అమ్మాయి మనసు;-- యామిజాల జగదీశ్
 ఓ పోస్ట్ మాన్ "సార్ పోస్ట్" అని 
ఓ ఇంటి తలుపు తట్టాడు.


"ఇదిగో వస్తున్నా" అంటూ లోపలి నుంచి చిన్నమ్మాయి ఓ గొంతు వినిపించింది.కానీ ఆ వ్యక్తి వాకిట్లోకి రాలేదు.


నాలుగైదు నిముషాలు గడిచాయి.


లోపలి వ్యక్తి బయటకు రాకపోయేసరికి ఓపిక నశించిన పోస్ట్ మ్యాన్ కోపంతో "త్వరగా వచ్చి ఉత్తరం తీసుకోండి" అన్నాడు.


మళ్ళీ చిన్నమ్మాయి గొంతు, "అయ్యా, ఉత్తరాన్ని తలుపు దగ్గర ఉంచండి... వస్తున్నా" అన్నది.పోస్ట్ మ్యాన్ "ఈ పోస్టు తలుపు దగ్గర పెట్టేసి వెళ్ళిపోయే ఉత్తరం కాదండీ...ఇది రిజిస్టర్ పోస్ట్. మీ సంతకం అవసరం. వచ్చి సంతకం పెట్టి తీసుకోండి" అన్నాడు పోస్ట్ మ్యాన్.


పది నిముషాల తర్వాత తలుపు తెరచు కోవడంతో విసిగెత్తి కసురుకుందా మనుకున్న ఆ పోస్ట్ మ్యాన్ నోరెత్తలేదు. కంగుతిన్నాడు.


ఉత్తరాన్ని తీసుకోవడానికి ఓ కాలు లేని చిన్నమ్మాయి అతని ముందు ప్రత్యక్షమైంది.


పోస్ట్ మ్యాన్ ఉత్తరాన్ని ఆ అమ్మాయికి ఉత్తరాన్నిచ్చి బరువెక్కిన మనసుతో వెనుతిరిగాడు.


ఆ తర్వాత మూడు నాలుగుసార్లు అతను ఆ ఇంటికి పోస్ట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది.


పోస్ట్ మ్యాన్ ఆ ఇంటికి ఉత్తరం ఇవ్వడానికి వచ్చినప్పుడల్లా తలుపు తట్టి అవి తెరిచేవరకూ శాంతంగా నిరీక్షించడం అలవాటు చేసుకున్నాడు.


పోస్ట్ మ్యాన్ చెప్పులేసుకోకుండా వొట్టి కాళ్ళతో రావడాన్ని ఆ చిన్నమ్మాయి గమనించింది.


ఓమారు పోస్ట్ మ్యాన్ ఓ ఉత్తరం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ చిన్నమ్మాయి మాటలు కలిపి తన దగ్గరున్న టేపుతో అతని పాదాల కొలత తీసింది. ఓ మూడు రోజుల తర్వాత అతనిని రమ్మంది. కానీ అతను ఓ వారం తర్వాత ఆ చిన్న మ్మాయిని చూడటంకోసం వచ్చాడు. అప్పుడా చిన్నమ్మాయి అతనికో ప్యాకెట్ ఇస్తూ ఇది మీకు నా కానుక అంకుల్ అంది అతనితో.


పోస్ట మ్యాన్ "ఏమిటమ్మా ఇది? నువ్వు నాకు కూతురులాంటి దానివి. నువ్వు నాకు కానుక ఇవ్వడమేమిటీ? నేనే నీకివ్వాలమ్మా" అన్నాడు.


కానీ చిన్నమ్మాయి ఊరుకోలేదు. 
ఒత్తిడి చేసింది. తను ఇవ్వాలనుకున్న కానుక ఇచ్చింది.


పోస్ట్ మ్యాన్ ఇంటికి వెళ్ళి ఆ ప్యాకెట్ విప్పి చూశాడు. ఆశ్చర్యపోయాడు. కారణం, 
అందులో ఓ చెప్పుల జత ఉంది.అతని కళ్ళు చెమ్మగిల్లాయి.


ఎందుకంటే అతని వొట్టి కాళ్ళతో వస్తుండటాన్ని ఎవరూ గమనించలేదు.  కానీ ఈ చిన్నమ్మాయి ఆ విషయాన్ని గమనించి తనకీ చెప్పుల జత ఇవ్వడం విచిత్రంగా ఉందే అనుకున్నాడు.


మరుసటి రోజు అతను తను పని చేసే పోస్టాఫీసుకు వెళ్ళీ వెళ్ళడంతోనే తనను మరొక చోటుకి మార్చమని పోస్ట్ మాస్టరుని  బతిమాలాడు.


పోస్ట్ మాస్టర్ కారణం అడిగాడు.


ఆప్పుడా పోస్ట్ మ్యాన్ కన్నీళ్ళు పెట్టుకుం టూ చెప్పాడిలా...


"అయ్యా, ఈరోజు నుంచి నేనా వీధికి వెళ్ళలేను... నా కాళ్ళకు చెప్పలు లేకపోవడాన్ని గమనించిన ఆ చిన్నమ్మాయి నాకు కొత్త చెప్పులు కానుకగా ఇచ్చింది. అయితే ఓ కాలు లేని ఆ పిల్లకు నేనెలా కాలు ఇవ్వగలను చెప్పండి" అన్నాడు.


ఇతరుల కష్టం, బాధ తెలిసినప్పుడు వాటిని పంచుకునే మనసు ఎంతో గొప్పదనడానికి ఆ చిన్నమ్మాయి వైఖరి ఓ మంచి ఉదాహరణ.కామెంట్‌లు