*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0187)*
*కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*గంగావతరణ తీర్థం దగ్గర తపస్సు చేసుకుంటున్న శివ భగవానుని సేవలో హిమవంతుడు పార్వతిని ఉంచబోవడం - ఆ ప్రస్థావన శివుడు తితస్కరించడం.*
*నారదా! ఒక రోజు, గంగావతరణ తీర్థం దగ్గర తపస్సు చేసుకుంటున్న శివ భగవానుని సేవలో హిమవంతుడు తన కూతురు అయిన కాళిని వెంటబెట్టుకుని ఆమె ఇద్దరు పరిచారికలతో సహా, స్వామి పూజకు అవసరమైన పూజ సామాగ్రితో వచ్చి, జ్ఞాన పరాయణుడు, త్రిలోకనాథుడు అయిన శివునికి నమస్కారము చేసి, "పరమేష్ఠీ! ఈమె నా కుమార్తె పార్వతి. భగవంతుడవు, చంద్రధరుడవు అయిన నిన్నే తన మనసులో నిలుపుకొని, నిత్యము పూజలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు, నీ సేవలో ప్రత్యక్షంగా పాల్గొని తరించాలి అని నీవద్దకు వచ్చింది. నీ సేవలో ఉండాలి అని ఆతురుతతో ఉన్న నా కూతురైన కాళికి అనుజ్ఞ ఇచ్చి అనుగ్రహించు, తండ్రీ!" అని వేడుకున్నాడు.*
*అప్పుడు భగవంతుడు అయిన శివుడు, ధ్యానము నుండి బయటకు వచ్చి శుశోభిత అంగములు కలిగిన ఆ సర్వాంగ సుందరిని చూచి, "హిమవంతా! నీవు ఒక్కడవే వచ్చి ప్రతి రోజు నా సేవ చేసుకోవచ్చు. నీ కూతురును తీసుకుని రావద్దు" అని చెప్పి మరల ధ్యాన ముద్రలో కూర్చున్నారు, కానీ గిరిరాజు ప్రార్థనను ఒప్పుకోలేదు. హిమవంతుడు తన శిరస్సును సర్వేశ్వరుడు, జటాజూటధారి, వేదాంతవేద్యడు అయిన శివుని పాదాల వద్ద ఉంచి, తన, తన కుమార్తె కోరికను మళ్లీ విన్నవించుకున్నాడు.*
*అప్పుడు, సదాశివుడు లోకములో ఆచరించవలసిన సామాన్య విషయాన్ని హిమవంతునకు ఇలా చెప్పారు. "హిమవంతా! నీ కుమార్తె సర్వలక్షణ శోభిత. అత్యంత సౌందర్య రాశి. తన్వంగి. చంద్రముఖి. నేను, ముక్కు మూసుకుని కూర్చుని తపస్సు చేసుకుంటున్న సర్వసంగ పరిత్యాగిని. విద్వాంసులు, స్త్రీ మాయారూపిణి అని కదా, చెపుతారు. ఈమె యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీ. స్త్రీలు, తాపసుల తపసు కు భంగము కలిగిస్తారు. నేను ఎప్పుడూ మాయచేత నిర్లిప్తంగా ఉండే వాడిని. నాకు స్త్రీలతో ఏమి పని. స్త్రీ సాంగత్యము వల్ల విషయ వాసనలు కలుగుతాయి. విషయ వాసనల వల్ల వైరాగ్యం పోతుంది. వైరాగ్యం లేని పురుషుని తపస్సు భంగమౌతుంది. అందువల్ల, తపస్సు చేసుకోవాలి అనుకునే వారు స్త్రీ సాంగత్యము చేయ కూడదు. కనుక, నీ కుమార్తె తో కాక, నీవు ఒక్కడవే నా సేవకు రావచ్చును" అని పలికి ధ్యానము లోకి వెళ్ళి పోయారు.*
*ఏమాత్రమూ జాలి, దయ చూపించకుండా, శివ భగవానుడు పలికిన మాటలకు హిమవంతుడు చాలా బాధ పడ్డాడు. అలా బాధ పడుతున్న తనతండ్రిని చూచిన పార్వతి, తాను తనవదైవంగా కొలిచే వృషభవాహనునికి నమస్కారం చేసి ఇలా ప్రార్థించింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss 

కామెంట్‌లు