తీరిక సమయాల్లో (కథ) -సరికొండ శ్రీనివాసరాజు

 శ్రావణి: ఒరేయ్ రాజు! అస్తమానం ఆ సెల్ ఫోనుతో కాలక్షేపం ఏమిటిరా? ఎండాకాలం అందరం అమ్మమ్మ ఇంటికి వచ్చాము. కలిసి ఆడుకుందాం రా! 
రాజు: ఏం ఆటలు అక్కా! నా వల్ల కాదు. అంత ఓపిక లేదు. సెల్ ఫోనులో ఎన్ని ఫీచర్లో! బోలెడంత వినోదం. 
శ్రావణి: సోమరిగా తయారు కావడమే కాక లేని పోని జబ్బులు వస్తాయి. మన భవిష్యత్తుకు శాపం. 
అవని: అక్కా అక్కా! తమ్ముడు చూడు. రిమోట్ ఇవ్వడం లేదు. టి.వి. మొత్తం వాడే చూస్తున్నాడు.
శ్రావణి: ఒరేయ్ పండు! మనమంతా ఇక్కడ చేరింది ఈ వేసవి సెలవులను కరవు తీరా ఆటలతో గడపడానికిరా!
(అందరూ ఆరోజు కరవు తీరా ఆటలు ఆడి వచ్చారు.)
శ్రావణి: అమ్మమ్మా! కథలు చెప్పవా!
అమ్మమ్మ! నాకు తీరిక లేదే! రామకోటి రాసుకుంటున్నా. పుణ్యం వస్తుంది. తాతయ్య వద్దకు వెళ్ళు.
శ్రావణి: సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో నిన్ను మా నాయనమ్మను చూసి నేర్చుకోవాలి. నువ్వేమో క్షణం తీరిక లేకుండా రామకోటి రాస్తావు‌‌. మా నాయనమ్మ ఉదయం నుంచి రాత్రి దాకా ఆపకుండా టీ. వీ. సీరియల్స్ చూస్తుంది. కథలు చెప్పమంటే విసుక్కుంటుంది. మాకు నీతులు నేర్పాల్సిన ఆవిడ తానే కొత్త నీతులు నేర్చుకుంటుంది. నిత్య విద్యార్థిని. (పగలబడి నవ్వుతూ అంది శ్రావణి.)
శ్రావణి: సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ పెద్ద వాళ్ళను చూసి నేర్చుకోవాలి.
(వెంటనే సతీశ్ బుర్రలో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అందరినీ పక్కకు తీసుకు వెళ్ళి తన ఆలోచన చెప్పాడు.)
(వేసవి సెలవులను సంతోషంగా గడిపారు. ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళారు. తదుపరి వేసవి సెలవుల్లో అందరూ శ్రావణి ఇంటికి చేరినారు. అమ్మమ్మ కూడా వచ్చింది. పగలంతా ఆటలు ఆడిన తర్వాత సాయంత్రం ఓటీటీలో ఒక కన్నడ సినిమా చూస్తున్నారు. అందరూ నాన్ స్టాప్ గా నవ్వుతూ ఉన్నారు.)
అమ్మమ్మ: మీకు ఆ భాష ఎలా అర్థం అవుతుంది?
సతీశ్: ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పడుతున్నాయి. చదువుతూ అర్థం చేసుకుంటున్నాం.
నాయనమ్మ: మాకూ స్టోరీ చెబుతుంటే మేము కూడా నవ్వుతాం కదరా!
శ్రావణి: నీకు ఇంకో టీ.వీ. ఇచ్చాం కద నాయనమ్మ. సీరియల్స్ చూస్తూ నీతులు నేర్చుకో.
అమ్మమ్మ: ఏమిటి పెద్దవాళ్ళతో ఆ వెటకారం మాటలు. మంచి ప్రవర్తన అలవర్చుకో. 
సతీశ్: మీరు నీతి కథలు చెబుతూ మాకు మంచి నేర్పవచ్చు కదా!
(మరొక రోజు హిందీ సినిమా చూస్తున్నారు. చాలా ఆసక్తిగా చూస్తున్నారు.)
అమ్మమ్మ: సినిమా అంత బాగుందా? నాకూ స్టోరీ చెబుతూ సినిమా చూడవచ్చు కదా!
శ్రావణి: నీకు స్టోరీ చెబుతూ చూస్తుంటే కొన్ని డైలాగులు మిస్ అవుతాము. మమ్మల్ని వదిలేసి రామకోటి రాసుకో. సినిమా చూస్తే పుణ్యం రాదు.
అమ్మమ్మ: మీరంతా ఈ భాషలు ఎలా నేర్చుకున్నారు?
సతీశ్: మీరే మాకు గురువులు.
( ఆశ్చర్యపోయారు పెద్దవాళ్ళు.)
శ్రావణి: అవును అమ్మమ్మా! సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం. నువ్వేమో రామకోటి రాస్తూ, నాయనమ్మ సీరియల్స్ చూస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కదా! మీరే మాకు ప్రేరణ.
సతీశ్: దాన్ని సద్వినియోగం అనరు. మిమ్మల్ని చూసి మేము ఎప్పుడూ అలా సమయాన్ని వృథా చేయరాదు అని అనుకున్నా. తీరిక సమయాల్లో యూ ట్యూబ్స్ ద్వారా, పుస్తకాల ద్వారా హిందీ, ఇంగ్లీష్ భాషలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని అనుకున్నాం. సంవత్సరం లోపు అది సాధించాం. 
శ్రావణి: ఇది మీరూ ఫాలో కావచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషలను నేర్చుకోవడం ద్వారా మేము మన దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడకి వెళ్ళినా ఇబ్బంది లేదు. మీరూ తీరిక సమయాల్లో సమయం వృధా చేయకుండా ఏమైనా కొత్త విషయాలను నేర్చుకోవచ్చు.
నాయనమ్మ మరియు అమ్మమ్మ: మా కళ్ళు తెరిపించారు బుడతల్లారా! మీరు చాలా గ్రేట్. మీరే మా గురువులు.
‌‌
కామెంట్‌లు