గ్రీన్ ఎనర్జీతోనే ఉజ్వల భవిష్యత్తు ;- సి.హెచ్.ప్రతాప్ ;-సెల్ ; : 95508 51075
విద్యుత్‌ శక్తి కనిపెట్టిన తర్వాత మనిషి జీవన విధానంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కలలో కూడా ఊహించని విధంగా అభివృద్ధి సాధ్యమైంది. నాగరికత, శాస్త్రవిజ్ఞానం పెరిగే కొద్దీ మనిషి శిలాజ ఇంధనాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. బొగ్గు, పెట్రోల్‌, గ్యాస్‌, వంట చెరుకు ద్వారా థర్మల్‌ విద్యుత్‌, నీటి ద్వారా జల విద్యుత్‌ ఉత్పత్తి చేశాడు. మొదట సమతుల్య విధానంలో ఇంధన వనరులను ఉపయోగించిన సందర్భంలో ప్రకృతి సమతూకంగా వుండి అంతత ఆహ్లాదం వెల్లివిరిసేది. అయితే జనాభా పెరగడం వల్ల సంప్రదాయ ఇంధన వనరులు సరిపోకపోవడంతో సంప్రదాయేతర ఇం ధన వనరులు ఉపయోగించడంపై దృష్టి పెట్టాడు. ఇది కుదా ఒక నియంత్రణ లేకుండా సాగుతుండటం వలన ఆ ప్రభావం ప్రకృతి సమతుల్యత పై పడి వాతావరణంలో పలు దుస్పరిణామాలు ప్రారంభం అయ్యాయి.సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని తద్వారా  పవన విద్యుత్తును, సౌర విద్యుత్తు ఉత్పత్తిని కనుగొని తన జీవితాన్ని మరింత సుఖమయం చేసుకున్నాడు.
అయితే నేటికీ ప్రపంచవ్యాప్తంగా 13 శాతం జనాభాకు విద్యుత్‌ సరఫరా అందుబాటులో లేదు. మన దేశంలో కూడా నేటికీ కొన్ని గ్రామాలకు విద్యు త్తు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో శక్తి వనరుల ప్రాముఖ్యాన్ని, వాటిని సక్రమమైన పద్ధతిలో వాడే విధానాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి పారిశ్రామిక ఉత్పత్తికి, గృహ అవసరాలకు కూడా విద్యుత్‌ శక్తి అవసరం ఎంతో వుందన్న  అనే విషయాన్ని మరువరాదు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ బైకులు, కుక్కర్ల వాడకం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శక్తిని వృథా చేయకుండా అందరూ శ్రద్ధ వహించాలి.
శక్తిని ఉత్పత్తి చేయడం ఎంత కష్టమో , దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని అందరూ గుర్తెరగాలి. లేకపోతే భవిష్యత్తులో అంధకారమయం అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి.అవసరం మేరకే ఫ్యాన్లు, లైట్లు వంటి గృహోపకరణాలను వినియోగించాలి. ఎల్‌ఈడీ బల్బులు వాడి ఎక్కువ విద్యు త్తు వృథా కాకుండా చూడాలి.  ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్‌ శక్తి ని ఉత్పత్తిచేయాలి. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడి వాటి ధరలు అపరిమితంగా పెరుగుతున్నాయి. చమురు ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడం వలన ఆ ప్రభావం నిత్యావసర సరుకులపై పడి ఫలితంగా ధరలు ఇప్పుడు అంతరిక్ష యానం చేస్తూ మానవుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి పర్యావరణ కాలుష్యం ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరించాలి. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ (కాలుష్యం కలిగించని పునరుత్పాదక ఇంధన వనరులతో తయారైన విద్యుత్‌) ఉత్పత్తిని పెంచాలి. అందరికీ (కాలుష్యం కలిగించని పునరుత్పాదక ఇంధన వనరులతో తయారైన విద్యుత్‌ చౌక గా అందించేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలి. విద్యుత్తు సరఫరాలో నష్టాలు రాకుండా ఉండేందుకు సరైన గ్రిడ్‌ను ఏర్పాటుచేయాలి. నవీన ఆవిష్కరణల సాయంతో సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భారీగా విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టాలి.
ప్రపంచ దేశాలపై వాతావరణ మార్పులు స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీంతో పర్యావరణంపై ప్రభావం చూపుతున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆయిల్, గ్యాస్ కంపెనీలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నాయి. దీంతో పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెడుతున్నాయి.
ప్రభుత్వం నిర్దేశిస్తున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి ఆయిల్, గ్యాస్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం భారతదేశం 100 గిగా వాట్ల  వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, 2030 నాటికి దాదాపు దీన్ని 450 గిగా వాట్ల వరకు వరకు పెంచాలని భారత ప్రభుత్వం నిర్దేశించింది.
 
సి హెచ్ ప్రతాప్ 
 

కామెంట్‌లు