పింగాణి కథ;- రచన :- డా. రావూరి భరద్వాజ. ;-- సమీక్ష :- డా. కందేపి రాణీప్రసాద్.

 భారత దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠాన్ని దక్కించుకున్న తెలుగువారిలో డా. రావూరి భరద్వాజ ఒకరు. వీరు నవలా రచయితగా ఎక్కువ ప్రాచుర్యం పొందినప్పటికీ బాలల సాహిత్యాన్ని వారు ఎక్కువగా సృష్టించారు. అందులోనూ బాలలకు విజ్ఞాన సాహిత్యాన్ని చాల సులభతరంగా చక్కగా అర్థమయేలా రచించారు. నీటి కథ, గాలి కథ, అద్దం కథ, రంగుల కథ, గడియారం కథ, పింగాణి కథ, మనిషి కథ, నిప్పు కథ, బొగ్గు కథ, రబ్బరు కథ, గ్రహాల గాధలు, నక్షత్రాల చిత్రాలు అనే పేర్లతో దాదాపు ముప్పై పుస్తకాలను పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 1950, 1960 ల మధ్యలో ఈ పుస్తకాలు రచింపబడ్డాయి. విజ్ఞాన విషయాలను తెలుసుకునేందుకు ఏ రకమైన వనరులు అందుబాటులో లేనప్పటికీ భరద్వాజ గారు శాస్త్రీయ విజ్ఞానాన్ని పిల్లల కోసమై సరళమైన భాషలో అలతి అలతి పదాలతో రచించారు. వీటిలో ఈ రోజు ‘ పింగాణి కథ’ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం.
‘ పింగాణి కథ ‘ అనే ఈ చిన్న నవలికను డా.రావూరి భరద్వాజ గారు 1961 వ సంవత్సరంలో రచించారు. ఇది నలబై ఐదు పేజీల చిన్న గ్రంధం. పింగాణి ని తొలిసారిగా ఎవరు కనిపెట్టారు? పింగాణితో ఏయే వస్తువులు తయారు చేస్తారు? పింగాణిని తయారుచేయడానికి కావలసిన మట్టి ఏమిటి? అది ఎక్కడ దొరుకుతుంది? వంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం చదవటం ద్వారా పింగాణి తయారు కావటానికి కావలసిన మట్టి మన రాష్ట్రంలో సమృద్ధిగా ఉందనీ, ఆంధ్రప్రదేశ్ లోని గూడూరు దగ్గర ఒక పింగాణి ఫ్యాక్టరీ నడుస్తోందని తెలిపారు. మందులను నూరడానికి, ద్రావకాలను నిలవ చేయడానికి పింగాణి పాత్రలు అనుకూలంగా ఉంటాయి. పింగాణి తయారికి తెల్లని మట్టి, స్వచ్చమైన ఇసుక, అబ్రకం కావాలి. మొట్ట మొదటిసారిగా పింగాణిని చైనా దేశీయులు కనిపెట్టారని, మింగ్ చక్రవర్తులు ‘చీనా’ ను పరిపాలించే కాలంలో పింగాణి పరిశ్రమ మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లిందని రాశారు. ఇందులో కేవలం పింగాణి పరిశ్రమ గురించే కాక చైనా సాహిత్యం లోని అనేక కథలను సైతం పరిచయం చేశారు.
“ వెన్నెల నిలుచుండి వేపాకు బడవేసి
   అడ్డ సరపు రసము నందు బోసి
   కరగ రాగియు మరి కాంచనంబౌనయా
   విశ్వదాభి రామ వినురవేమ “ అనే వేమన పద్యాన్ని బట్టి పూర్వం బంగారాన్ని తయారు చేసే రసవాదం ఎంత మందిని ఆకర్శించిందో మరియు యూరప్ దేశాలలో ఈ రసవాదం అన్ని కల్లోలాలు రేపిందో ఈ పుస్తకం వల్ల తెలుసుకోవచ్చు. యూరప్ లోని జర్మనీ లో 1685లో పుట్టిన ‘ బోట్గేర్ ‘ అనే శాస్త్రవేత్త బంగారాన్ని తయారు చేయబోయి పింగాణిని కనిపెట్టాడు. దానికి అతడు పడిన సాధక బాధకాలు, కష్ట నష్టాలను విపులంగా చర్చించారి పుస్తకంలో. కరెంటు తీగలకు పింగాణి గుబ్బలను ఎందుకు అమరుస్తారో స్పష్టంగా వివరించారు. ఆవకాయను ఏడాది పొడవునా భద్రంగా నిల్వ చేసుకునే పింగాణి జాడీ యొక్క పుట్టుకను ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలూ చదవండి.
కామెంట్‌లు