కాసేపలా...చిమ్మనీయండి---;-కిలపర్తి దాలినాయుడు
లావా విరజిమ్ముతుంది
అగ్నిపర్వతం....
అలా కాసేపు ....
కాకుంటే కొద్దిరోజులు చిమ్మనీయండి...

కాసేపో...కొద్దిరోజులో
పారనీయండి...

లోపల రగులుతున్న దుఃఖాగ్ని
బయటకు ప్రవహించనీయండి...

అగ్గి రవ్వల అర్ధమేమిటో
తెలుసుకోండి
బూడిదలో కాలిన కష్టాలేమిటో
శోధించండి...
లావాలో ఎన్ని గుండెలను
పిండే హింసా సంఘటనలున్నాయో
గాలించండి....

గాయమైన అగ్నిపర్వతాన్ని
అలా ఏడవనివ్వండి....

అప్పుల యాప్ లో యిరుక్కున్న గొంతుకలా...
దుశ్శాసనులు నీలితెరపై
లాగుతున్న చీరలా...
ఫైబర్ కొరడాల దాష్టికాలా
సైబర్ కోరల దౌర్జన్యాలా..

చదవండి...
సహాయపడండి...
సాయం చేయండి.‌..

హిమలేపనాన్ని పూస్తారో
న్యాయశాస్త్రాస్త్రాన్ని చేతికందిస్తారో...
ఇంకుతున్న కరుణగ్రంథులలో
మరలా ఊటతో నింపుతారో...
మీ యిష్టం!
గ్రహణాలు అలా ఉండి పోవని
చెప్పండి...
----------------------------------------


కామెంట్‌లు