి ఆకాశంలో తారలై చిరయశో కీర్తులను సముపార్జించిన ఎందరో పోలీసు అమర వీరులకు జోహార్లు అర్పిస్తోంది.

కామెంట్‌లు
THE PEN చెప్పారు…
మొలక.. నిర్వాహకులకు కృతజ్ఞతలు.