*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0213)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సప్తర్షులు, మేరు, మేనాకుడు అందరూ గిరిరాజు కు నచ్చచెప్పుట - పార్వతి వివాహం శివునితో చేయడానికి అంగీకారం - సప్తర్షులు శివునికి జరిగినది తెలుపుట*
*నారదా! సప్త ఋషులలో వశిష్ఠుడు హిమవంతునకు ప్రాచీన కాలంలో అరణ్యకుడు అనేరాజు తన కుమార్తె అయిన పద్మను పిప్పలాదునకు ఇచ్చి వివాహము చేసిన విషయము వివరించాడు. "ఇప్పటి నుండి ఏడు దినముల తరువాత చక్కని దివ్యమైన ముహూర్తం ఉన్నది. మార్గశిర సోమవారం చాలా చక్కని దోషరహితమైన రోజు. పాప గ్రహములు తమ చూపులు ఆ వైపుగా చూడలేవు. ఇంత చక్కని ముహూర్తానికి మూల ప్రకృతియు, జగదంబ అగు నీ కుమార్తెను జగత్పిత, భగవంతుడు అగు శివునికి ఇచ్చి వివాహము జరిపించి కృతార్ధుడవు అవు" అని వశిష్ఠుడు చెప్పగా, తన భార్య మేనకతో, మేరు, సహ్య, గంధమాదన, మందరాచల, మైనక మొదలగు పర్వతాలతో " ఓ పర్వతేశ్వరులారా! మీరందరూ సప్తర్షులు చెప్పిన మాటలు విన్నారు. ఇప్పుడు నేను ఏమి చేయాలో చెప్పమని" అడిగాడు హిమవంతుడు.*
*హిమవంతుని మాటలు విన్న మిగిలిన పర్వతేశ్వరులు, "గిరి రాజా! నీ కుమార్తె పార్వతి శివుని కోసమే పుట్టింది. ఆమెను శంభునకు ఇచ్చి వివాహము చేయడమే ఉచితము. సప్తర్షులు కూడా ఇదే వక్కణిస్తున్నారు. కనుక, నిస్సందేహంగా, నీ కుమార్తెను శంభునకు ఇచ్చి వివాహము జరిపించు" అని తమ అభిప్రాయం చెప్పారు. వీరి అభిమతం విన్న హిమవంతుడు సమతోషించాడు. పర్వతేశ్వరులు జరుగవలసినదే చెప్పారు అని కాళి సంతోషపడి మనసులోనే ఆనందించింది. అరుంధతీ దేవి వివిధ ఇతిహాసాల నుండి అనేక కథలను వినిపించి మేనకకు నచ్చ జెప్పింది. విషయం అర్థమైన మేనక కూడా పార్వతి పరమేశ్వరుల వివాహం విధి నిర్ణయం అని నమ్మి తన ఒప్పందాన్ని, సమ్మతిని తెలియజేసింది.*
*గిరి శ్రేష్టుడైన హిమాచలుడు సప్తర్షులకు, అరుంధతీ దేవికి చందన కర్పూరాది సేవలు చేసి వారికి భోజనము వడ్డించి తాను కూడా ఆహారం తీసుకున్నాడు. తమ కుమార్తెను అన్ని విధాలా అలంకారము చేసి సప్త ఋషుల దగ్గర కూర్చండ బెట్టి, "మహానుభావులారా! ఇప్పుడు నాకు విషయం అవగతం అయింది. శివాశివుల వివాహం జరగడం తథ్యం. కనుక, నేను, మేనక మా కుమార్తె పార్వతి వివాహం శంభునితో జరిపించడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాము. ఇకపై జరగవలసిన కార్యాన్ని మీరు జరిపించండి" అని ప్రార్థన చేసాడు. అప్పుడు సప్తర్షులు గిరిజను ఉద్దేశించి " శివే! నీవు శివునకు సౌఖ్యమును కూర్చెదవు. నీకు శుభం కలుగు గాక" అని ఆశీర్వదించారు. ఇక శివాశివుల కళ్యాణం జరగడం అవస్యం అని నమ్మిన వారందరూ కైలాస ములో పరమేశ్వరుని చేరి " మహాదేవా! పరమేశ్వర! మా ప్రార్థన వినండి. గిరిరాజు అయిన హిమవంత దంపతులు తమ కుమార్తెను మీకు ఇచ్చి వివాహము చేయడానికి సిద్దంగా ఉన్నారు. కనుక మీరు పార్వతిని చేపట్టి మీ మాట నిలబెట్టుకోండి" అని చెప్పారు.*
*ఈ మాటలకు సంతసించిన శంభుడు, సప్తర్షులతో  " మునులారా! కాగల కార్యాన్ని పూర్తి చేయండి. నాకు వివాహము విషయంలో అవగాహన లేదు, అందువల్ల మీరు ముందుండి కార్యక్రమం జరిపించండి." అని పలికి ఈశానునితో " స్వామి! బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, రుషులు, మునులు, యక్షులు అందరినీ పిలిపించండి. వారే దగ్గర ఉండి మీ వివాహము ఉమతో జరిపిస్తారు " అని చెప్పి తమ ఇళ్ళకు వెళ్ళారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు