నోరు మంచిదైతే;- సి.హెచ్.ప్రతాప్ -సెల్ ; : 95508 51075
 నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నది నానుడి.  ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది. చెడు మాటలు మాట్లాడకు, తధాస్తు దేవతలుంటారన్నది అందుకే. మంగళకరమైన మాట తీరు మానవుడు సంస్కారానికి గీటురాయి. మితంగా, హితంగా మాట్లాడాలి. మానవుడుకి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ. మంచి మాట ద్వారానే లోకాన్ని గెలుచుకోగలం. అప్రియమైన మాటల వలనే మానవ సంబాంధాలు క్షీణిస్తాయి. కుటుంబాలు దూరమౌతాయి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది.
మాట విలువ అమూల్యం అనంతం, చెడిపోవడం, బాగుపడడం రెండూ సంభవం. ఇష్టమైనవాటిని, మనసుకు నచ్చే మాటల్ని వినాలన్నదే మన బలహీనత. విలువైన, మేలు కలిగించే మాట లభించడం బహు కష్టం. హితం కలిగించే మాట మనోహరం కాకపోవచ్చు ,మనోహరమైన మాట హితకరం కాకపోవచ్చు. మానవుడుకి హితం కలిగించేందుకే వేద వాజ్మయం ఆవిర్భావం. అన్ని వేళలా హితాన్ని కోరుతూ, మంచి సూచనలిచ్చే మిత్రుల మాటలు జీవితాన్ని కాంతివంతం చేస్తాయి.
మనసులను ఆహ్లాద పరిచే లేక దుఖభరితం చేసే శక్తివంతమైన ఆయుధం మాట. ఇతరులకు మనం చేయగలిగే ఒకే ఒక సహాయం ముఖం నిండా చిరునవ్వు అనే  ఆభరణాన్ని ధరించి ,వారికి స్వాంతన కలిగించేలా ఒక చల్లని మాట మాట్లాడడం. దీని వలన అందరికి భయాందోళనలు తగ్గి మనస్సులో ఆహ్లాదం కలుగుతుందని శాస్త్ర వాక్యం. అందుకే మధుర భాషణం అనేది మానవులకు వుండాల్సిన సుగుణం అని పెద్దలు చెబుతారు. అవతలి వారు ఎంత ధుమ ధుమలాడుతున్నా, అసహనం తో అరుస్తున్నా,  మాటకు మాట బదులు చెప్పకుండా, చిరునవ్వుతో ఆఖరున ఒక మంచి మాట మాట్లాడి చూడండి.

ఎదుటివాడి మనసును గాయపరచేలా మాట్లాడటం, హింస కిందకే వస్తుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. మనం ఎదుటివారిని పలుకరిస్తే పండు వెనె్నల కురిసినట్లుండాలి. ఎపుడు ఎక్కడ మాట్లాడినా అది ప్రియంగా మాట్లాడాలని భారతం కూడా చెబుతుంది. మాట మనిషి విలువను పెంచుతుంది. మంచిమనిషిగా కీర్తి తెచ్చుకోవాలంటే మంచి మాటే దానికి మార్గగామి.సి హెచ్ ప్రతాప్ 


కామెంట్‌లు