జీవ వికాసం ;-రచన : వేమరాజు భానుమూర్తి--సమీక్ష : Dr కందేపి రాణీ ప్రసాద్

 ఈ పుస్తకాన్ని వేమరాజు భానుమూర్తి గారు 1953 వ సంవత్సరంలో రాశారు . దీనిని నార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితమిచ్చారు . ఇందులో జీవవికాసం , సృష్టిక్రమం , తండ్రుల తరహా , ప్రణయం - పరివారం , బ్రతుకుతెరువు , పునఃసృష్టి అనే వ్యాసాల ద్వారా వివిధ అంశాలను విపులంగా చర్చించారు . ఆ అంశాలన్నీ ' కిన్నెర ' పత్రికలో ప్రచురింపబడినట్లు ఆ పత్రికా సంపాదకులు పందిరి మల్లికార్జునరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ రచయిత తన ముందుమాటలో రాశారు . ఈ వ్యాసాలవల్ల నిత్యనూతనమై , మనోహరమై పలువిధాలుగా వికసిస్తున్న ఆధునిక విజ్ఞానం దశదిశలా విరజిమ్మే దివ్య సౌరభాన్ని , దాని బహుళ ప్రయోజనాలను గురించి తెలుగు ప్రజలకు తెలుస్తాయనడంలో ఎట్టి సందేహం లేదు . 
ఈ వ్యాసాల రచనకు ' సిరిల్ బిల్బీ ' అనే ఆంగ్ల రచయిత రాసిన ' హౌ లైఫ్ ఈజ్ హండ్రెడ్ ఆల్ అనే గ్రంథం ప్రధానంగా ఉపయోగపడినట్లుగా రచయిత చెప్పుకున్నారు . అంతేకాక వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా , ఎన్సైక్లోపీడియా బ్రిటానికా , వరల్డ్ ఆఫ్ యానిమల్ లైప్ , ' ద సీ అండ్ ఇట్స్ వండర్స్ ' అనే పుస్తకాల ఆధారంగా తానీ విషయ పరిజ్ఞానాన్ని పొందినట్లు కూడా రచయిత చెప్పారు . 
విజ్ఞానం అందరికీ అందుబాటులోకి రాకపోతే , జన సామాన్యం అంతకీ విజ్ఞాన దృష్టి అలవడనిదే , దేశానికి శ్రేయస్సూ , జాతికి ఉన్నతీ ఉండవని ” నా నమ్మకం . ఇందుకు ఆధునిక విజ్ఞాన విషయాలు అందరికీ తేటతెల్లమయ్యేట్టు చెప్పడం అవసరం ” అని వేమరాజు భానుమూర్తి గారే స్వయంగా ఈ జీవ వికాసం పుస్తకం ముందుమాటలో చెప్పారు . వర్తమాన కాలానికి కావలసిన వైజ్ఞానిక , సాంస్కృతిక , విద్యా విషయక గ్రంథాలు ఎక్కువగా వెలువడటం ఎంతో అవసరం . 
విజ్ఞానం వికసిస్తున్నకొద్దీ దాని ప్రభావం మన నిత్యజీవితంపై పడుతున్న కొద్దీ వైజ్ఞానిక గ్రంథాలు అందరికీ అందుబాటులోకి రావలసిన అవసరం కూడా నానాటికీ పెరుగుతూనే ఉంటుంది . 
ప్రాణికోటిలో సంతానాభివృద్ధి జరగకపోతే ఏమౌతుందో ' జీవ వికాసం ' ద్వారా వివరించారు . మాతృగర్భంలో అండములు వికసించి కూనలుగా క్రమ పరిణామం పొందడమనే విషయాలను ' తండ్రుల తరహా ’ లో విశదీకరించారు . జంతువులు పుట్టిన దగ్గర నుంచి పెరిగి తన ఆహారాన్ని తాను సంపాదించుకొని తన బ్రతుకు బతకడాన్ని ' బ్రతుకుతెరువు ' వ్యాసంలో వివరించారు
కామెంట్‌లు