ఆలోచించి మాట్లాడాలి;-- జగదీశ్ యామిజాల
 అనగనగా ఓ రాజు. ఆయనకు ఓ విచిత్రమైన కల వచ్చింది. ఆ కల ఏమిటంటే ఆయన ఓ మర్రిచెట్టులా మారిపోవడం!
అంతే, భయపడిపోయి లేచి కూర్చున్నాడు వెంటనే.
మరుసటి రోజు పొద్దున్నే ఆ కల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఆస్థాన జ్యోతిష్కుడిని అత్యవసరంగా రప్పించాడు.
రాజు తనకొచ్చిన కలను చెప్పాడు. అంతా విన్న జ్యోతిష్కుడు తన దగ్గరున్న తాళపత్ర గ్రంథాన్ని తీసాడు. మర్రిచెట్టులా మారిపోయినట్టు కల వస్తే ఏం జరుగుతుందో అనే దాని గురించి చదివాడు.
అనంతరం చెప్పాడు "రాజా! మీ భార్య, పిల్లలు, బంధువులందరూ మీ ముందే మరణిస్తారు. ఆ బాధ మిమ్మల్ని కృంగదీస్తుంది. కానీ గట్టిగా ఉండాలి" అన్నాడు. మీరు కన్న కలకు ఫలితమిదేనని చెప్పాడు. 
జ్యోతిష్కుడు చెప్పిన మాటలతో రాజుకు తీవ్రకోపమొచ్చింది. "ఈ జ్యోతిష్కుడిని వెంటనే చెరసాలలో బంధించండి" అని ఆజ్ఞాపించాడు. అప్పటికీ రాజు మనసు శాంతించలేదు. మరొక జ్యోతిష్కుడిని పిలిపించాడు. అతనితోనూ తనకొచ్చిన కలను చెప్పాడు. మర్రిచెట్టు కల అర్థమేమిటీ అని అడిగాడు రాజు.
ఆ జ్యోతిష్కుడుకూడా మొదటి జ్యోతిష్కుడిలాగానే తన దగ్గరున్న తాళపత్ర గ్రంథాన్ని తీసి చూశాడు. అతను మనసులో చదివి ఇలా చెప్పాడు "రాజా! దిగులు పడకండి. మీరు కన్నది మంచి కలే.  మీ జాతకానికి తిరుగులేదు. మీ జీవితమే జీవితం. ఏ శత్రువూ మిమ్మల్ని పడగొట్టలేడు. మీరు మీ కుటుంబసభ్యులకన్నా బంధువులకన్నా దీర్ఘకాలం బతుకుతారు. మీ ఆయుష్షు మర్రిచెట్టులా సాగుతుంది. ఇదే మీరు కన్న కల అర్థం" అని!
ఈ జ్యోతిష్కుడిమాటలు రాజుకు తృప్తినిచ్చాయి. ఆనందపడ్డారు. జ్యోతిష్కుడికి బహు కానుకలు ఇచ్చి సత్కరించాడు.
నిజానికి ఇద్దరు జ్యోతిష్కులూ చదివిన తాళపత్ర గ్రంథం ఒక్కటే. చెప్పిన విషయమూ ఒక్కటే. కానీ చెప్పిన తీరులో తేడా ఉంది. 
ఆస్థాన జ్యోతిష్కుడు చెప్పిందేమిటీ? 
రాజుకు చెందిన వారందరూ ఆయన కళ్ళ ముందే చనిపోతారని.
మరో జ్యోతిష్కుడు చెప్పిందేమిటీ?
అందరికన్నా ఎక్కువ కాలం రాజు జీవిస్తారని.
ఒకడేమో తిన్నగా చెప్తే ఇంకొకడు పరోక్షంగా చెప్పాడు. 
నీతి : మనం చెప్పబోయే మాటలు, మాట్లాడే ముందర ఆలోచించాలి. అప్పుడు అనేక సమస్యలను తప్పించవచ్చు.
మనం చెప్పే మాటలు ఎదుటివారిని సంతోషపరచాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు. కలవరపరచకూడదు. అలా మాట్లాడితే ఏ సమస్యా తలెత్తదు. 

కామెంట్‌లు