కలల కలిమి: నిత్య సంపద ;-ఎం. వి. ఉమాదేవి బాసర.
దాగుడుమూతలాడే 
అదృష్టంతో రాజీపడినా 
కర్తవ్యం మరువనివేళ 
కనులనిండా దోబూచుల 
కలల కలిమిమాత్రం వెంటే.. !

చిక్కులు చీకాకుల మధ్య 
మనసనే నేస్తం మనకోసం 
రేకులఇంటినే 
చంద్రకాంత శిలల మధ్య 
సరోవరదృశ్యంగా మార్చిపోతుంది 
కొన్ని విచ్చుకోలేని ఆశాకలువలు 
వేచిఉంటాయి ఆలోచనకొలనులో !

చీకట్లో బాణంవేసే 
మధ్యతరగతి మందహాసం 
గృహస్థు తనభుజం తనేతట్టుకోగల 
భరోసా దోసిళ్ళకొద్దీ ఇచ్చేది 
కలల కలిమి!

కలలని కూడా సరిపడా 
కనలేని పరిస్థితిలో 
ఊహల పందిరిమంచంలో 
దంతపుబొమ్మలున్న అరల్లా.., 
కొన్ని అభ్యుదయ భావనల తంజావూరు చిత్తరువులై... 
పట్టుచీరలు చుట్టే పలుచని నూలుబట్టలా!! 
స్వచ్చత పాళ్ళు నిరూపిస్తూ..
కలల సంపద పెరుగుతూనే... !!
కానీ ఖర్చులేదు మరి !!

__🍃🌺🍃 _


కామెంట్‌లు