సుప్రభాత కవిత ; -బృంద
రాగాలన్నీ సరాగాలై
చిత్రవర్ణ రేఖలైన వేళ
భువన మనోరథం
ఈడేరిన పవిత్ర ప్రత్యూషవేళ

పూలదారుల్లో నీలి తారల
తీయని రంగుల కలలు
అందమైన బంధం అల్లుకుని
అవని అంతా ఆవరించిన వేళ


సుదూర తీరాల్లో నిండిన
మేఘమాలికల వలపువర్ణాలు
ఇలాతలంపై రంగుల
రంగవల్లి రచించిన వేళ

పుత్తడివెలుగుల్లో పువ్వులన్నీ
కొత్త అందాలు దిద్దుకుని
నూతన వధువులా
ముస్తాబైన మురిపాల వేళ

నీలినింగిలోని హరివిల్లు
కురిపించిన విరిజల్లులా
చుక్కలు దిగివచ్చినట్టు
నేలను పువ్వులువిరిసిన వేళ


పదునైన కిరణాల పలకరింపుకు
పరవశించి పులకరించిన 
పుడమితల్లి  పచ్చని పచ్చికను
చీరగా కట్టుకున్న వేళ

మేఘమాలికల మాటున
పయనించి వస్తున్న మిత్రునికి 

రాగమాలికలల్లి హృదయవీణ
ఆలపించు  ఆగమన  గీతాల

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు