రాతి గాయం;-మూలం - ;తమిళకవి కవికో అబ్దుల్ రహ్మాన్;-అనుసృజన - యామిజాల జగదీశ్
సమాధిపై ఉన్న 
ఓ శిలాఫలకాన్ని చూశాను

నీ పేరు
కింద రెండు అంకెలు
పుట్టిన ఏడాది
మరణించిన ఏడాది
మధ్యలో ఓ గీత
ఇదేనా నీ చిరునామా
ఇంతేనా నీ చరిత్ర
ఇవేనా నువ్వు సాధించినవి
నీ పేరు – నువ్వు సంపాదించినదా
నీ జననం మరణం నీ సాధించినవా
ఈ ఏడాదులు
ఉలి చెక్కిన గీతలంతే

నీ పుట్టిన సంవత్సరం 
నవ్వులతో చెక్కిందా
నీ మరణ సంవత్సరం 
కన్నీటితో గీసినదా

ఇది శిలాఫలకమా
కాదు
రాతి గాయం
మధ్యలో ఆ గీత - దానికి అర్థమేమిటీ...?

నువ్వు వొట్టి గీతేనా
శూన్యాన్ని నువ్వు భర్తీ చేయలేదా
లేక నువ్వు నింపలేదా
లేక నువ్వు గడిపిన వాటికి చిహ్నమా

కూడికలు
హెచ్చవేయడాలు
తీసివేయడాలు వంటి వాటిలో నువ్వు లేవా

నువ్వు వొట్టి అంకెలతోనే ఏర్పడ్డావా
నీకంటూ అక్షరాలు లేవా
నువ్వసలు ఏదీ రాయనే లేదా
ఈ రాయి మాత్రమే నన్ను తలుస్తోందా
ఏ హృదయంలోనూ నువ్వు స్థానం సంపాదించలేదా
ఈ మట్టిలో మాత్రమేనా నీకు అంతిమ సంస్కారాలు జరిగాయి
ఏ పుస్తకంలోనూ 
నీ గురించి ఒక్క ముక్కా లేదా
నీ శ్వాసనిశ్వాసలు కేవలం మృత్యుదిశలో వేసిన అడుగులేనా
నువ్వు ఇతరులకు ఊపిరి కాలేదా
మనిషి ఆరంభంలోనూ లేడు
ముగింపులోనూ లేడు
మధ్యలో ఉన్నాడు

నువ్వు నిన్ను చూసుకున్నదే లేదా
లేక
కనుగొనడానికి వీల్లేని విధంగా 
నిన్ను నువ్వు కోల్పోయేవా

జనాభా లెక్కలలో మాత్రమే నువ్వున్నావా
మరే లెక్కలలోనూ నువ్వు లేనే లేవా
ఆదాయమై లేకపోవచ్చు
కనీసం ఆసక్తితోనైనా లేవా నువ్వు?!
 -------------------------------------------------


కామెంట్‌లు