విజ్ఞత ; - లత శ్రీ
 స్కూల్ కి వెళ్ళిన అన్విత అరగంటలోపే అమ్మమ్మ! అమ్మమ్మ! అంటూ రొప్పుతూ వస్తుంది.
వంటింట్లో నుండి పరుగున వచ్చిన సరస్వతమ్మ ఎదురెళ్లి అక్కున చేర్చుకుంది కంటినీరు తుడిచింది లాలనగా తల నిమురుతూ సంబాళించింది చేరుకున్న అన్విత అమ్మమ్మ నీకు ఇది తెలుసా నా స్నేహితురాలు అశ్విని చనిపోయింది .ఎవరో తనని చంపేశారు అంట అంటూ మళ్ళీ వెక్కడం మొదలుపెట్టింది.
ఉలిక్కి పడిన సరస్వతమ్మ అన్వితను మరింత దగ్గరకు పొదువుకుంది. డ్యూటీకి వెళ్ళిన కూతురు తిరిగి వస్తుండడం చూసిన సరస్వతమ్మ ఏమైంది సరోజిని మన పక్క వీధిలోని అశ్విని గురించి ఏదో చెబుతోంది పాప నిజమేనా అంది.
అవునమ్మా అశ్విని పక్కింట్లో ఉన్న చంద్ర అంకులే ఇలా చేశాడని చెప్తున్నారు ఇప్పుడే పోలీసులు అతనిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.
అవునా అంటూ నోరెళ్ల పెట్టింది సరస్వతమ్మ. ఎంత అమాయకంగా ఉండేవాడు ఎన్ని నీతి మాటలు చెప్పేవాడు తనా ఇలా చేసింది అన్నది.
అయినా ఈ కాలం ఆడపిల్ల ఎంత తెలివిగా ఉండాలి ఏది మంచో ఏది చెడో తల్లులు చెప్పాలి అయినా ఆ తల్లులకు చెప్పే సమయం ఎక్కడుంది ఉద్యోగం సంపాదన అంటూ పరుగులు పెడుతూ బిడ్డల్ని వారి బాగోగుల్ని పట్టించుకోకుండా మేమే అంతా చేస్తున్నాం అంటుంటారు .చిన్నప్పుడు మా అమ్మ చెప్పే చిలకమ్మ పెంపకం కథలోలా ఉంటది అన్నది బాధగా...
అదేంటమ్మా అలా అంటావు అశ్విని అంటే రాగిణికి పంచప్రాణాలు మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు రాగిణి ఆశా శ్వాస తనే ఎన్ని త్యాగాలు చేసింది. ఎంత ఉరుకులు పరుగులతో అందరినీ చూస్తూ ఉద్యోగం చేస్తుంది ఎప్పుడైనా సరదాగా సినిమాకు వెళ్దాం అన్నా ఇంట్లో పిల్ల ఒక్కతే ఉంటదని ఇంటికి పరుగున వెళ్ళేది . ఒక్కగానొక్క బిడ్డ అని కళ్ళలో పెట్టుకుని చూసుకుంది.ఎప్పుడు ఇంట్లోనే ఉంచేది బయట అడుగు పెట్టనిచ్చేదే కాదు మరి మంచి చెడు నేర్పకుండా ఉంటదా.. ఆ నంగనాచి వెధవ నీతి మాటలు చెప్తూ పిల్లను చేరదీస్తుంటే సంతోషించింది. అశ్విని తాతయ్య అనే పిలిస్తే తన మనవరాలు అనిపిస్తుంది అంటూ ప్రేమ చూపితే తన తండ్రిలా భావించి తనకూ సపర్యలు చేసింది గుంటనక్కలా ఇంత పని చేస్తాడని ఎలా ఊహించగలం.
గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా పిల్లలకు పాఠాల్లో చెప్పడం సంతోషంగా ఉందని దానివల్ల పిల్లలకు మంచి చెడు తెలుస్తాయని నిన్న సాయంత్రం వస్తూ మాట్లాడుకుంన్నాం. ఇంతలో ఇదంతా జరిగింది. వీరి మాటలు వింటున్న అన్విత అమ్మమ్మ చిలకమ్మ పెంపకం అన్నావు అంటే ఏమిటి అమ్మమ్మ అంది అదా ఒక కోనలో చిలకమ్మకు ముగ్గురు పిల్లలు కలిగారు పిల్లలపై అవాజ్యమైన ప్రేమ ఉన్న చిలుక వారికి ఎటువంటి ఆపద రాకూడదని బయటకు వెళ్ళనివ్వకుండా తనే ఆహారం తెచ్చి పెట్టేది పైగా పిల్లలకు 
వేటగాడు వస్తున్నాడు వస్తున్నాడు గింజలు ఎరగా వేస్తున్నాడు
 మెడలు విరి చేస్తాడు విరి చేస్తాడు
 అనే మూడు వాక్యాలు నేర్పించింది ఇంకేం భయం లేదంటూ తన బిడ్డలు జాగ్రత్తగా ఉంటారని స్వేచ్ఛగా ఆహారాన్వేషణకు వెళ్ళింది. వేటగాడు రానే వచ్చాడు వేటగాడు వచ్చాడు వచ్చాడు అని అరిచాయి ప్రమాదం అని గ్రహించిన వేటగాడు చెట్టు చాటుకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత ధైర్యం చేసి గింజలు విసిరాడు వేటగాడు గింజలు వేస్తున్నాడు వేస్తున్నాడు అంటూనే గింజలకై కిందకు వాలాయి చిలుకలు వేటగాడు మెడలు విరిచేస్తాడు అంటూనే అతని చేత మెడలు విరిచబడి మరణించాయి అని చెప్పుకొచ్చింది అయ్యో పాపం అంది అన్విత.
 నా బిడ్డను అలా ఏం పెంచలేదు అంది సరోజ రోషంగా
 అయ్యో !నా బంగారు తల్లి నిన్ను అనలేదే.. ఏదేమైనా ఈ కాలం తల్లులు అతి ప్రేమతో అద్దాలమేడలో ఉంచి పిల్లలను సమాజానికి దూరంగా పెంచుతున్నారు .సమాజంలోని చెడులను చెబుతున్నారు. అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్తున్నారు. కానీ పిల్లలకు విషయ జ్ఞానం ఉపయోగించే విజ్ఞత నేర్చుకొనివ్వడం లేదు.ఒక ప్రేమ పాశం ఉచ్చులో బలి చేస్తున్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే చెప్పడం కాదు సరోజ అలాంటిది ఎదురైనప్పుడు ఎదుర్కొనే స్థైర్యాన్ని నేర్పును నేర్పాలి అంటున్నాను ఎవరిని గుడ్డిగా నమ్మి అమ్మాయిలు బలి అవ్వకూడదని నా ఆలోచన అంది .అమ్మను అబ్బురంగా చూస్తున్న సరోజ చప్పట్ల శబ్దంతో చుట్టూ చూసింది అన్విత నాన్న రావడంతో నాన్న అంటూ పరుగెట్టి నాన్నను చుట్టుకుంది. అందుకే పెద్దవారి మాట పెరుగన్నం వంటిదని అంటారు అన్నాడుఅన్వేష్...
సమాప్తం

కామెంట్‌లు