అప్పట్లో దీపావళి; - జగదీశ్ యామిజాల
 ముప్పై నలబై ఏళ్ళ క్రితం దీపావళి రోజులెలా ఉండేవంటే....
నాన్నకు దీపావళి లోన్ మంజూరైంది అని అమ్మ చెప్పే మాట వినడంతో ఆరంభమవుతుంది దీపావళి పండుగ. 
ఇళ్ళల్లో ఆర్థిక స్థితిగతుల కారణంగా అందరికీ ఒకే రంగు బట్టలు కొని నాన్నకు కావలసిన టైలర్ దగ్గరకు మాత్రమే వెళ్ళి కుట్టడానికి ఇవ్వాలి. ఎదిగే అబ్బాయిలు  అనే దృష్టితో వదులుగా ఉండేలా ప్యాంటు చొక్కా కుట్టించిస్తారు నాన్నకు ఇష్టమైన ఆస్థాన టైలర్. అలాగే అమ్మాయిల విషయానికి వస్తే పరికిణీ ఓణీ....వాటికి అంచులు ప్రత్యేకించి కుట్టిస్తే ఏవో లంకె బిందెలు దొరికినంత సంబరం.
దీపావళి పండుగవేళ రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు వెళ్ళడానికి పిల్లలకు పర్మిషన్ ఉండదు. డబ్బూ ఉండదనుకోండి. అందువల్ల పెద్దవాళ్ళెవరైనా సినిమా చూసొస్తే వాళ్ళు ఆ సినిమా కథ చెప్తారు. వారేం చెప్తే అది విని సరిపెట్టుకోవాలి.
పేలే టపాకాయలు ఒక్కొక్కటి చొప్పున కాల్చి అవి పేలినప్పుడు ఆనందించడం, పేలక తుస్సుమంటే నీరుకారడం జ్ఞాపకముందిప్పటికీనూ.
అమ్మానాన్నలకు తెలీకుండా ఓ నలుగురైదుగురు కలిసి అటూ ఇటూ ఉండే వీధులకు వెళ్ళి పేలకుండా ఉండిపోయిన టపాకాయలను తీసుకొచ్చి వాటిలోని మందుని ఓ కాగితంలో పోసి వాటిని కాల్చి ఆనందించం గుర్తే.
.
అలా టపాకాయల మందుతో ఉన్న చేతులను కడుక్కోకుండా ఏదైనా తినడానికి సిద్ధపడితే అమ్మ కొట్టడం తిట్టడం చెవి మెలిపెట్టడం వంటివి జ్ఞాపకముంది.
ఒక్కొక్కప్పుడు చూసుకోకుండా కాలీ కాలని టపాకాయ మీద కాలు పెట్టి గాయపడటమూ గుర్తే.
.
దీపావళి ముందు రోజు రాత్రి వరకూ కుట్టడానికిచ్చిన బట్టలు టైలరు ఇవ్వకుంటే నిద్రపట్టకపోవడమూ జ్ఞాపకమే. టైలర్ ఇస్తాడా ఇవ్వడా అని చర్చ. 
నాన్నో అన్నయ్యో టపాకాయలు తీసుకురావడానికి వెళ్ళి ఇంటికొచ్చేవరకూ ఏ ఏ టపాకాయలు తెస్తారాని మిగిలిన వాళ్ళు మాట్లాడుకోవడం, వారి రాక కోసం ఎదురుచూడటం జ్ఞాపకమే.
పొద్దున్నే లేచి అమ్మో అన్నయ్యో ఒంటికి నూనె పట్టించి వేడి వేడి నీళ్ళతో స్నానం చేయించి కొత్తబట్టలకు పసుపు పెట్టి వేసుకుని దేవుడికి అమ్మకూ నాన్నకూ నమస్కారం పెట్టడం గుర్తే.
దీపావళి పండగకోసం చేసే స్వీట్లు, హాట్లూ ఒకరికొకరు ఇచ్చుకోవడం తినడం ఓ వేడుక. 
ఇంట్లో పని చేసే పనిమనిషికి కొత్తచీర కొనివ్వడం ఓ సంప్రదాయంలా సాగేదప్పట్లో. 
టపాకాయలను చేత్తో వెలిగించి విసరడం, తిట్లుతినడం గుర్తే. 
.
ఇదిగో అదిగో టపాకాయ అంటించాను పేలబోతోంది ....ఆగండనటం జ్ఞాపకం.
.
నచ్చిన బట్టలను ఆర్థిక స్థోమతవల్ల కొనలేక సాదాసీదా బట్టలుకొంటే నిరుత్సాహం చెందడం మామూలే. అలకలు వంటివి సరేసరి.
.
ఇంకా ఇరవై రోజుల్లో దీపావళి పది రోజుల్లో దీపావళి అని రోజులు లెక్కించడం ...ఎప్పుడెప్పుడు దీపావళా అని ఎదురుచూడటం....జ్ఞాపకముంది.
.
అమ్మ దగ్గరో అన్నయ్య దగ్గరో తీసుకున్న చిల్లరపైసలతో బజారుకెళ్ళి ఏదో ఒక టపాకాయ కొనుక్కురావడం ఓ పెద్ద పనిగా ఉండేది.
.
దీపావళి పండుగ తర్వాత కొత్త బట్టలు వేసుకుని స్కూలుకి వెళ్ళి ఫ్రెండ్సుకి చూపించి ఆనందించడం గుర్తే.
అమ్మ దాచిన స్వీట్లను ఎవరికీ తెలీకుండా తినడం పట్టుబడటం తిట్లు తినడం మామూలే.
.
ఊదువత్తులతో కాకుండా అగ్గిపుల్ల వెలిగించి టపాకాయలు కాల్చడానికి ప్రయత్నిస్తే అన్నయ్యో ఆమ్మో తిట్టడం సర్వసహజం.
.
వెలుగుతున్న కాకరపూవొత్తి చివరకొస్తే దాంతో మరొక కాకరపూవొత్తి వెలిగించడానికి ప్రయత్నించడం ఓ ఆనందం. ఒక్కాక్కప్పుడు వెలుగుతున్న కాకరపూవొత్తిని గాల్లోకి విసరడం ఓ సరదా.
పాము మాత్రలను వరుసగా ఉంచి వాటన్నింటిని కాల్చడం ఓ ఆటలా ఉండేది.
.
పేలని లక్ష్మీ టపాకాయలో ఓ సీమటపాకాయ గుచ్చి దానిని పేల్చడం బాగా గుర్తు.
.
అప్పట్లో రాకెట్లు కాల్చడం అనేది డబ్బున్న వారింట్లో వాళ్ళే. 
డాబా మీద నిల్చుని ఇరుగుపొరుగు వాళ్ళు  టపాకాయలు కాల్చితే చూడటం ఓ సరదా.
కానీ అప్పట్లో మేం జరుపుకున్న దుపావళిలా ఇప్పటితరం జరుపుకుని ఆనందిస్తున్నారా అనేది ఓ ప్రశ్నే...ఏదేమైనా ఎక్కువో తక్కువోగానీ ఆ రోజుల్ని మరచిపోలేం.


కామెంట్‌లు