రుక్మిణి ప్రేమలేఖ;-- యామిజాల జగదీశ్
 ప్రేమలేఖలెన్ని రకాలో అయినప్పటికీ 
మొట్టమొదటగా ఓ ప్రేమ లేఖ రాసినది మాత్రం ఓ మహిళ కావడం విశేషం. ఆమె మరెవరో కాదు...రుక్మిణి...కృష్ణపరమాత్మకు ప్రేమలేఖ రాసింది తనను పెళ్ళి చేసుకోమని....
స్త్రీత్వానికి వ్యాకరణం సిగ్గు. కానీ ఆ సిగ్గుని విడిచిపెట్టి ఈ లేఖ రాస్తున్నాను.
 
పురుషులలో ఉత్తముడివైన పురుషోత్తమా!...
నువ్వో సింహానివి...( నరసింహావతారాన్ని ఉద్దేశిస్తూ)!
బంగారం కోసం ఎవరైనా ఇష్టపడొచ్చు. అలాగే నేనూనూ నిన్ను పొందాలని ఇష్టపడుతున్నాను.
నీ వీరత్వం జగమెరిగినది. నాకూ తెలుసు.
నాకూ ఊహ తెలిసినప్పటినుంచీ నిన్నే నేను ప్రేమిస్తున్నాను.
అయినా నిన్ను ఇప్పటివరకూ నేను చూసింది లేదు. నువ్వుగా వచ్చి నన్ను పెళ్ళాడుతావని నిన్నే తలుస్తూ ఎన్నో పూజలు చేస్తున్నాను.
నువ్వో మాయవు. మహామాయవు. ఎక్కడో దాగి ఉండి నన్ను పాలించడానికి ఆలోచిస్తున్నావు కదూ...
ఇప్పుడు నన్ను వేరొకరికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నారు. అందుకు ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఈ స్థితి నిస్సహాయస్థితి. నేనేమీ చేయలేక పోతున్నాను. నువ్వే నా గతివి. అందుకే సిగ్గు విడిచి ఈ లేఖ రాస్తున్నాను.
ఈ ప్రపంచంలో నిన్నెవరూ గెలవలేరు. నువ్వు ఓ గొప్ప యోధుడవు. సౌందర్యవంతుడివి. నీ గొప్పతనాన్ని చెవులారా విన్నాను. 
నా కనులు నీ గాంభీర్యాన్నీ నీ హుందాతనాన్నీ చూడటానికి తహతహలాడుతున్నాయి. 
నీ సద్గుణాలు మనసులోనూ హృదయంలోనూ నిండి ఉన్నాయి. కనుకనే నీన్నే నా భర్తగా చిత్రించుకున్నాను. 
హే ముకుందా! ఓ నాయకా! 
నీ కీర్తికాంతులు, నీ పారంపర్యం, నీ ఆనందమయ గుణం, ప్రపంచమంతా విస్తరించి ఉన్న ప్రజల ఆనందానికి కారణమైన ఓ నాయకా, నువ్వు ప్రేమమూర్తివి! 
నీకు నువ్వే సాటి. నీ వీరత్వం మాటల్లో వర్ణించలేనిది! సహజసిద్ధంగానే నువ్వు దయాస్వరూపుడవు!  
నీ మోహనరూపాన్నెలా పొగడటం... భువనమోహడవు...నీ గురించి ఇన్నింటినీ విన్న ఏ స్త్రీ అయినా నిన్నే తన భర్తగా ఊహించుకోదా?! 
అందుకే కృష్ణా! వటపత్రసాయీ ! నిన్నే నా భర్తగా నిశ్చయించుకున్నాను. వరిస్తే నిన్నే వరించాలనుకున్నాను. 
కనుక ఓ మాధవా! నక్క గుణాలున్న శిశుపాలుడు నా చేయి పట్టుకోకముందే నువ్వు నన్ను వరించి, రక్షించు.
పురుషోత్తమా! నేనిప్పటివరకూ చేపట్టిన వ్రతాలూ, పేదలకు చేసిన సాయాలూ, సాధువులను ప్రార్థించడాలూ, వారిని స్తుతించడాలూ, ప్రజలకు చేసిన సేవాకార్యాలూ, గ్రామ దేవతలు, ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడికీ భక్తితో చేసిన ఆరాధనా వమ్ముకాకూడదంటే నువ్వొచ్చి నన్ను వరించాల్సిందే!
ఎవరూ నిన్ను గెలవలేరు గోవిందా!
నేను కోరేదిదే! పెళ్ళికి ఒకరోజు ముందరే రహస్యంగా వచ్చి రాజులందరినీ గెలిచి నన్ను నువ్వు వరించాలి.
స్త్రీలనూ పిల్లలనూ కష్టపెట్టక యుద్ధం చేయాలని నువ్వనుకుంటే నేను నీకొక మార్గం చెప్తాను. 
మా పెళ్ళితంతులో భాగంగా భారీ స్థాయిలో ఓ జాతర జరుగుతుంది. మా ఆచారాన్నిబట్టి పెళ్ళికూతురితో శ్రీ గౌరి (గిరిజా దేవి) పూజ చేయించడానికి ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ సమయంలోనే నువ్వు నన్ను వరించాలి.
కృష్ణా! నీకు శరణు శరణు. ఈ జన్మలో నీ పాదధూళిని స్పర్శించే భాగ్యం లభించకుంటే నేనీ తనువు చాలిస్తాను. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ నిన్ను పొందేవరకూ తపస్సు చేస్తూనే ఉంటాను. కానీ ఆ అవసరం రానివ్వక ఇప్పుడే ఈ జన్మలోనే నువ్వు నన్ను వరించాలి. నన్నాదుకోవాలి....
ఇట్టా సాగిన రుక్మిణి ఉత్తరాన్ని చదివి కృష్ణుడి కళ్ళు చెమ్మగిల్లాయి.
"నిన్ను పొందాలన్నదే నా ఆశ. నువ్వే నాకు రక్ష" అన్న మాటలు చెప్పడమే ఆలస్యం...తక్షణమే కృష్ణుడు తరలివెళ్ళి రుక్మిణిని వరించాడు.


కామెంట్‌లు