మనసు విరిగితే;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మనిషి సంఘజీవి ఏ ఒక్కరూ ఏకాంతంగా జీవించలేరు  ఒకరి సహకారం మరొకరికి తప్పకుండా ఉండి తీరవలసినదే. స్నేహంగా ఉంటున్న వ్యక్తులలో కూడా అప్పుడప్పుడు పొరపొచ్చాలు రావచ్చు  ఒకరి సలహా మరొకరికి నచ్చకపోవచ్చు. అలాంటి సమయంలో మాట మాట పెరుగుతుంది  చివరకు తగాదాకు మూలం అవుతోంది  అలా కొట్లాట వరకు వచ్చిన తరువాత  వారి సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి  ఒకరిని చూస్తే మరొకరికి శత్రువు భావం తప్ప మైత్రీ భావం ఉండదు  కనీసం వారి పిల్లలను వీరు వీరి పిల్లలను వారు పలకరించడం కూడా  ఉండదు. ఒకసారి మనసు విరిగిన తరువాత  అది భార్యాభర్తలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు తెలిసిన వారు కావచ్చు  ఎవరైనా సరే  విరిగిన మనసులు కలవడం  అసాధ్యం. వేమన ఇనుమును పోలికగా తీసుకొని  ఈ బంధాలను గురించి చెప్పారు. ఇనుము వేరు, కంచు వేరు  పొరపాటుగా కంచు  ఒక ముక్క విరిగినప్పుడు  ఏ పరిస్థితిలోనూ ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడు అయినా  దానిని కలపడం అతని వాళ్ళ కాదు  అదే ఇనుము ఉన్నట్లయితే  కమ్మరి వారి దగ్గరికి వెళ్లి  విరిగిన రెండు ముక్కలు ఇస్తే  వాటిని బాగా కాల్చి ఒకటికి రెండు మూడు దెబ్బలు కొట్టి  దానిని అతికించే ప్రయత్నం చేస్తాడు  అది అతని వృత్తి ధర్మం  విరిగిన ఇనుప ముక్కలను కలపడం అతనికి వెన్నతో పెట్టిన విద్య  ఆయన పనిచేసిన తరువాత  ఈ రెండు ముక్కలు కలిపి ఒక ముక్కగా తయారయింది అన్న ఆనవాళ్ళు కూడా లేకుండా చేయగలిగిన  పనిమంతుడు. ఆ కమ్మరి వృత్తి  రీత్యా అతనికి అలవడిన విద్య అది.
ఆ రెండు ముక్కలు ప్రాణం లేనివి కనుక దానిని అతికించే సంధానకర్త ఉండడంవల్ల  అవి తిరిగి కలుసుకున్నాయి.  కానీ ఇక్కడ మనసు  ప్రధానం  మానవ ప్రవృత్తి లో  ఆత్మాభిమానం ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం  ఒకవేళ రాజీపడి అతనితో  స్నేహబంధాన్ని కలుపుకోవాలి అనుకున్నా తీరా అతను తలవంచి వెళ్లినా అతను మళ్ళీ పాత స్నేహితుడుగా మారతాడా  అన్నది ప్రశ్నార్థకమే. దానికి కారణం అవతలి వ్యక్తికి కూడా మనసు ఉన్నది  ఆ మనసుకు పరిపరివిధాల ఆలోచించే  గుణం, శక్తి ఉంది. అందరూ ఒకే రకంగా ఆలోచించేవారు కాదు. పుర్రెకు ఒక బుద్ధి అని మన పెద్దలు చెబుతూ  ఉంటారు  కనుక  ప్రాణం లేని ఇనుప ముక్కలాగా  ప్రాణం ఉన్న రెండు మనసులు కలవవు అని వేమన చెబుతున్నారు. ఆ పద్యాన్ని చదవండి.

"ఇనుము విరిగెనేని యిరుమారు ముమ్మారు 
కాచి యతుక వచ్చు క్రమముగాను  
మనసు విరిగెనేని మరియంట నేర్చునా..."


కామెంట్‌లు