*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 090*
 *ఉత్పలమాల:*
*వారిజపత్ర మందిడిన | వారి విధంబున వర్తనీయమం*
*దారయ రొంపిలోన దను | వంటని కుమ్మరపుర్వు రీతి సం*
*సారమునన్ మెలంగుచు వి | చారగుఁడై పరమొందుఁగాదె స*
*త్కారమెరింగి మానవుడు | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
తామరాకు మీద ఉన్న నీటి బిందువు తామరాకుకు అంటనట్లు, బురదలో దొర్లిన కుమ్మరి పురుగుకు బురద ఎలా అంటుకోకుండా వుంటుందో, అలాగే సంసారంలో ఉండి కూడా నిన్ను భక్తి తో కొలిచే మనుషులు ఆ సంసార బంధములో కొట్టకుపోకుండా మోక్షము పొందుతాడు కదా లక్ష్మణాగ్రజా!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ చరాచర ప్రపంచంలో పుట్టిన ప్రతీ మనిషీ తనకు చుట్టుకొనిన బంధనాలను నిజముగా తనతో చివర వరకు ఉండేవి అవే అని వాటిని వదలకుకోలేక పోతున్నాడు. కానీ, తాను వదిలించుకున్న వదిలించు కోక పోయినా, అవి ఒకటొకటిగా తనని వదలి వెళ్ళడం మొదలు పెట్టినా కూడా నిజాన్ని తెలుసుకోడు, ఒప్పుకోడు. ఇక్కడ జరిగేది, జరుగుతున్నది అంతా పరమేశ్వర నటన, ఆలోచన అనే ఆలోచనని అస్సలు రానీయడు, ఒప్పుకోడు. ఈ బంధనాలు అన్నిటికీ మన మనసులో కలిగే ఊహలే కారణం అనేది నిజం. అందువల్ల మన మనసులో ఎల్లప్పుడూ నిరంజన నిరాకార నిర్గుణుణ్ణి నిలుపుకుని, నిరంతరమూ సాధన చేయడం ద్వారా బంధనాలు వాటంతట అవే విడిపోతాయి. మన మనసు శివార్ణవం అవుతుంది. అటువంటి స్థితిని మనకు కలిగించమని వృషభేశ్వరుని వేడుకుందాము.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు