ఆకాశదీపం ప్రాధాన్యత…-- సి .హెచ్.ప్రతాప్
 శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’వెళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.
ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం వుంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.
ఆకాశదీపం వెలిగించినా, దీపంలో నూనె పోసినా, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి… అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు.
ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెలుతుంటారు. ఈ ఆకాశదీపాన్నే యమ దీపమని కూడ వ్యవహరిస్తారు. అయితే సామాన్యంగా దీపం వెలిగించి దేవతలను, ఋషులను ఆహ్వానిస్తాం. కానీ, ఆకాశదీపారాధన చేసి యమ ధర్మరాజును తమ వైపు రావద్దు అని సూచిస్తున్నట్లుగా వేధాల సారాంశం. అప్పుడు ఆకాశ దీపాన్నిచూచి యముడు తిరిగి తనలోకానికి వెళతాడని ఆకాశ దీపం కనపడని ఊరికి, ఇంటికి వస్తాడని పురాణ వచనం. మోక్షం కోరినా, కోరకున్నా యముడు రావద్దని అందరూ అనుకుంటారు. కావున ప్రతి ఒక్కరూ ఆకాశదీపాన్ని ఈ కార్తిక మాసములో వెలిగించి ఇష్టదైవాన్ని, పితృ దేవతలను ఆహ్వానించి పితృపతిని మాత్రం ఆశీస్సులు అందజేయమని మాత్రమే కోరతారు. ఆకాశ దీపం ఉన్న ఇంటికి లక్ష్మీ నారాయణులు వస్తారని లేని ఇంటికి యమధర్మరాజు వస్తాడని స్కాందపురాణ వాక్యం.
దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించ వచ్చు. దీపానికి పూజచేసి దీప, ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీరం వెలిగించి ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయ వచ్చు.
దీపం జ్యోతిః

పరం బ్రహ్మ
దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్
దీప లక్ష్మీ నమోస్తు తే
కామెంట్‌లు