మనో మథనం ;-చంద్రకళ యలమర్తి
నా కవితలు మనసు పలికే మౌనగీతాలు 
తొలి సంధ్యలో అర్కుని ఆగమనంతో

లేలేత కిరణాలు సోకిన హిమ వన్నగాలు స్వర్ణ శోభితమౌతుంటే

పక్షుల కిలకిలారవాలు మృదు మధురంగా వీనుల విందు చేస్తుంటే

చల్లని గాలి మేఘ మయూఖ తంత్రులను మీటుతుంటే

తొలకరి చిరుజల్లులలో తడుస్తుంటే 

వ్యాహ్యాళి లో అర విచ్చిన
సుమాలు తలలు ఊపుతూ పలకరిస్తుంటే

ఝమ్మంటు మధుపాలు సంగీత స్వరాలు వినిపిస్తుంటే

చిన్నారి పాపల బోసినవ్వులు చూస్తుంటే

పండు వెన్నెల్లో నిండు జాబిలిని చూస్తూ
ఆకాశంలో చుక్కల్నిలెక్కిస్తుంటే 

ప్రకృతి అందాలకు పులకించేనాలో ఆనందానుభూతులు వెల్లువై

ఓ నవకవిత అమృతంలా పురుడు పోసుకుంటుంది
కానీ 
బ్రతుకు బ్రతుకలేనంత భారమయి
నప్పుడు 
బ్రతుకు అగమ్య గోచరమైనప్పుడు

బ్రతకడానికి మెతుకులేక తల్లడిల్లే
పేదబతుకుల్లో
 విషాదాలను చూసినప్పుడు

ఆడపిల్లని ఈసడించుకునే పిచ్చి మనస్తత్వాలని చూసినప్పుడు

కరువులు, కాటకాలతో ప్రజలు నిరాశ్రయులై తల్లడిల్లేటప్పుడు
మహమ్మారులు విజ్రుంభించి
నప్పుడు

ఆడపిల్లల అర్తనాదాలు, అన్యాయపు చావులు విన్నప్పుడు
నాలో  ఆవేదన కవనమై ఉప్పెనగా ఎగసి 

ఆ విషాదపు మనో మథనంలో 
 మరో కవిత గరళమై జన్మిస్తుంది

***


కామెంట్‌లు