ట్యాంకర్ లారీని నడిపే కేరళ యువతి;-- యామిజాల జగదీశ్
 ట్యాంకర్ లారీ డ్రైవరుగా కేరళలో పతాక శీర్షికకెక్కిన 23 ఏళ్ళ యువతి....
త్రిచూర్ జిల్లా కండాసంగడవు గ్రామానికి చెందిన డెలీషా ఎర్నాకులం హిందుస్థాన్ పెట్రోలియం ఎల్పీజీ కేంద్రం నుంచీ మల్లపురం తిరూర్ పెట్రోల్ బంకుకి ట్యాంకర్ లారీ డ్రైవ్ చేసింది.
"మూడేళ్ళుగా నేనేనా ట్యాంకర్ లారీని నడుపుతున్నానా అని నాకు నేనే నమ్మలేకపోతున్నాను" అంది డెలీషా.పెట్రోల్ లేదా డీజిలుతో పోతున్న వాహనాలను అత్యవసరం కావడంవల్ల వాహన ఇన్ స్పెక్టర్లు ఆపరు. కానీ కొన్ని వారాల క్రితం నేను లొరీ నడుపుతుండటాన్ని చూసి ఓ అధికారి నన్ను ఆపారన్నాది డెలీషా.నా దగ్గర లైసెన్స్ ఉండదనుకున్నారు. నా లైసెన్స్, సంస్థ వివరాల పత్రాలు చూపించడంతో వారు నన్ను పోనిచ్చారు. మూడేళ్ళుగా ట్యాంకర్ లారీ నడుపుతున్నానని అందుకే నా డ్రైవింగ్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకున్నానంది డెలీషా.
వాహనాలను నడపటం నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను. ప్రారంభంలో రెండు చక్రాల వాహనాన్ని నడిపేందుకు లైసెన్స్ పొందాను. అనంతరం నాలుగు చక్రాలు, ఆరు చక్రాల వాహనాలను నడపటానికి గుర్తింపు పొందానన్నాది డెలీషా. భారీ వాహనాలు నడిపే మహిళలెవరైనా కేరళలో ఉన్నారో తెలీదని చెప్తూ చిన్నప్పటి నుంచే వాహనాలు నడపాలనే ఆశ ఉండేదని, మా నాన్న లారి నడుపుతున్నప్పుడు ఆయనతోపాటు ప్రయాణం చేస్తూ ట్యాంకర్ లారీ నడపటం నేర్చుకున్నానని తెలిపింది. మొదట్లో మా నాన్నకు హెల్పర్ గా ఉంటూ తర్వాత లారీ డ్రైవరుగా ఎదిగానని చెప్పింది.
ఓవైపు లారీ నడుపుతూనే మరోవైపు డిగ్రీ చదివానంటూ ఓ ట్రిప్పులో మూడు వందల కిలోమీటర్ల వరకూ డ్రైవ్ చేస్తుంటానని, అర్ధరాత్రి దాటాక రెండున్నర కల్లా డ్రైవింగ్ మొదలుపెడతానని‌, 150 కిలోమీటర్ల.దూరంలో ఉన్న చమురు సంస్థలో ఇంధనాన్ని నింపుకుని ఎక్కడా ఆగక మధ్యాహ్నం రెండున్నరకు తిరిగొస్తానని చెప్పింది డెలీషా. ఆన్ లైన్లో చదువుతున్న తనకు ఈ డ్రైవింగ్ అడ్డంకిగా లేదంది. ఇంధన వాహనం నడపటం అంత తేలికకాదని, మొదటి రెండు అరలలో పెట్రోల్, మరొక అరలో డీజిల్ నింపుతారంది.
ఎంతో జాగర్తగా నడపాల్సి ఉంటుందని, ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందంది డెలీషా. వెనుక నుంచి ఏదైనా వాహనం డీకొన్నా ప్రమాదమేనని, ఇంధనాన్ని నింపుకునే ముందర ఖాళీ ట్యాంకర్ లారీ ని నడపటం అలవాటు చేసుకున్న డెలీషాకి ప్రభుత్వ వాహనాన్ని నడపటమంటఘ మహా ఇష్టం. కేరళ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పుకున్న డెలీషా మన భారత దేశంలో మొట్టమొదటి ట్యాంకర్ లారీ డ్రైవరైన యోగితా రఘువంశీ గురించి విన్నానని, తాను మహిళలకు ఆదర్శంగా ఉండాలనుందని అన్నారు. నేను ట్యాంకర్ లారీ నడుపుతున్నానని చెప్తే మొదట్లో ఫ్రెండ్సెవరూ నమ్మలేదని, ప్రత్యక్షంగా చూసినవారు ఆశ్చర్యపోతున్నారని ఆమె చెప్పింది. అయితే డెలీషా ట్యాంకర్ లారీ డ్రైవరుగా ఉండటం ఆమె తల్లికి అంతగా నచ్చలేదు. ఇప్పుడిప్పుడే సర్దుకుపోతున్నారట ఆమె తల్లి.


కామెంట్‌లు