జీవనపయనాలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పెనుగాలి వీస్తుంటే
భారీవర్షం కురుస్తుంటే
నావను ఎక్కేదెట్లా
నదిని దాటేదెట్లా

పువ్వులు పూయకుంటే
తేనె దొరకకుంటే
తుమ్మెదలు త్రాగేదెట్లా
బ్రతుకును వెళ్ళబుచ్చేదెట్లా

పాలు పిండకుంటే
కుండలో పోయకుంటే
కవ్వంతో చిలకకుంటే
వెన్నను తీసేదెట్లా

కోర్కెలు పెరుగుతుంటే
కోరినవి దొరకకుంటే
మనసులు మదనపడుతుంటే
లక్ష్యాలు సాధించేదెట్లా

చీకటి ఆవరిస్తే
దారి కనబడకుంటే
తోడులేక ఒంటరిగుంటే
జీవనపయనం సాగేదెట్లా

కష్టాలు తరుముతుంటే
కన్నీరు కారుతుంటే
కాయాలు గాయపడితే
కాపురాలు కాపాడుకునేదెట్లా

కన్నకలలు కల్లలయితే
గీసినచిత్రాలు చెదిరిపోతే
అనుకున్నవి జరగకపోతే
బ్రతుకుబండిని లాగేదెట్లా

కళ్ళల్లో నిప్పురవ్వలుపడితే
కాళ్ళల్లో ముల్లుగుచ్చుకుంటే
కడుపులు ఖాళీగాయుంటే
జీవననడక సాగుదీయుటెట్లా

ఆలోచనలు పారకుంటే
భావాలు బయటకురాకుంటే
విషయాలు తట్టకుంటే
కవులకవితలు పుట్టేదెట్లా

తీరం కనబడకుంటే
గమ్యం చేరుకొనేదెట్లా
ప్రాణం నిలుపుకొనేదెట్లా
జీవితం సాగించేదెట్లా

జీవనకష్టాలను
అధికమించరా
జీవితగమ్యాలను
అలవోకగసాధించరా


కామెంట్‌లు