బాలసాహిత్యంతోనే మనోవికాసం:- జాతీయ వెబినార్ లో డా.పత్తిపాక, చొక్కాపు, దాసరి
 

ఘనంగా ప్రారంభమైన రెండురోజుల అంతర్జాల సదస్సు
శ్రీశ్రీ కళావేదిక, నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణ
ఎస్కేయూ/అనంతపురము, ; -పిల్లలకు ఆనందం, ఆలోచన, వినోదం, విజ్ఞానం ద్వారా మానసిక వికాసం కలిగించడమే బాలసాహిత్య పరమావధి అని ప్రముఖ బాలసాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ అన్నారు. 
శ్రీశ్రీ కళావేదిక, నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో గురువారం బాల సాహిత్యంపై జాతీయ వెబినార్ ఘనంగా ప్రారంభమైంది. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ ప్రారంభ సందేశం పంపారు. రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షులు పి. విజయబాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి శుభాకాంక్షల సందేశం పంపారు. ప్రముఖ బాలసాహితీవేత్త, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డా. పత్తిపాక మోహన్ కీలకోపన్యాసం చేశారు. విశిష్ట అతిథులుగా కేంద్రసాహిత్య  అకాడమీ అవార్డు గ్రహీతలు చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, కేంద్ర ప్రభుత్వ "రాజ్యమహిళా సమ్మాన్" అవార్డు గ్రహీత నల్లాని రాజేశ్వరి, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎస్కేయూ శాఖ గౌరవాధ్యక్షులు డా. పతికి రమేష్ నారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. "బాల సాహిత్యం - భవిష్యత్తు - చర్చ" అనే అంశంపై రెండు రోజులపాటు జరిగే అంతర్జాల సదస్సులో 40 మంది పరిశోధకులు పత్రసమర్పణ చేస్తారని సదస్సు సంచాలకులు, శ్రీశ్రీ కళావేదిక ఎస్కేయూ శాఖ అధ్యక్షుడు డా. బత్తల అశోక్ కుమార్  వివరించారు. 
ఈ సందర్భంగా డా. పత్తిపాక మోహన్ మాట్లాడుతూ, ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో కూడా పిల్లల్లో పఠన సంస్కృతి తగ్గలేదన్నారు. గత దశాబ్ధ కాలంగా పిల్లల కోసం పుస్తకాలు విరివిగా వస్తున్నాయన్నారు. పిల్లలు లేని ప్రపంచాన్ని, వాళ్లకు పుస్తకాలు అందని లోకాన్ని ఊహించలేమన్నారు. పిల్లల  శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రులు, పౌరసమాజం సమిష్టి బాధ్యత వహించాలన్నారు. బాలల ఆకాంక్షలకు అనుగుణంగా, సమస్యలకు సమాధానంగా వున్న సాహిత్యమే పిల్లలకు నచ్చుతుందన్నారు. పోతన, సూరదాసు, పాల్కురికి సోమన, అమిర్ ఖుస్రోలను చదివి పాతతరంలో తమ వ్యక్తిత్వాలని తీర్చిదిద్దుకున్నారని చెప్పారు. భారతం, భాగవతం, రామాయణం, బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాల్లోని కథలు కూడా తోడ్పడ్డాయన్నారు. ప్రపంచంలో ఏ తరంలోనైనా బాల్యాన్ని తీర్చిదిద్దేది సాహిత్యమే నన్నారు. బాలల గ్రంథాలయాలను విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో వుందన్నారు. పుస్తక ప్రచురణలో, కథావస్తువు ఎంపికలో మరింత ఆధునికత సంతరించుకోవాలన్నారు. పిల్లలకు ఛోటా భీమ్, లిటిల్ గణేష లాగా మన కథలను యానిమేషన్, డిజిటల్ రూపంలో అందిస్తే బాల సాహిత్యం భవిష్యత్తులో మరింత వికసిస్తుందన్నారు.
విశిష్ట అతిథి  చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ, ప్రముఖ వ్యక్తుల రచనలు, వ్యాఖ్యలతో బాల సాహిత్యం రావాలన్నారు. ఆధునిక పద్ధతుల్లో పుస్తక ముద్రణ జరగాలని, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బృందంగా ముందుకు తీసుకుపోవాలన్నారు. కథల అనువాదం, పునర్ వ్యక్తిీకరణ, విద్యా విలువలతో కూడిన రచనలు, అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. పిల్లల్లో సృజనాత్మకత పెంపుదల కోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ నివ్వాలన్నారు.
విశిష్ట అతిథి  దాసరి వెంకటరమణ మాట్లాడుతూ, బాల సాహిత్యం మనుగడ తోనే భవిష్యత్తులో మెరుగైన పౌర సమాజం సాధ్యపడుతుందన్నారు. తల్లిమనసే మొదటి బాలసాహిత్య సృష్టికర్త అని చెప్పారు. పూర్వీకుల నాలుకలపై నడయాడిన బాలసాహిత్యం నేడు విస్తృతంగా అభివృద్ధి చెందిందన్నారు. జన వినోదిని పత్రిక బాలసాహిత్యాన్ని మొట్ట మొదటిసారిగా ప్రచురించిందన్నారు. దాదాపు 157 పిల్లల పత్రికలొచ్చాయన్నారు. బాల అనే పత్రిక పిల్లలనే రచయితలుగా తీర్చిదిద్దిందన్నారు. బాలసాహిత్యాన్ని మలుపుతిప్పిన పత్రిక "చందమామ" అని వివరించారు. బాలసాహిత్య పరిషత్ వంటి సంస్థలు విశేష సేవలందిస్తున్నా యన్నారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో జరిగితేనే బలమైన పునాది వుంటుందన్నారు. కథలను పిల్లలు వినడం, ఇతరులకు చెప్పడం, చదవడం, సొంతంగా రాయడం ద్వారా మానసిక వికాసం కలుగుతుందన్నారు. 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరి భూషణం, కార్యదర్శి రిషి తణుకు, సహాయ కార్యదర్శి మామిడాల శశిరేఖ, ఎస్కేయూ శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
నేడే ముగింపు సభ :
జాతీయ వెబినార్ ముగింపు సభ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు అధ్యక్షతన  ప్రారంభమవుతుందని డా. బత్తల అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్య అతిథులుగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, ఎ.పి. గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, విశిష్ట అతిథులుగా ఏ.పి. నాటక అకాడమీ ఛైర్ పర్సన్ చామలూరు రాగే హరిత రాజగోపాల్, ఎస్కేయూ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొ.జి. బాలసుబ్రమణ్యం, పరీక్షల విభాగ డీన్ ప్రొ. జి.వి. రమణ, బాల సాహిత్య పరిషత్ కోశాధికారి పైడిమర్రి రామకృష్ణ, ప్రముఖ సాహితీవేత్త డా. వి.ఆర్. రాసాని, రచయిత్రి, కాలమిస్ట్ నల్లాని రాజేశ్వరి హాజరవుతారని చెప్పారు. గౌరవ అతిథులుగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత, జాతీయ ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరి భూషణం, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎస్కేయూ శాఖ గౌరవాధ్యక్షులు డాక్టర్ పతికి రమేష్ నారాయణ, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ బాలసాహితీవేత్త చొప్పా వీరభద్రప్ప, సాహిత్య భారతి వ్యవస్థాపక అధ్యక్షులు గుంటి మురళీకృష్ణ భరద్వాజ్, అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, "భూమిపుత్ర" దినపత్రిక సంపాదకులు సాకే శ్రీహరిమూర్తి, బి.సి.ఆర్.పి.ఎస్. రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది సాకే నరేష్, ప్రత్యేక అతిథులుగా శ్రీశ్రీ కళావేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయులు సురేంద్ర రొడ్డ, యువ సాహితీవేత్త, పరిశోధకులు, ఉపాధ్యాయులు ఆవుల చక్రపాణి యాదవ్, తిరుపతి బాలోత్సవ్ అధ్యక్షులు నడ్డి నారాయణ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

కామెంట్‌లు