మీ జీవితం నిండైనదా?;-- జగదీశ్ యామిజాల
 నిండైన జీవితాన్ని జీవించాలన్నదే మనందరి ఆశ. కానీ అదెలాగన్నదే మనకు తెలీడం లేదు. జీవితంలో కలిపేందుకు అను భవించేందుకు అనేక విషయాలున్నాయి. కానీ అవన్నీ ఈ చిన్న జీవితంలో సాధ్యమేనా? ఒక్క రోజులో ఉండేవి ఇరవై నాలుగు గంటలే. మనకుండే శక్తి ఓ పరిధిలోనే కదా! అటువంటప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న తలెత్తవచ్చు. అలా గందరగోళంలో ఉన్న విద్యార్థులను మాష్టారు ఓ ఉదాహరణతో ఈ కథ చెప్పారు.
మాష్టారు ముందుగా ఓ పెద్ద సీసా తీసుకొచ్చి బల్ల మీద ఉంచారు. అందులో టెన్నిస్ బంతులను వేసి విద్యార్థులను అడిగారు...
“ సీసా నిండుగా ఉందా?" అని.
విద్యార్థులు అవునన్నారు.
అనంతరం మాష్టారు చిన్న చిన్న రాళ్ళను సీసాలో వేసారు. సీసాను అటు ఇటూ కదల్చారు. అప్పుడు రాళ్ళు టెన్నిస్ బంతులకు మధ్య ఖాళీను ఆక్రమించాయి. 
ఇప్పుడు సీసా నిండుగా ఉందా అని అడిగారు మాష్టారు మళ్ళీ.
విద్యార్థులు అవునన్నారు.
మాష్టారు ఓ డబ్బాలో ఉన్న ఇసుకను తీసి ఆ సీసాలో పోశారు. మళ్ళీ సీసాను కుదపగా ఆ ఇసుకరేణువులు లోపల అక్కడక్కడా ఖాళీగా ఉన్న జాగాను ఆక్రమించాయి.
ఇప్పుడు సీసా నిండుగా ఉందా అని మాష్టారు అడిగారు. 
 
అవునన్నారు విద్యార్థులు మళ్ళీ.
చివరికి ఓ కప్పు కాఫీ సీసాలో పోసారు. కాఫీ సీసా అడుగుకు పోయింది.
విద్యార్థులకు ఒకటే నవ్వు. 
 
అప్పుడు మాష్టారు " విద్యార్థులారా! మీ నవ్వు నాకు అర్థమైంది. కానీ చెప్పబోయేది శ్రద్ధగా వినండి. ఈ సీసా మీ జీవితంలాటిది. 
టెన్నిస్ బంతులు మీ జీవితంలోని  ముఖ్యమైన విషయాలలాంటివి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, మిత్రులు, ఆరోగ్యం, మీకిష్టమైనటువంటి అర్థవంతమైన విషయాలను ఈ వరుసలో చేర్చుకోవచ్చు.
మొదటగా ఇటువంటి విషయాలకు మీ జీవితంలో చోటివ్వండి. మరేవీ లేకున్నా మీ జీవితంలో వీటికి ప్రాధాన్యం ఇస్తే ఆ జీవితం నిండుగానే అన్పిస్తుంది. ఆ తర్వాత సొంత ఇల్లు, వాహనం, ఇతర వస్తువులు, వసతులు వంటివి చిన్న చిన్న రాళ్ళలాంటివి. వీటన్నింటినీ రెండవదిగా జీవితంలో కలుపుకోండి. ఇక మిగిలినవన్నీ ఇసుకరేణువులలాగా. వాటిని జీవితంలో చివరగా కలుపుకోండి. అదీనూ వీలుంటేనే. అలా కానప్పుడు అవి లేకున్నా జీవితం నిండుగానే ఉంటుంది. నష్టమేమీ లేదు.
అయితే మాష్టారు కాఫీ గురించి చెప్పకపోవడంతో ఓ విద్యార్థి దాని గురించి అడిగాడు.
మాష్టారు నవ్వుతూ "ఎంతైనా జీవితం మరివేటికీ చోటివ్వక నిండుగా ఉన్నా మిత్రులతో కలిసి కాఫీ తాగుతూ కాస్సేపు మాట్లాడి గడపడానికి కచ్చితంగా చోటుంటుంది. దానినే కాఫీ సూచి స్తుంద"న్నారు. 
జీవితంలో మొదటగా అతి ముఖ్యమైన విషయాలకు మన సమయాన్నీ, దృష్టినీ చోటివ్వడం తప్పనిసరి. 
అలాకాకుండా ముఖ్యమైనవాటిని పక్కన పెట్టి తక్కువ వాటికో అసలు ప్రాధాన్యమే లేని వాటికీ సమయాన్ని కేటాయించి దృష్టిని మళ్ళిస్తే అప్పుడు అతి ముఖ్యమొనవాటికి జీవితంలో చోటు లేకుండా పోతుంది. అంతేకాదు, జీవితం నిండుగానూ అన్పించుకోదు. ఈ సీసాను మొదట్లోనే చిన్న చిన్న రాళ్ళు, ఇసుక రేణువులతో నింపితే టెన్నిస్ బంతులను లోపల వేయలేము. టెన్నిస్ బంతులు, చిన్న రాళ్ళు, ఇసుక వంటివన్నీ ఆ సీసాలో వాటివాటి మోతాదులో ఉండాలంటే ఆ వరుసక్రమంలో వేస్తేనే అది సాధ్యమవుతుంది.
ఇలాగే మన జీవితంలోనూ ఆయా వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. వేటికైనా ఎటువంటి ప్రాధాన్యం ఇస్తున్నాం అనేది ముఖ్యం. ఆ ప్రజ్ఞ ప్రతి మనిషికీ ఉండాలి. ఆరోగ్యానికి అవసరమైన శారీరక వ్యాయామం, నడక,.చదవవలసిన సమయంలో చదవడం, టీవీ చూడవలసిన సమయంలో చూడటం వంటివి ముఖ్యం. అంతేతప్ప ఇతరుల గురించి గంటలకొద్దీ మాట్లాడుతూ కాలాన్ని వృధా చేస్తూ పోతే జీవితం ఎందుకూ పనికిరానిదైపోతుంది. అది సీసాను టెన్నిస్ బంతులుకాకుండా ఇసుకతో నింపడానికి సమానం. కుటుంబానికి కేటాయించవలసిన సమయంలోనూ ఇతర పనులకు కాలాన్ని కేటాయించడం అనేది సీసాను టెన్నిస్ బంతులతో కాకుండా చిన్న చిన్న రాళ్ళతో నింపడానికి సమానమవుతుంది.
 
ప్రతి క్షణమూ జీవితాన్ని నింపుతూనే ఉంటాం. కానీ ఏ విషయాలతో నింపుకుంటూ పోతున్నామనేది ముఖ్యం. ఈ విషయంలో తగిన స్పృహ ఉండాలి. లేకుంటే జీవితం వ్యర్థమే.

కామెంట్‌లు