*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0181)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*హిమవంతుని హృదయంలో - మేనక గర్భంలో దేవి ప్రవేశించడం - దేవతలు స్తుతి చేయడం - అమ్మ కుమార్తె రూపం ధరించడం - తల్లితో మాట్లాడటం*
*నారదా! ఉమాదేవి అనుగ్రహం పొందిన హిమవంత మేనకలు, భక్తి శ్రద్ధలతో దేవకార్యము నెరవేరడానికి, లోక కళ్యాణం జరపడానికి జగన్మాత కోసం భగవతిని నిత్యం ధ్యానం చేస్తున్నారు. అప్పుడు, అన్ని కోరికలను నెరవేర్చగలిగిన అమ్మ, హిమవంతుని మనసులో చేరింది. ఈ చేరికతో హిమవంతుడు అమిత తేజోసంపన్నుడై, సూర్యమండల సమానముగా వెలిగిపోతున్నాడు. అన్ని సమయాలలో ఎంతో ఆనందంగా వున్నాడు. ఆ తరువాత, ఒకానొక మంచి ముహూర్తములో జగన్మాత తేజస్సు మేనక గర్భంలో ప్రవేశించింది. అంబ చేరికతో, మేనక చంద్రకాంతులతో సమానమైన ఆనందాన్ని అనుభవిస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ శివదేవిని నిత్యం కొలుస్తున్నారు. మేనక గర్భంలో ఉమ చేరింది అని తెలుసుకున్న దేవతలు అందరూ, విష్ణువు సహితంగా వచ్చి ఆకాశవీధిలో నిలబడి చేతులు కట్టుకుని గిరిరాజుకు కూతురుగా పుట్టబోతున్న ఉమాదేవిని అనేక స్తుతులతో కీర్తించి వారి వారి నివాసాలకు వెళ్ళారు.*
*గర్భస్థ శిశువుకు తొమ్మిది నెలలు దాటి పదవనెల నడుస్తున్న సమయంలో వసంత ఋతువు చైత్రమాసంలో నవమి రోజు మృగశిరా నక్షత్రమున అర్ధరాత్రి సమయంలో మేనక గర్భమున తన స్వ స్వరూపముతో అవతరించింది. విష్ణువు మొదలైన దేవతలు అందరూ ఆనందంతో నాట్యం చేసారు. దేవిని కీర్తించారు. దివ్య కమాలాల కాంతితో తన ముందు ప్రత్యక్షమైన ఉమను చూచి మేనక ఆనంద డోలికలలో  ఓలలాడింది. దేవీ దర్శనం తో గిరిప్రియ అయిన మేనకకు జ్ఞానం ప్రాప్తించింది. "అంబా! నీవు నా యందు దయతో నాముందు ప్రత్యక్షం అయ్యావు. నీవే ఆద్యా శక్తివి. పరాశక్తివి. మాహేశ్వరీ! ఈ రూపంలో, నా ధ్యానం లో ఎల్లప్పుడూ నీవు నిలిచి ఉండమ్మా! ఇప్పుడు నా యందు దయతో నా కుమార్తె గా మానవ రూపంలో కనిపించు తల్లీ! " అని ప్రార్ధించింది, మేనక.*
*"ఇంతకు ముందు నీవు నన్ను నీ గర్భస్త శిశువుగా ఉండమని అడిగావు, అందుకే వచ్చాను. నీ తృప్తి తీరే వరకు ఈ రూపాన్ని చూచుకో, గిరిరాజ ప్రియా! నేను నీ కుమార్తె గా పెరిగి, శంభునకు పత్ని అయి దేవతలకు సంతోషాన్ని కలిగిస్తాను. మంచి వారిని అందరినీ కష్టాలనుండి గట్టు ఎక్కిస్తాను." అని చెప్పి జగదంబ మేనక చూస్తుండగానే తన దివ్య రూపము వదిలి సామాన్య మానవురాలిగా, నవజాత శిశువు రూపము ధరించి, మేనక అడ్డాలలోకి చేరింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు