జంతువులు - ఉపయోగములు ; -రచన :: పవనశ్రీ. ;-సమీక్ష Dr కందేపి రాణీ ప్రసాద్.

  ఈ పుస్తకాన్ని పవనశ్రీ 1981 సంవత్సరంలో రచించారు . ఇదొక నవలిక . ముకుందరావు అనే మాస్టారు విద్యార్థులందరినీ ఊరి బయట కాలువ గట్టుకు తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకు ప్రకృతిలోని జీవులు - వాటి ఉపయోగాలను గురించి చెప్పాలనుకున్నాడు . మొదటగా కోతి గురించి ప్రశ్నిస్తూ అవి ఏమేమి తింటాయి అని విద్యార్థుల్ని ప్రశ్నలడగ్గా నేతిబీర , దానిమ్మ , జామ మొదలైన పండ్లన్నీ తింటుందని చెప్పగా ' అంటే కోతి శాకాహారి అని అన్నమాట ' అని మాస్టారు చెప్పారు . ఇలా విద్యార్థులనే ప్రశ్నలు వేసి వాళ్ళతోనే సమాధానాలు రాబట్టి ఆయా జంతువుల లక్షణాలు అవి మానవుల కెలా ఉపయోగపడతాయో వివరిస్తున్నారు ముకుందరావు మాస్టర్ . గొరిల్లాలకు ట్రైనింగిచ్చి సర్కస్లలో వాటిచేత రకరకాల పనులు చేయించి ధనాన్ని ఆర్జిస్తున్నారు . ఫలితంగా కొంతమంది మనుషుల పొట్ట నిండుతోంది . వేణు , బలరామ్మ , రాజు , సత్యం విద్యార్థులుగా అనేక రకాల ప్రశ్నలు వేసి జంతువుల గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నారు . అలాగే ఎలుగుబంటి గురించి  చెపుతూ అనాస , పనస , చెరుకును బాగా తింటాయని చెప్పారు . తేనె అంటే వీటికి అమితమైన ఇష్టమని , చెరుకురసాన్ని టన్ను దాకా తాగుతుందనీ చెప్పారు . అలాగే ఏనుగు గురించి తెలుసుకుంటూ కృష్ణదేవరాయలు , భోజరాజు వంటి మహారాజులు ఏనుగు అంబారీనెక్కి ప్రయాణం చేసేవారని గొప్పగా చెప్పారు . ఏనుగు దంతాలు ధర ఎక్కువ పలుకుతాయనీ , రాజులకు యుద్ధంలో గజదళం ఉంటుదనీ , అందుకే ' ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యి రూపాయలే ' అనే సామెత వచ్చినట్టు తెలుస్తుంది . ఆవులూ , గేదెలూ , మేకలూ , గొర్రెలూ వంటివి పాలు ఇవ్వడానికీ , ఆహారంగా ఉపయోగపడడానికీ , ఉన్నికీ శ్రేష్టం . పులుల గురించి చెపుతూ పులి చర్మానికీ , పులి గోర్లకూ చాలా ప్రాధాన్యముందని తెలుసుకుంటారు . జిత్తులమారి నక్క , దొంగ తోడేళ్ళు ఎలా మోసకారులో తెలుసుకున్నారు . ఖడ్గమృగం కొమ్ముతో మందులు తయారు చేస్తారనీ , కస్తూరి మృగం నుంచి కసూర్తిని తీస్తారని మాస్టారు చెప్పారు .
కామెంట్‌లు