కప్పల తక్కెడ ( జాతీయం వివరణ) ;-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
  కొన్ని పనులు చేయడం అసాధ్యం. ఎన్నిసార్లు కష్టపడినా, ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక లొసుగు బైటపడి చేస్తున్న ప్రయత్నమంతా విఫలమవుతూ వుంటుంది. ఎవరూ సానుభూతి చూపరు, అండగా నిలబడరు. ప్రోత్సహించరు. పైగా అలాంటి తెలివి తక్కువ పని చేస్తున్నందుకు మనం నవ్వులపాలు అవుతాం. అందుకే అలాంటి అసాధ్యమైన , లొసుగులతో కూడిన తెలివి తక్కువ పనులను కప్పల తక్కెడ వ్యవహారం అంటారు.
ఒకడు కప్పలను తెచ్చి సగం సగం తూచాలి అనుకున్నాడట. ఒక తక్కెడ తెచ్చి వాటిని రెండు వైపులా వేయడం మొదలు పెట్టాడు. కప్పలు ఎక్కడయినా ఒక చోట కుదురుగా మట్టసంగా వుంటాయా, ఒకటి వేసేలోపు మరొకటి ఎగిరి బైటకు దూకసాగింది. అలా గంటలు గంటలు దాటినా వానికి ఆ కప్పలను తూచడం సాధ్యం కాలేదు. అది చూసి అందరూ ఒకటే నవ్వులు. ఆఖరికి వానికి విసుగొచ్చి, ఏమీ చేయలేక ఆ కప్పలను త్రాసును అక్కడే పాడేసి పోయాడట. అందుకే ఇటువంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నప్పుడు "రేయ్.. అవి ఎప్పటికీ పూర్తికావురా... అదంతా కప్పల తక్కెడ వ్యవహారం" అని పెద్దలు హెచ్చరిస్తుంటారు.
**********

కామెంట్‌లు