విచిత్ర ప్రకృతి ; - రచన , v r శాస్త్రి;--సమీక్ష, Dr కందేపి రాణీ ప్రసాద్

 ఈ పుస్తకాన్ని వి.ఆర్.శాస్త్రిగారు 1959 వ సం॥లో వివిధ జంతువుల విచిత్ర ప్రకృతిని గురించి వివరిస్తూ రాశారు . వి.ఆర్.శాస్త్రిగారు అనుభవజ్ఞులైన రచయిత . ‘ నీవూ - నీపుట్టుక ' , ' నీవూ - నీపరిణామం ' అనే సైన్స్ గ్రంథాలు రాసి అద్భుతమైన జనాదరణ పొంది ఉన్నారు రచయిత . అణు హృదయ విచ్ఛేదం నుండి , అంతరిక్షంలోని ప్రయాణం దాకా పరిశోధనలు చేసి పరీక్షించిన శాస్త్ర విజ్ఞానాన్ని ప్రతివారికీ అందించాలి . సాధారణ విషయాల కంటే విచిత్రమైనవీ , అతిశయమైనవీ తెలుసుకోవడానికి మానవులు ఉత్సుకత చూపిస్తారు . అందుకే ఈ పుస్తకంలో ఇటువంటి విచిత్రమైన విషయాలను ఆసక్తికరంగా వివరించారు . 
“ తన యాభై అరవై ఏళ్ళ జీవితంలో ఒక్కసారైనా పడుకోని జంతువూ , నీటి కెదురీత ఈదుతూ వేయి మైళ్ళు తిండి తినకుండా వెళ్ళే చేపా , ఒక్క గ్రాము ఆహార శక్తి మాత్రము ఉపయోగించి సముద్రం మీద ఐదువందల మైళ్ళు ఎగిరే పిట్ట , సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భుజించే ప్రాణీ , నీరే తాగని ప్రాణులై , వెచ్చని ఎండ కొరకు సంవత్సరానికొకసారి , ఇరవై వేల మైళ్ళు ఎగిరి వెళ్ళే పక్షులూ , పొదిగి పిల్లలయ్యేదాకా తన నోటిలో గుడ్ల నుంచుకొని నిరాహారదీక్ష పూనే తండ్రి చేపా , వీపులో నుండి పిల్లలు పుట్టే కప్పా , గ్రుడ్లు పెట్టి పిల్లలు చేసే శలభమూ ” వంటి ఎన్నో చిత్ర విచిత్రమైన నిజాల గురించి ఈ పుస్తకంలో విపులంగా విశదీకరించారు . 
‘ ఆఫ్రికా ఏనుగు నిలబడే నిద్రిస్తుంది . మన ఆసియా ఏనుగు పడుకొని నిద్రపోయింది ’ అనే విషయం ' నిలువు జీతపు నిత్యకొలువు ' వ్యాసంలోనూ , ఒక జంట ఎలుకలకు పుట్టే పిల్లలన్నీ బ్రతికి ఉండీ కనక ఐదు సంవత్సరాలలో 1,50,00,000 ఎలుకలుగా అవుతాయన్న విషయాన్ని ' కోటీ యాబది లక్షల సంతానం ' అనే వ్యాసంలోనూ చెప్పారు . వీటిని విజ్ఞానశాస్త్ర వ్యాసాలుగా కన్నా , ఇందులో ఎన్నో కథలు సందర్భానుసారంగా ఉన్నాయి . వీటివల్ల పిల్లలకు ఎంతో ఉత్సుకతనూ , ఆసక్తిని కలిగిస్తాయి. ఎడారి ఎలుకలకు తమ కలుగులను శాఖోపశాఖలుగా రహస్యదార్లుగా నిర్మిస్తాయి. శత్రువు వెళ్ళాలన్నా, వాటికీ దారి ఏంటో అర్థంకాక వెనకకు తిరిగి వస్తుంది. ఇది పద్మవ్యూహాన్ని రచిస్తుందన్నమాట. ఎలుకలకు చాలా తెలివి ఎక్కువ . అందుకే శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలకు వీటినే ఎన్నుకుంటారు . కంగారూ జాతికి చెందిన ఎలుకంత ' ఒప్పాజమ్ ' అనే జీవికి ఒక ఈతలో పది పన్నెండు పిల్లలు పుడతాయి . అవెంత చిన్నవంటే పన్నెండింటినీ ఒక చెంచాలో విశాలంగా పడుకోబెట్టవచ్చు . కథల పుస్తకంలోని కథల కన్నా ఇందులోని కథలు ఎంతో ఆసక్తికరంగా , విషయాత్మకంగా ఉన్నాయి .
కామెంట్‌లు