కవి చమత్కారం;--ఎస్‌. హనుమంతరావు--8897815656
 అవి అనవేమా రెడ్డి ప్రభువు రాజ్యం చేస్తున్న రోజులు. ఓ రోజు మహారాజు కొలువుదీరి వుండగా, పొరుగు రాజ్యం నుండి ఒక కవి రాజు దర్శనార్ధం వచ్చాడు. రసికుడు, సారస్వతప్రియుడైన రాజు కవిని సాదరంగా ఆహ్వానించాడు.
అనవేమా రెడ్డిని కవి తన శ్రావ్యమైన కంఠంతో, రాగయుక్తంగా కీర్తిస్తూ...
‘‘ అన‘వే’మ మహీపాలా స్వస్త్యస్తు తన బావ‘వే’
అహ‘వే’ రిపు దోర్ధండ, చంద్ర మండల రాహ‘వే’ ’’
అన్న సంస్క ృత శ్లోకం చదివాడు. కవి రచనా చమత్క ృతికి సభలోని సహృదయలు హర్షఆమోదాలు వ్యక్తం చేశారు. చప్పట్లతో సభ మార్మోగింది. అనవేమా రెడ్డి హృదయం ఆనంద పారవశ్యంతో ఉప్పొంగింది. సభ సద్దుమణిగాక, అనవేముడు తన కోశాధికారి వైపు చూస్తూ, కవికి మూడు ‘వే’ లిమ్మని ఆజ్ఞాపించాడు.
వెంటనే కవి ‘‘మహాప్రభూ!... నేను మీకు నాలుగు ‘వే’ లిచ్చాను. వడ్డీ లేదు సరికదా, కనీసం అసలు కూడా లేదా? మరీ మూడు ‘వే’ లు దయజేస్తే ఎలా?’’ అని అన్నాడు నవ్వుతూ. స్తుతి శ్లోకంలో నాలుగు సార్లు వచ్చిన ‘‘వే’’ అక్షరాన్ని స్ఫురణకి తెస్తూ అన్న మాట అది.
కవి చమత్కారానికి ‘సెభాష్‌’ అని మెచ్చుకున్నాడు రాజు.
‘‘సరే!... అసలుకు ఒక వేయి వడ్డీ కలిపి ఐదు ‘వే’ లిస్తున్నాను, సంతోషమేనా?’’ అన్నాడు అనవేమా రెడ్డి.అంటె ‘అసలు’ నాలుగు ‘వే’ లు వడ్డీ ఒక ‘వే’ యి వెరసి ఐదు వేలు. దానికి కవి ‘‘మేము ఆరు వేల నియోగులంÑ మమ్మల్ని తగ్గించడం మీ వంటి దొడ్డ ప్రభువులకు భావ్యమా?’’ అని అన్నాడు. ఆరు వేల నియోగులు అన్నది బ్రాహ్మణులలో ఒక శాఖ. కవి కొంటెతనాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు రాజు.
మంద స్మిత వదనంతో సభలోని బ్రాహ్మణ సమూహం వైపు ఒకసారి చూసి, మళ్లీ కవి వైపు తిరిగి ‘‘అయితే, మరో వేయి పెంచుతున్నా!’’ అన్నాడు రాజు.
‘‘ఇది మరీ బావుంది మహారాజా!... మాది మాకిచ్చి బహుమానం ఇచ్చానంటే ఎలా కుదురుతుంది?’’ అన్నాడు కవి చతురంగా.
‘‘అలాగా!... సరే!... మరో వేయి’’ అన్నాడు రాజు.
‘‘కరుణాసముద్రా!... మీ బహుమతికి ఒక దండం... ‘ఏడు’ రోదన సంఖ్య కదా... చివరికి నన్ను ఏడవమంటారా?... ఇది మీకు ధర్మమేనా?’’ అన్నాడు కవి.
కవి చమత్కారానికి మహారాజు మనసారా నవ్వుకున్నాడు.
ఈసారి మరో వేయిని పెంచాడు. కవి సంతోషించాడు.
(ప్రాచీన గాథ స్ఫూర్తితో)  

కామెంట్‌లు