*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0192)*
 *"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*రుద్రుని కోపానికి కామదేవుడు భస్మం అవడం - రతీదేవి ప్రార్థన - ద్వాపరయుగం - ప్రద్యుమ్న రూపం - పునర్జన్మ - రతీదేవి శంబరనగరమునకు వెళ్ళడం.*
*నారదా! శివుని మాయలో ఉన్న కామదేవుడు తన భార్య రతీదేవి, వంసంతులు మొదలైన స్నేహితులతో కలసి గంగావతారము చేరి తపస్సు లో తలమునకలుగా ఉన్న శివస్వామి పైకి తన ప్రతాప ప్రదర్శన మొదలుపెట్టాడు. అనేక వికారములు కలుగించే బాణములను తన అమ్ముల పొదనుండి రుద్రదేవుని మీద ప్రయోగించాడు. ఈ బాణములు శివభగవానుని మనసు మీద తమ ప్రభావం చూపసాగాయి. ఫలితంగా, రుద్రునికి తపోభంగం అయింది.*
*అలా తన తపస్సు భంగం అవడానికి గల కారణము ఏమిటి అని ఆ స్వామి నాలుగు దిక్కలా పరికించి చూసారు. దక్షిణం వైపునుండి తన పూల బాణాలను వదలుతున్న కామదేవుడు కనిపించాడు. అప్పుడు కామదేవుడు, తన తూణీరములో ఉన్న అత్యంత శక్తివంతమైన పూల బాణాన్ని రుద్రుని పై ఎక్కుపెట్టి వదిలాడు. అదే సమయంలో, తపస్సు భంగము అవడానికి కారణమైన మన్మధుని వైపు చూస్తూ, నుదుటిపై ఉన్న మూడవ కన్నును తెరిచారు. ఆ కంటి లోనుండి, భయంకరంగా తన కోరలు చాస్తూ, అగ్ని దేవుడు వచ్చాడు. ఆ అగ్ని జ్వాలలు పై పైకి ఎగసి పడుతూ ఆకాశం నుండి కామ బాణాలు వేస్తున్న కామదేవుని వైపు వెళుతున్నాయి. అది చూసి భయపడిన కామదేవుడు, ఇంద్రుడు మొదలైన దేవతలను తలచుకుని, తనను రక్షించమని ప్రార్థన చేసాడు. ఇంద్రాదులు వచ్చే సరికి, అగ్ని జ్వాలలు కామదేవుని సమీపించడం, ఆతడు దహించబడటం జరిగిపోయాయి.*
*జరిగిన విషయం అర్థం చేసుకున్న దేవతాగణములు కూడా కొంతసేపు నివ్వెరపాటుతో, నిశ్చేష్టులుగా ఉండిపోయారు. తన కళ్ళ ముందే తన భర్త అయిన కామదేవుడు భస్మం అవడం చూసిన రతీదేవి స్మృతి తప్పి నేల మీద పడిపోయింది. తెలివి వచ్చిన తరువాత, భస్మముగా పడి వున్న తన భర్తను చూచి అనేక విధలుగా విలపిస్తూ, తన భర్తను ఈ పనికి నియమించిన ఇంద్రుడు మొదలగు దేవతలను నిందించ సాగింది. తన భర్తను కోల్పోయి, ఈ విధంగా బాధ పడుతున్న రతీదేవితో ఇంద్రుడు, "రతీదేవి! నీ భర్తను ఒక దైవకార్యం కోసం సహాయము అడిగాము. ఆతడు తన పని నిర్వర్తించాడు. నీవు ఏడువ వలసిన పనిలేదు. అందరి బాధలను తీర్చే శంకరుడు, నీ బాధను కూడా తొలగిస్తారు. నీ భర్త పునర్జీవితుడు అవుతాడు. నీవు, నీ భర్త భస్మం తీసుకుని జాగ్రత్తగా భద్రపరచు" అని చెప్పి, శివ భగవానుని సన్నిధికి చేరతారు.*
*తపస్సు భంగమైన కారణంగా, ఉగ్ర రూపంతో ఉన్న రుద్రుని చేరి దేవతా సమూహము, ఆ స్వామిని వేనోళ్ళ కీర్తన చేసారు. శివుని సేవలో ఉన్న పార్వతీ దేవి, ఆమె చెలికత్తెలు కూడా భయకంపితులై వారి ఇంటికి వెళ్లి పోయారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు