తేటగీతి పద్యాలు;- ధనాశి ఉషారాణి-భాకరాపేట.తిరుపతి జిల్లా
 సొంత లాభమున్ కొంతలోకొంతనైన
ధారబోయుచు ధరలోని వారి కొరకు
సేవ జేయుటె భాగ్యమై జీవు లున్న
శాంతి పథమున సాగదా!సంఘమిలను.

 భర్తతోడుండ బ్రతుకంత భవ్యమగును
భార్య సంతోషముకు భర్త బాసటగును
భర్తలేనట్టి బ్రతుకది భారమగును
భర్తయే బలమయినిల్చు భార్యకెపుడు!!

 మనిషి మాటలు మారెను మమత మారి
మధుర మైనట్టి ప్రేమను మట్టుబెట్టె
కపట నటనను నేర్చెను కల్మషముతొ
బండరాయిగ మారెను నిండుయెడద!!

 మమత పంచిన వారని మరువలేక
కోరి తెలుపంగ నెంచిన వారలంత
మోసగాళ్ళకు చేరువై బుద్ధిలేక
చెరుపు గూర్చంగ నెంచుచు తిరుగుచుంద్రు!!


కామెంట్‌లు